దిల్లీలో ప్రభుత్వం ఎవరు నడుపుతారో అంతుపట్టడం లేదు. మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇ.డి.) గత మార్చిలో అరెస్టు చేసిన కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇ.డి. మోపిన కేసులో ఆయనకు బెయిలు మంజూర్ అయింది. కానీ ఆయన విడుదల కాకుండా చేయడంకోసం సీబీఐ మరో కేసు మోపింది. అందువల్ల కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు. జైలులో ఉంటూ పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తానని కేజ్రీవాల్ భీష్మించుకు కూర్చుకున్నారు. దీనికి అభ్యంతరం చెప్తూ దిల్లీ హైకోర్టులో దాఖలైన మూడు కేసులనూ కొట్టేశారు. అంతే కాదు ఆ అర్జీలు పెట్టుకిన్న వారికి యాభయ్యేసి వేల జరిమానా కూడా విధించారు. దిల్లీ రాష్ట్రం కాని రాష్ట్రం. పేరుకు రాష్ట్రప్రతిపత్తి ఉన్నా సంపూర్ణ పాలనాధి కారాలు లేవు. శాసనసభ, మంత్రివర్గం ఉంటాయి కానీ ఆ ప్రభుత్వానికి పాలనా నిర్వహణలో సంకెళ్లు ఉంటాయి. ఆ సంకెళ్లనే మామూలు భాషలో లెఫ్టినెంట్ గవర్నర్లు అంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ ఒకటే అయినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రభుత్వ నిర్వహణలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. కానీ 2015లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా అనేక అడ్డంకులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కల్పిస్తోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరవాత లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న నజీబ్ జంగ్, అనిల్ బైజాల్, ఇప్పుడు వినయ్ కుమార్ సక్సేనా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించే బదులు ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తున్నారు. అనేక మంది గవర్నర్లు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా తమదగ్గరే ఉంచుకునే వారు. ఈ ధోరణిని సుప్రీం కోర్టు తప్పుపట్టడమే కాకుండా గవర్నర్ల హద్దులేమిటో తెలియ చెప్పింది. మోదీ హయాంలో గవర్నర్లుగా నియమితులైన వారందరూ ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్న చోట ప్రతిపక్ష పాత్రే పోషిస్తున్నారు. దిల్లీ శాసనసభలో మొత్తం 70 సీట్లు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాలు ఉన్నాయి. ఎనిమిది స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. దిల్లీ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడైన విజేంద్ర గుప్తా పేరు సాధారణంగా వినిపించదు. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం నిరంతరం వార్తల్లోనే ఉంటారు. ఆయన కేంద్ర ప్రభు త్వానికి ఫిర్యాదులు చేయడం, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా తొక్కి పెట్టడం లాంటి పాతకాలపు పద్ధతులు అనుస రించారు. ఆయన నేరుగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దిల్లీ ప్రభుత్వాన్ని దుయ్యబడ్తూ పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. ‘దుష్పరిపాల నకు నిదర్శనం దిల్లీ’’ అని ఆయన గత ఆగస్టు 28న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాసం రాశారు. ఆయన ఇలా రాశారు: ‘‘యు.పి.ఎస్.సి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఒక కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో నీరు చేరినందువల్ల మరణించారు. ఒక మురుగు కాలవలో మునిగిపోతున్న తన బిడ్డను కాపాడే క్రమంలో ఓ తల్లి ప్రాణాలు పోగొట్టు కుంది. నేల మీద పడిన విద్యుత్ తీగలను తాకిన కొంతమంది వ్యక్తులకు విద్యుదాఘాతం తగిలింది. అయినా అధికారంలో ఉన్న రాజకీయపార్టీ తమ విజయాల గురించి పత్రికలలో పేజీలనిండా వ్యాపార ప్రకటనలు జారీ చేసింది’’ అని ఆ వ్యాసంలో రాశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తున్నా రన్న మాట.దిల్లీలో చాలా ఇళ్లకు గొట్టాల ద్వారా గ్యాస్ సరఫరా కావడం లేదని కూడా రాశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అన్న విషయం సక్సేనాకు తెలియదనుకోలేం. ఈ వ్యాసంలో ప్రతి వాక్యమూ దిల్లీలోని అన్ని సమస్య లకు కేజ్రీవాల్ ప్రభుత్వాన్నే లెఫ్టినెంట్ గవర్నర్ దోషిగా నిలబెట్టారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న సక్సేనా ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తూ ఏకంగా పత్రికలలో వ్యాసాలు రాయడం బేసబబు మాత్రమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. సక్సేనా రాసిన వ్యాసంలో రచయిత పేరు తొలగించి చూస్తే ఏ ప్రతిపక్ష నాయకుడో రాసి ఉంటాడనిపిస్తుంది. ఆయన ప్రభుత్వ లోపా లను వెతికి వెతికి ఏకరువు పెట్టారు. ఈ వ్యాసం ఎవరిని ఉద్దేశించి రాసి నట్టు? దిల్లీ ప్రభుత్వాన్నా లేక దిల్లీ ప్రజలనా? పైగా దిల్లీకి చెందిన అంశా లను తాను ముఖ్యమంత్రికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉండవలసిన సత్సంబం ధాలను దృష్టిలో ఉంచుకుని రాశానని సక్సేనా అంటున్నారు. వాస్తవానికి రాజ్యాంగవ్యవస్థ ఆయన చేసిన పనివల్ల చిన్నాభిన్నమై పోయింది. ఇందులో ఆయన పాత్ర లేదా? కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదా? 2023 మేలో కేజ్రీవాల్ కు సంబంధించిన కేసులో దిల్లీ పరిపాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చట్టాలు చేయడం, అధికారుల బదిలీ అధి కారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చింది. అంతే కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను వమ్ముచేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికారుల నియామకం, బదిలీలలో లెఫ్టినెంట్ గవర్నర్ కే సర్వాధికారాలు కట్టబెట్టింది. దిల్లీ పరిపాలనా వ్యవస్థ ప్రత్యేకమైంది అని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచి 2023 మే 11న తీర్పు చెప్పింది. దిల్లీ ఇతర కేంద్ర పాలితప్రాంతాల లాంటిది కాదనీ తెలియ జేసింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమికి సంబంధించి మినహా మిగతా అంశాలన్నింటిలో అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును తిరగతోడుతూ 2023 మే 19వ తేదీన ఆర్డినెన్సు జారీచేసి సుప్రీంకోర్టు తీర్పును వమ్ము చేసింది. 2023 ఆగస్టులో ఈ ఆర్డినెన్స్ చట్ట రూపంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును ఎందుకూ కొరగాకుండా చేసింది. దిల్లీ ప్రభుత్వం చిన్న చిన్న విషయాలపై కోర్టుకెక్కు తుందని సక్సేనా తన వ్యాసంలో రాశారు. ఆ చిన్న చిన్న విషయాలు ఏమిటో ఆయన చెప్పలేదు. దిల్లీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని మరికొంతమందిని మద్యం కుంభకోణంలో ఇ.డి., సీబీఐ అరెస్టుచేస్తే కోర్టును ఆశ్రయించడం తప్పవుతుందా! లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాలుచేస్తూ కోర్టుకెళ్లడం చిన్న విషయమా! కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన కేసులోనే ఇ.డి., సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా దుయ్యబట్టిందో సక్సేనాకు తెలియదేమో! సక్సేనా లేఖ ప్రచురితం కాగానే శాసనసభలో బీజేపీపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా నాయకత్వంలో ఒక ప్రతినిధివర్గం రాష్ట్రపతిని కలిసి ముఖ్యమంత్రి జైలులో ఉండడంవల్ల పరిపాలన సవ్యంగా సాగడంలేదని ఫిర్యాదు చేసింది. నిందితుడిగా జైలులో ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనా విధులు కొనసాగించకూడదని రాజ్యాంగంలో గానీ ఏ చట్టంలో గానీ లేదు. అందుకే కోర్టులు జైలునుంచి పాలన కుదరదని తీర్పు ఇవ్వడం లేదు. వర్షాల కారణంగా దిల్లీ ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని తన వ్యాసంలో సక్సేనా కడివెడు కన్నీళ్లు కార్చారు. ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాలలో కూడా ఎదురైందిగదా! అయినా సకలాధికారులు తనవే అనుకుంటున్నప్పుడు రుతుపవనాలు బీభత్సం సృష్టించకుండా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏదో మంత్రంవేసి ఉండొచ్చుగా! బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట లెఫ్టినెంట్ గవర్నర్లు, గవర్నర్లు సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నారు.
అనన్య వర్మ