Monday, February 6, 2023
Monday, February 6, 2023

సింగరేణిలో అవినీతిపై సీబీఐని వేయరే?

మేరుగు రాజయ్య

సింగరేణి అంటేనే ఆరిపోని మంట. బొగ్గు మంట ఆగితే చీకటి సవారీ చేస్తుంది. ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి కావడానికి 0.538 కిలోగ్రాముల బొగ్గును మండిరచాలి. గత ఏడాది (2020) నవంబర్‌ 30 నాటి లెక్కల ప్రకారం భారత్‌లో బొగ్గు ఇంధనంగా 1,99,594.50 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. అందుకే బొగ్గును నల్ల బంగారంగా ఎలుగెత్తి కొలుస్తున్నాము. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన 1889లో 59,671 టన్నులను తవ్వి తీశారు. గడచిన ఆర్థిక సంవత్సరం 2019-2020లో 64.02 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 2020`2021లో కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా 50.58 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. సింగరేణిలో భూగర్భంలోని బొగ్గును పైకి తీసి మార్కెట్‌ చేసుకునేందుకు చట్టబద్ధమైన సౌకర్యాలు, ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి. మానవ తప్పిదాలైన అవినీతి, దుబారా, దొంగతనం, నిర్లక్ష్యం, ప్రమాదాలను నియంత్రించడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అయినప్ప టికీ సింగరేణిలో జరిగిన అనేక అవినీతి, దుబారా ఆరోపణ లపై న్యాయపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనే సింగరేణిలో వచ్చిన అనేక అవినీతి ఆరోపణలపై బి.వి.మోహన్‌ రెడ్డి, సుద్దాల దేవయ్య అధ్యక్షతన రెండుసార్లు అసెంబ్లీ హౌస్‌ కమిటీ పర్యటించి దుబారాను ప్రత్యక్షంగా చూసింది. అవినీతి ఆరోపణల ఫిర్యా దులను స్వీకరించి ప్రభుత్వానికి నివేదించింది. అయినా ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. గతంలో కొత్తగూడెం, మణు గూరు, గోదావరి ఖని, మంథని ప్రాంతాలలో జరిగిన బొగ్గు, స్క్రాప్‌, డీజిల్‌ దొంగతనాలపై కేసులు నమోదయ్యాయి. వాటి విచారణ జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్ళడంతో అధి కారులు రంగప్రవేశం చేసి మెగా లోక్‌ అదాలత్‌ వంకతో దాదాపు 74 కేసులను 2017 ఫిబ్రవరి 11న రాజీ చేసారు. డైరెక్టర్లతో సంబంధం లేకుండా డివిజన్‌ స్థాయి ఉన్నతాధికారులే మెమోలు జారీ చేసి కేసులు మాఫీ చేశారు. ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులలోని మట్టి తొలగింపు కాంట్రాక్టు పను లలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. మట్టి రవాణా, మట్టిని తొలగించిన స్థలం, మట్టి బరువు కొలతల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి. గోదావరిఖని ఓపెన్‌కాస్ట్‌ల్లో తప్పుడు కొలతలతో కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించిన కోట్ల రూపాయలు వెలుగులోకి రాగా ఎక్సెస్‌ పేమెంట్‌ పేరుతో సదరు కాంట్రాక్టర్ల నుండి తిరిగి డబ్బు వసూలు చేసారు కూడా. అక్రమాలకు పాల్పడిన అధికారులపై నామమాత్ర మైన చర్యలతో సరిపుచ్చారు. అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులలో బొగ్గు తీసిన చోట రక్షణ కోసం నింపే ఇసుక పనిలోనూ కుంభకోణమే. 2003 జూన్‌ 16న గోదావరిఖని 7 ఎల్‌ఇపి (లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ప్రాజెక్ట్‌)లో జరిగిన జల సమాధి ప్రమాదంలో 17మంది కార్మికులు నీటమునిగి చనిపోయారు. అప్పటి హైకోర్టు న్యాయమూర్తి బిలాల్‌ నజ్కీ కోర్టాఫ్‌ ఎంక్వైరీలోనూ ఇసుక సరిగా నింపనందునే పెరిగిన నీటి నిల్వలు బద్దలై వెల్లువగా వచ్చిన నీటి ప్రవాహంలో 17 మంది కార్మికులు చనిపోయినట్లుగా కార్మిక సంఘాలు నివేదించినవి. జిడికె 5 ఇంక్లైన్‌ అండర్‌ గ్రౌండ్‌మైన్‌ను ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌గా తవ్వుతామని తెలిసి కూడా దాదాపు రూ. 3 కోట్ల విలువ గల 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నేల మీద పోయించారు.
సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకే సరఫరా అవుతుంది. మిగతా దాదాపు 70 లక్షల టన్నుల బొగ్గును ప్రైవేటు పరిశ్రమలకు అమ్ముతారు. ప్రైవేటు బొగ్గు అమ్మకం, రవాణాలో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి. కొత్తగూడెం రుద్రంపూర్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ నుండి ఈ ఏడాది (2021) జనవరి 2న ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గును అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను సెక్యూరిటీ గార్డు పట్టుకుని అధికారు లకు చెప్పినా ఉదాసీనంగా వ్యవహరించారు. తాజాగా మంచి ర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌లో జరిగిన డీజిల్‌ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. డీజిల్‌ సరఫరా కాంట్రా క్టు ఒప్పందం ప్రకారంగా 20 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లతో వారానికి ఐదు ట్యాంకర్ల డీజిల్‌ను సరఫరా చేయాలి. కానీ అధికారులు కుమ్మక్కై రెండు ట్యాంకర్ల డీజి ల్‌ను మాత్రమే సరఫరా చేసుకుని మిగిలిన మూడు ట్యాంకర్ల డీజిల్‌ను దారి మళ్ళించి సొమ్ము చేసుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల అనంతరం శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ డీజిల్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాలలో వెల్లడైంది. ఇప్పటివరకు 25మందిపై ఛార్జిషీటు దాఖలైనట్లుగా తెలిసింది. గత ఏడాది మార్చిలో రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజిల్‌ కుంభ కోణంపై దర్యాప్తును పూర్తి చేసి నివేదించింది. సింగరేణిలో ఇప్పటివరకు జరిగిన అన్ని కుంభకోణాల మాదిరిగానే డీజిల్‌ కుంభకోణం కూడా మొక్కుబడి, క్రమశిక్షణా రాహిత్య చర్య లతో కప్పిపుచ్చేస్తారని కార్మికులు ఆందోళన పడుతున్నారు.
కోల్‌ ఇండియా జార్ఖండ్‌ పరిధిలో ఉన్న బ్రహ్మదిహా బొగ్గు గనులను కాస్ట్రాన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు కేటాయిం చడంలో కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు రాగా సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) విచారణ జరిపింది. దిల్లీ హైకోర్టు కూడా విచారణ జరిపి అప్పటి బొగ్గు శాఖ మంత్రి దిలీప్‌ రే, సీనియర్‌ అధికారులు ప్రదీప్‌ కుమార్‌ గౌతమ్‌, మహేంద్ర కుమార్‌ అగర్వాల్‌లను దోషులుగా ప్రకటిం చింది. అలాగే కోల్‌ ఇండియాలోని కార్మికులు ఉద్యోగులు ఆదాయపుపన్ను మదింపు గురించి తప్పుడు మెడికల్‌ పత్రాలు సమర్పించిన సంఘటనలపై సీబీఐ విచారణ జరిపింది. కార్మికులు రాయితీ పొందిన లక్షల రూపాయలను ఆదాయపన్ను శాఖ తిరిగి వసూలు చేసుకున్నది. మరి, సింగరేణిలో సంస్థాగతమైన అవినీతి ఆరోపణలపై, దుబారా లపై ఎందుకు కేసులు నమోదు కావడం లేదు. కోల్‌ ఇండియా బొగ్గు గనులలో జరిగిన కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తులు జరిపించినట్లుగా సింగరేణి అవినీతి కుంభకోణా లపై ఎందుకు జరపడం లేదు. ఈ ఏడాది జనవరి 22న రాంచీలో సీఐఎల్‌ (కోల్‌ ఇండియా లిమిటెడ్‌) సి అండ్‌ ఎండీ (చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌) అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ జెబిసిసిఐ సమావేశంలో సింగరేణిలో అవినీతి, నిధుల దుర్వినియోగంపై సిఐఎల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ మిన్నకుంటున్నాడని కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసాయి. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపడానికి తప్పని సరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోగాని, పరిశ్రమలలో గాని అవినీతి ఆరోపణ లను సుమోటోగా స్వీకరించి సీబీఐ దర్యాప్తు చేస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా దేశంలో ఎక్కడైనా నేరారోపణపై దర్యాప్తు చేయమని సీబీఐని ఆదేశించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో సింగ రేణిలో అవినీతి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరి పించాలని కార్మికులు కోరుకుంటున్నారు.
వ్యాస రచయిత ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేంద్ర కార్యదర్శి,941440791

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img