ఎం కోటేశ్వరరావు
పది రోజులుగా బుడమేరు వరదతో విలవిల్లాడుతున్న విజయవాడ, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాల రైతాంగం కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి వివరించారు. అయినా ఇంతవరకు వరద సాయం గురించి ఎలాంటి ప్రకటనలూ లేవు. లెక్కలు డొక్కలు తరువాత చూసుకుందాం ముందుగా కొంత సాయం అందిస్తామన్న భరోసా కూడా వెలువడలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రాకను చంద్రబాబు నాయుడి ఘనతగా కొందరు వర్ణించారు. మంచిదే అంతకంటే కావాల్సిందేముంది ? పర్యటనలు కాదు కదా కావాల్సింది ఫలితాలు. మంత్రి వచ్చారు చూశారు వెళ్లారు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అనేక చోట్ల రైతులు అరటి, పసుపు, వరి, కూరగాయల పంటలను పూర్తిగా నష్టపోయినట్లు శివరాజ్ సింగ్ విలేకర్లతో చెప్పారు. గత ప్రభుత్వం కేంద్ర ఫసల్ బీమా పధకాన్ని వినియోగించుకోలేదని, ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్లుందని కూడా అన్నారు. విపత్తుల సహాయ నిధి(ఎస్‌డిఆర్‌ఎఫ్) రు.3,448 కోట్లు రాష్ట్రం దగ్గర ఉందని తక్షణ సాయం కింద దానిని వినియోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వెళ్లారు. ఆ నిధి రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చేదే, ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తారు. తెలంగాణాలో అలాంటి నిధి గురించి కేంద్ర మంత్రులు సెలవిచ్చారు. కేంద్రం ప్రత్యేకంగా జాతీయ విపత్తుగా పరిగణించి ఇచ్చే మొత్తం సంగతేమిటన్నది ప్రశ్న. ఫసల్ బీమా సంగతి తరువాత. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక నష్టం అంచనాగా రు.6,880 కోట్లని కేంద్రానికి నివేదించి సాయాన్ని కోరింది. మొత్తం రెండు లక్షల ఇండ్లు మునిగిపోయి దెబ్బతినట్లు అంచనా. ఆదివారం నాటికి మరణించిన వారి సంఖ్య 45కు చేరింది.
చమురుశుద్ధి కర్మాగారం కబుర్లేనా?
మచిలీపట్నంలో ఏర్పాటు కానుందని ఊరించిన చమురుశుద్ది కర్మాగారం వట్టి కబుర్లేనా అన్న అనుమానం కలుగుతోంది. ఒక రిఫైనరీని ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు చమురు శుద్ది, పెట్రోకెమికల్ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి సాధించిన చంద్రబాబు’’ అనే శీర్షికతో 2024 జూలై 11న బిజినెస్ వరల్డ్ పత్రిక వార్త రాసింది. దాని సారాంశం ఇలా ఉంది. ‘‘అరవైవేల కోట్ల రూపాయలతో చమురుశుద్ది, పెట్రోకెమికల్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారు. దీని సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్(బిపిసిఎల్) సీనియర్ అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. జూలై 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చమురుశుద్ధి కేంద్ర ఏర్పాటు ప్రకటన చేయటమే తరువాయి. చంద్రబాబుబిపిసిఎల్ అధికారుల సమావేశంలో రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకాకుళం, మచిలీపట్నం, రామయపట్నాలలో గల అవకాశాల గురించి పరిశీలించారు. జూలై 23వ తేదీన బడ్జెట్‌లో ప్రకటించేంతవరకు ఎక్కడ అన్నదాన్ని వెల్లడిరచరు. అధికారులు దీని గురించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జూలై 10న చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ఇలా రాశారు ‘‘వ్యూహాత్మకంగా దేశంలోని తూర్పు తీరంలో ఉన్న మా రాష్ట్రంలో పెట్రోకెమికల్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నేను భారత పెట్రోలియం కార్పొరేషన్ చైౖౖర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రృష్ణ కుమార్ నాయకత్వంలోని ప్రతినిధులను కలుసుకున్నాను. అరవై నుంచి డెబ్బయి వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాము. తొంభై రోజులలో సాధ్యా సాధ్యాల నివేదిక కావాలని నేను కోరాను. ఈ ప్రాజెక్టుకు సుమారు ఐదువేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా దాన్ని సమకూర్చే ందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ పరిణామం చంద్రబాబు నాయుడికి పెద్ద విజయం’’ అని బిజినెస్ వరల్డ్ రాసింది. ఇతర పత్రికలు కూడా ఇలాగే రాశాయి. బిపిసిఎల్ చమురుశుద్ధి కర్మాగారం మచిలీపట్నం రూపురేఖలనే మార్చివేస్తుందని గనులు, ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు జూలై 14న దక్కన్ క్రానికల్ పత్రిక రాసింది. కాకినాడ వద్ద రిఫైనరీ యూపీకి? ఈ సందర్భంగా కాకినాడ దగ్గర బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటు గురించి కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇద్దరూ జనసేనకు చెందిన వారే గనుక ఎక్కడ వచ్చినా ఆ ఘనత ఆ పార్టీ ఖాతాలోనే పడుతుందని, ఎక్కడో అక్కడ రావటం ముఖ్యమని చెప్పారు. అయితే జూలై 23వ తేదీ, కేంద్ర బడ్జెట్ రానూ వచ్చింది, ఆమోదమూ పొందింది. రిఫైనరీ ఏర్పాటు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు చేయలేదో ఏ పార్టీ నేతా ఎక్కడా ప్రస్తావించినట్లు కనపడదు. ఈ లోగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్
పూర్వపు అలహాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు బ్లూమ్‌బర్గ్(మీడియా) వార్త రాసింది.ఓఎన్‌జిసి`బిపిసిఎల్ సంయుక్త భాగస్వామ్యంలో 70వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు దాని గురించి బాగా తెలిసిన నలుగురు వ్యక్తులు చెప్పినట్లు అది తెలిపింది. ప్రయాగరాజ్‌లో బిపిసిఎల్‌కు భూమి కూడా ఉన్నట్లు పేర్కొన్నది. ఆ వార్తలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు గురించి కూడా బిపిసిఎల్ పరిశీలిస్తున్నట్లు ఆ నలుగురిలో ఇద్దరు చెప్పినట్లు తెలిపింది. ఆ రాష్ట్రం ఇవ్వచూపిన ప్రోత్సాహకాలు, ఏర్పాటు అవకాశాల గురించి సలహా ఇచ్చేందుకు అమెరికాలోని ఒక కంపెనీని కూడా బిపిసిఎల్ నియమించినట్లు కూడా బ్లూమ్‌బెర్గ్ పేర్కొన్నది.ఇ మెయిల్స్ ద్వారా ఓఎన్‌జిసి, బిపిసిఎల్ ప్రతినిధుల స్పందన కోరగా వారి నుంచి వెంటనే ఏమీ రాలేదని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎన్‌డిఏ కూటమికి ఘనవిజయం లభించింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 2019లో 80కి గాను తెచ్చుకున్న 64 సీట్లలో 2024లో 30 సీట్లు, పదిశాతం ఓట్లూ పోగొట్టుకుంది. చివరికి ఆయోధ్యలో ఓడిపోయింది, వారణాసిలో నరేంద్ర మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందనే వాతావరణం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యంలేదు. బహుశా ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌లో రిఫైనరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే కంపెనీ అంత భారీ మొత్తాల పెట్టుబడితో రెండు చోట్ల రిఫైనరీలను పెట్టే అవకాశం ఉందా? నరేంద్రమోదీ, బీజేపీికి లోక్‌సభలో ఏడోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌ను నిలుపుకోవటం ముఖ్యం అన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత చేసినా తెలుగుదేశానికి తోక పార్టీగా ఉండటం తప్ప ఇప్పటికిప్పుడు స్వంతంత్రంగా ఎదిగే అవకాశాలు లేవన్నది స్పష్టం. రిఫైనరీ గురించి ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు గనుక చంద్రబాబు వెంటనే అప్రమత్తమై రాష్ట్రానికి తీసుకువస్తారా ? తన పలుకుబడిని వినియోగిస్తారా ? పెద్ద పరీక్షే మరి !