Monday, January 30, 2023
Monday, January 30, 2023

సాగునీటి కోసం కర్నూలు జిల్లా పడిగాపులు

కె.రామాంజనేయులు

హంద్రీనీవా ద్వారా 106 చెరువులు నింపడం ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిచ్చి యుద్దప్రాతిపదిక పైన చిత్తశుద్దితో పూర్తి చేయాలి. చివరి ఆయకట్టు వరకు పంట కాలువలను పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన ఉద్యమ కార్యాచరణకు రైతాంగం, రాజకీయ పక్షాలు, ప్రజలు పూనుకోవడమే ఏకైక పరిష్కార మార్గం.

ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్లైనా రాయలసీమ కరువు కాటు నుండి బయటపడడం లేదు. నానాటికీ పెరుగుతూనే ఉన్న కరువు కరాళ నృత్యంతో కునారిల్లిపోతూనే ఉంది. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి అయినా నేటికీ రాయలసీమలో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే దుర్బర దుస్థితే కొనసాగుతోంది. ప్రత్యేకించి కర్నూలు జిల్లా సాగునీటి కోసం పడిగాపులు పడుతోంది. దేశంలోనే అత్యల్ప వర్షపాత ప్రాంతాల్లో ఒకటి కర్నూలు జిల్లా. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు ఆనుకొని ఉన్న ఈ జిల్లాలోని పడమటి ప్రాంతాలు డోన్‌, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల రైతులు, వ్యవసాయ కూలీలు ఏటా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, హైదరాబాదు, మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలకు వలసలు వెళుతూ అత్యంత దయనీయమైన జీవితాలను గడుపుతున్నారు.
వెనుకబాటుతనాన్ని పోగొట్టి, శాశ్వతంగా కరువును పారద్రోలాలంటే రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించడమే ఏకైక పరిష్కారమార్గమని సీపీఐ, ప్రజాసంఘాలు రాయలసీమ వ్యాపితంగా సుదీర్ఘ పోరాటాలు చేసాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1985లో కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు వెనుక భాగాన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. దీనిద్వారా మద్రాస్‌కు15 టీఎంసీల తాగునీరు అందిస్తూ, రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, కెసికెనాల్‌ స్థిరీకరణకు నీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయ్యింది. ఆ తర్వాత వరద జలాల కింద హంద్రీ నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రూపకల్పన జరిగింది. 2004లో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు, గాలేరు నగరి ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు ఉపయోగ పడే విధంగా 2006లో పనులు ప్రారంభించారు. కృష్ణానది నుండి నంది కొట్కూరు సమీపంలో ఉన్న మల్యాల నుండి ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ హంద్రీనీవా ప్రాజెక్ట్‌ కర్నూలు జిల్లా పడమటి ప్రాంతాలైన కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర మండలాల మీదుగా కాలువ నిర్మాణం, కళ్యాణదుర్గం వద్ద ఉన్న జీడిపల్లి వరకు కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టారు. మొత్తం ఆరు లక్షల ఎకరాల ఆయకట్టులో కర్నూలు జిల్లాకు కేవలం 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాకు మూడు లక్షల 60 వేల ఎకరాలు, కడప జిల్లాకు 30 వేల ఎకరాలు, చిత్తూరు జిల్లాకు లక్ష ఎకరాలకు ఆయకట్టును నిర్దేశించారు. అయితే మల్యాల నుండి ప్రారంభమైన హంద్రీనీవా ప్రధాన కాలువ నీటి సామర్థ్యం పెంచి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా కాలువకు సమీపంలో ఉండే కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, డోన్‌, ప్యాపిలి, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ప్రాంతాలలో 106 చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళన చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఇరిగేషన్‌ అధికారులు మొదటిదశలో హంద్రీకాలువ ద్వారా ఎడమ వైపు నుండి 68 చెరువులు నింపేందుకు, రెండవ దశలో 38 చెరువులు కుడివైపు కాలువ నుండి ఎత్తిపోతల ద్వారా నింపేందుకు అవకాశం ఉందని చేసిన ప్రతి పాదనను ఆమోదించారు. 2018లో చెరువులు నింపేందుకు పైపులైన్‌ ద్వారా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2019లో వైయస్సార్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి.
కర్నూలు జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో వర్షాలు సకాలంలో రాక తీవ్ర కరువులతో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక పంట మాత్రమే పండుతోంది. ఈ పంట కరువులు వచ్చిన మూడు సంవత్సరాల అప్పులు తీర్చ డానికి కూడా సరిపోవడంలేదు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం దీనికి అదనపు కారణం. ఈ పరిస్థితులు అధిగమించాలంటే 106 చెరువులు నింపాలి. దీనివల్ల మూడు ప్రయోజనాలు కలుగుతాయి. 1. ఏటా 20 వేల ఎకరాల్లో రెండు పంటలు చెరువు ఆయకట్టు కింద పండుతాయి 2.150కి పైగా గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది 3. చెరువులు నింపడం వల్ల చుట్టుపక్కల భూముల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో పుష్కలంగా అందే నీటితో అదనంగా మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా రైతులు పండిరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డోన్‌, పత్తికొండ ప్రాంతాల రైతుల సదస్సు డోన్‌లో జరిగింది. కాలువ ద్వారా నింపేందుకు అవకాశం ఉన్న చెరువుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ప్రచార జీపు జాతాలను నిర్వహించారు.
డోన్‌ మండలంలో గతంలో జలానికి దుర్గంగా ఉన్న జలదుర్గం ప్రాంతంలో జలాలు మాయమయ్యాయి. ప్రస్తుతం తాగునీటికి కూడా తీవ్ర కొరతే. నీటి ఊటలకు పేరుగాంచిన ఊటకొండ చెరువులో వర్షాకాలమైనా ఆగస్టు 20 దాటినా చుక్క నీరు కూడా లేక చెట్లు మొలిచాయి. గుడిపాడు చెరువుకు నీరు రాక ఎన్నో సంవత్సరాలైంది. ప్యాపిలి, కలచట్ల, చిన్నపూజర్ల, పెద్దపూజర్ల, కొత్త బురుజు, గుండాల చెరువులు వర్షాలకు నిండకపోవడంతో నీరు నిల్వ ఉండాల్సిన చెరువుల లోతట్టులో భారీ తుమ్మ, ఫారం చెట్లు పిచ్చి చెట్లు పెరిగి చెరువులు ఉనికి కోల్పోతున్నాయి. గత పదేళ్ళుగా వర్షాలు సరిగా లేక పత్తికొండ నియోజక వర్గంలో చెరువులు వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం పక్షులు తాగడానికీ చుక్కనీరు లేదు. చెరువులు నింపడానికి ఉపయోగించే నీటిపైపులు సగం చెరువుల్లో కూడా అందుబాటులో లేవు. అత్యంత నత్తనడకతో చెరువులు నింపే నిర్మాణ పనులు సాగుతున్నాయి. హంద్రీనీవా కాలువలో నీరు పారడం మొదలై పదేళ్ళు గడుస్తున్న ప్పటికీ జిల్లాలో నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టు గాని, నూతనంగా చెరువులు నింపడం ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టుకు గాని నీరు వచ్చే జాడ కానరావడం లేదు. మొదటి దశలో 68 చెరువులను నింపేం దుకు 224.21 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు 110 కోట్ల రూపా యలను నిధులు ఖర్చు చేశామని, 53% పనులు పూర్తి అయ్యాయని చెబుతున్న ప్పటికీ క్షేత్ర స్థాయిలో జరిగిన నిర్మాణ పనులను పరిశీలించినప్పుడు అధికారులు చెబుతున్న మాటలకు ఆచరణలో జరిగిన నిర్మాణ పనులకు పొంతన లేదు.
పోలవరం పూర్తి కాకముందే కృష్ణా జలాలను రాయలసీమకు వినియోగించు కునేందుకు అవసరమైన గుండ్రేవుల రిజర్వాయర్‌ వేదవతి ప్రాజెక్ట్‌ ఎత్తిపోతల పథకం వంటి నిర్మాణ పనులు కాగితాలతో పరిమితమయ్యాయి. కరువు ప్రాంతం రాయలసీమకు ఏటా కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజ్‌ ద్వారా సక్రమంగా వినియోగించుకోలేక వృధాగా సముద్రం పాలవుతున్నాయి. కృష్ణానదిపై సంగమేశ్వరం ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్రం మోకాలడ్డుతున్నది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తూనే, తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో చర్చించి గుండ్రేవుల రిజర్వాయర్‌ను, ఎలాంటి వివాదం లేని కర్నూలు జిల్లాలో పడమటి ప్రాంతాలకు ఉపయోగపడే వేదవతి ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలి.ఇందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టులో కర్నూలు జిల్లాలో నిర్దేశించిన ఆయకట్టుకు 80 వేల ఎకరాలను, హంద్రీనీవా ద్వారా 106 చెరువులు నింపడం ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిచ్చి యుద్దప్రాతిపదిక పైన చిత్తశుద్దితో పూర్తి చేయాల్సి ఉంది. చివరి ఆయకట్టు వరకు పంట కాలువలను పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన ఉద్యమ కార్యాచరణకు రైతాంగం, రాజకీయ పక్షాలు, ప్రజలు పూనుకోవడమే ఏకైక పరిష్కార మార్గం.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img