Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

సింగరేణి సహా బొగ్గు గనుల వేలం!

అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను, భూములను మోదీ ప్రభుత్వం తెగనమ్ముతున్నది. బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నది. సింగరేణి బొగ్గు బ్లాకులు సహా 106 బ్లాకులను తాజాగా వేలం పెడుతున్నది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో 2020లో అనేక బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉత్పత్తిని ఆపివేశాయి. ఫలితంగా తీవ్రమైన కరెంటు కొరత ఏర్పడి అనేక రంగాలు సంక్షోభంలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియాను పటిష్టపర్చి బొగ్గు కొరతను నివారించే చర్యలు తీసుకోకుండా మోదీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రారంభించింది. ఫలితంగా బొగ్గు కొరత పెరిగి, విద్యుత్‌ చార్జీలు పెరగడంతో ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది. దేశంలో బొగ్గు కొరతకు పాలక ప్రభుత్వాలే కారణం. దేశంలో బొగ్గు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన అవసరాలకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసుకోవచ్చు. సమస్యల్లా ఉత్పత్తికి సంబంధించినది. సహజ వనరులను వెలికితీసి దేశ అవసరాలకు ఉపయోగించడంలో పాలకుల ఉద్దేశ పూరిత వైఫల్యం బొగ్గు కొరతకు కారణమైంది. దీనికి తోడు కృత్రిమ కొరత, దోపిడీ తోడైంది. భారతదేశంలో పారిశ్రామిక అవసరాలకు బొగ్గు వినియోగం పశ్చిమ బెంగాల్‌ లోని రాణిగంజ్‌లో ప్రారంభమైంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1774లో నారాయణకుడి ప్రాంతంలో మొదటిసారి బొగ్గు గనుల తవ్వకం చేపట్టింది. అప్పటికి దేశం పారిశ్రామికంగా బాగా వెనుకబడటంతో బొగ్గుకు డిమాండ్‌ లేని పరిస్థితి. భారతదేశంలో 1853లో తొలి పాసింజర్‌ రైలు అమల్లోకి రావడం, ఆవిరి ద్వారా నడిచే రైలు ఇంజన్లు ఉత్పత్తి కావటంతో బొగ్గు వినియోగం పెరిగింది. 20వ శతాబ్దంనాటికి దేశంలో బొగ్గు ఉత్పత్తి సంవత్సరానికి 61లక్షల టన్నులకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి వినియోగంలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
1973వ సంవత్సరంలో ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయం చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలే అధిక శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. కోల్‌ ఇండియా సంస్థ 90శాతం బొగ్గును ఉత్పత్తి చేసింది. కొన్ని గనులను పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఇచ్చారు. ఆ సంస్థలు ఉత్పత్తిచేసే బొగ్గును తమ ప్లాట్లలో మాత్రమే వినియోగిస్తారు. ప్రపంచంలో భూగర్భ బొగ్గు నిల్వలు ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, భారతదేశాలు. భారత దేశంలో 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్‌, ఒడిశా, చత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో అతిపెద్ద గనులు ఉన్నాయి. దేశంలోని సహజ బొగ్గు వనరులను ఉపయోగించక పోవటంతో బొగ్గు కొరత ఏర్పడి విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇండోనేసియా నుండి అత్యధికంగా బొగ్గు కొనుగోలు జరుగుతున్నది. ఇండోనేసియాలోని రెండు బొగ్గు గనుల్లో టాటా పవర్‌ వాటా 30శాతం కాగా, మరో గనిలో అదాని పవర్‌ కి 74శాతం వాటా ఉంది. రవాణా కోసం అదానీ స్వాధీనంలో పోర్టులు ఉన్నాయి. టాటా, అదానీల ప్రయోజనాల కోసం ఇండోనేసియా నుంచి మోదీ ప్రభుత్వం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నది.
దేశంలో బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను ధర 4,500 రూపాయల నుంచి 15,000 లకు పెరిగింది. దేశంలోని తీర ప్రాంతంలో ఉన్న బొగ్గు కర్మాగారాలు అత్యధికంగా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటంతో ఈ ప్లాంట్లు మూత పడుతున్నాయి. 2020లో ఈ ప్లాంట్లు 54శాతం విద్యుత్‌ ఉత్పత్తి చేయగా, 2021లో 15శాతానికి పడిపోయింది. 2020-21లో సీఐఎల్‌ (కోల్‌ ఇండియా), సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 64,07,017 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ప్రైవేట్‌ కంపెనీలు 24,280 మిలియన్‌ టన్నులు బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేశాయి. సీఐఎల్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోనే వివిధ పన్నుల పేర 44,07,581 కోట్లు కేంద్రానికి చెల్లించింది. 12,70,217 కోట్ల రూపాయలు నికర లాభం గడిరచింది. దీన్ని గమనిస్తే ప్రైవేట్‌సంస్థలు బొగ్గుఉత్పత్తి చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. ‘‘ఆత్మనిర్భర్‌ భారత్‌’’ స్ఫూర్తిగా వాణిజ్య పరంగా బొగ్గు గనులవేలం మొదటి విడతను మోదీ 2020లో ప్రారంభించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే ప్రభుత్వరంగసంస్థలను వేలంవేయటం. 11-10-2021న కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల వేలంపై ప్రకటన జారీ చేసింది. కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్‌ యాక్ట్‌ 2015, మైన్స్‌ మినరల్స్‌ యాక్ట్‌ 1957 మార్గదర్శకంగా దేశవ్యాప్తంగా 88 బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దానికి అనుగుణంగా చట్టాలను సవరించారు. ప్రైవేట్‌ సంస్థల అంతిమ వినియోగంపై ఎటువంటి పరిమితులు లేకుండా బొగ్గు గనుల వేలాన్ని అనుమతించేందుకు ఈ గనుల నుంచి బొగ్గును సొంత వినియోగం, అమ్మకం లేదా మరేదైనా ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 6వ రౌండ్‌ వాణిజ్యం బొగ్గు గనుల కింద వేలం వేసిన 29 బొగ్గు గనులకు మంత్రిత్వశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.
బొగ్గు గనుల మంత్రిత్వశాఖ 7వ రౌండ్‌ వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియను 29-3-23న ప్రారంభించింది. మొత్తం 106 బొగ్గు బ్లాకులు వేలం ఆఫర్‌లో ఉన్నాయి. వేలం వేస్తున్న గనులు బ్లాకులు జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, తమిళ నాడు, బిహార్‌ రాష్ట్రాలకు విస్తరించాయి. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రామగుండం వచ్చిన సందర్భంలో సింగరేణి గనులను ప్రైవేటీకరిస్తున్నామన్నది అబద్ధం అని చెప్పారు. అందుకు విరుద్ధంగా వేలంలో సింగరేణి కాలరీస్‌కు చెందిన సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణపల్లి, పెనగడ గనుల బ్లాకులు వేలం ప్రక్రియ నోటీస్‌లో ఉన్నాయి.
దేశంలో తొలిప్రభుత్వరంగసంస్థగా సింగరేణి ఏర్పడిరది. అధికారమార్పిడికి ముందే 1920డిసెంబర్‌ 23న ‘సింగరేణి లిమిటెడ్‌’ కంపెనీగామారింది. సింగరేణిది 130 సంవత్సరాల చరిత్ర. సింగరేణి గనుల్లో 51శాతం తెలంగాణ రాష్ట్రానిదికాగా, కేంద్రానిది 49 శాతం ఉంది. 1990లో రెండుసార్లు దాదాపు ఖాయిలా పడే పరిస్థితి ఏర్పడి తిరిగి నిలదొక్కుకుంది. బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన 133 సంవత్సరాల్లో 1,550 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. నష్టాల నుంచి బయట పడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. కార్మికులకు బోనస్‌లు ఇచ్చింది. 12 వేల కోట్ల టర్నోవర్‌ నుంచి నేడు 26 వేల కోట్ల టర్నోవర్‌ చేరింది. 2019లో 11వందల కోట్ల లాభాలు గడిరచింది. ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు తీసుకుని తవ్వకాలకు సిద్ద మౌతున్నది.
వేలంలో కాకుండా కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరినా కేంద్రం నిరాకరించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖల ప్రకారమే 4-8-2021 నాటికి విద్యుచ్ఛక్తి పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు 21 లక్షల కోట్లు. వీటిని రాబట్టేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్‌ సంస్థలపరం చేస్తున్నదన్న దానికి సింగరేణి కాలరీస్‌ సంస్థ నిదర్శనం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వలన నిరుద్యోగం పెరుగుతుంది. బొగ్గు నిల్వలు బడా కంపెనీల పరమై బొగ్గు ధర పెరగటమే కాకుండా కరెంట్‌ చార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలపై భారం మోపుతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
బొల్లిముంత సాంబశివరావు,
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img