Friday, June 2, 2023
Friday, June 2, 2023

సిద్ధాంతాలు లేని పార్టీలు

రా బావ ఏంటి ఈ రోజు చాల సంతోషంగా నోటితో ఈల వేసుకుంటూ వస్తున్నావు. ఆ ఏంలేదు బావ. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లాంటిది కాదు. మా పార్టీకి నియమనిబద్దతలున్నాయి. సీత గీత దాటితే ఏమైందో మా సభ్యులకు కూడా అదే గతి అన్న జగన్‌కు షాకిచ్చి ఇద్దరు శాసనసభ్యులు గీత దాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. మారినకాలం, నైతిక విలువలు కోల్పోయిన సంగతి జగన్‌కు కూడా ఇపుడు బోధపడిరదని నవ్వుతూ వస్తున్నానంతె.
అదినిజమే, ప్రస్తుతం అనేక రాజకీయపార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికి ఏ రకమైన సిద్ధాంతంగానీ, ఆశయంగానీ ఉండవు. ఎటువంటి నిబద్దత, నియమాలు లేవు. గతంలో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలకు ఒక సిద్ధాంతం, నిబద్దతతో కూడిన ఆశయం ఉండేది. దానికోసం ఎందరో నాయకులు ఆశయ సిద్ధికొరకు ప్రాణాల ర్పించిన సంఘటనలున్నాయి. ఆ తరువాత స్వాతంత్య్ర సాధనకోసం కాంగ్రెస్‌ అవతరించింది. స్వాతంత్య్రం కోసం చేసే ఉద్యమంలో సోషలిస్టులు, కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో నెహ్రూ, పటేల్‌ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నంతకాలం దాదాపు ప్రజాస్వామ్యపద్ధతిలోనే పార్లమెంటుసమావేశాలు జరిగాయి. ప్రతిపక్షంలో పుచ్చలపల్లి సుందరయ్య, హిరేన్‌ముఖర్జీ, భూపేష్‌గుప్తా, అశోక్‌ మెహతా, కృపలాని, లోహియా లాంటి ఉద్దండులున్నారు. ఆనాడు సోషలిస్టు, కమ్యూనిస్టులకు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవారు. అంతేగాక ప్రభుత్వం తెలిసో తెలియకో ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నాయకులు ఖండిస్తే మంచి మనసుతో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఆనాటి ఎన్‌సైక్లోపీడియాలో చోటుచేసుకున్న సందర్భా లున్నాయి. నెహ్రూ మరణానంతరం కొద్దికాలం లాల్‌బహదూర్‌శాస్త్రి ఉన్నా ఆ తరువాత ప్రధాని అయిన ఇందిరాగాంధీ నుంచి దాదాపు నియంతపాలన మొదలై ఇప్పుడు ప్రధాని మోదీ వరకు కొనసాగుతూనే ఉంది. ఆనాడు ఇందిర రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని దించి నియంతృత్వ ప్రధానిగ పేరుగాంచింది. నిజమే అసలు పునాదులే లేనపుడు ఇలాగే జరుగుతుంది గదా. అదే నే చెప్పేది. ఎంతో క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుపార్టీలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటే, వైసీపీవిషయంలో ఆశ్చర్య పడ వలసిన పనేముంది. అదిసరే బావ ముగ్గురు ఎంఎల్‌సీలు గెలవగానే 2024లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని సంబరపడి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వెంటనే ఆయన తెరవెనుక చేసిన కుట్రను బైటపెట్టి నోరుమూయించారు కదా! స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విషయంలోను, తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టు తదితర నిర్మాణాల్లో కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకున్న నైజం సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే బైటపెట్టాడు జగన్‌. మొత్తం బైటపడటంలో ఎదుగుతున్న కాళ్లకు బంధం పడినట్లయింది. అదే నే చెప్పేది ఎటువంటి సిద్ధాంతాలు, ఆశయాలు లేకుండా పుట్టిన పార్టీలలో స్వార్థపరులు చేరడంతో ఇటువంటి సంఘటనలు తప్పవు. చోటా నాయకులు కాకుండా పార్టీ అడిగితేనే ఈ పని చేయడంతో పార్టీని నమ్ముకున్న కింది నాయకులు ఒక్కసారిగ అవాక్కయ్యారు బావ.
అది సరేలే బావ వ్యవస్థలో మార్పు తేవాలనే మాటకు విలువిచ్చి ఆ ఇద్దరికి ముందే ఈసారి టికెట్‌ ఇవ్వనని చెప్పడంవలన వాళ్లు క్రాస్‌ ఓటింగ్‌ చేశారని వైసీపీ వాళ్లంటున్నారు. కాని అంతలోతుగ ప్రజలు అర్థం చేసుకోగలరంటావా. ఆ మాట నిజమే. మార్పు అనేది అవసరం అనుకున్నపుడు ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగ. ప్రస్తుతం గెలిచిన కైకలూరుకు చెందిన వెంకటరమణ చంద్రబాబుని నమ్మించి మోసం చేసాడంటున్నాడుగ. అలాగే జగన్‌ని కూడా అనవచ్చుగదా అది సరే స్కిల్‌డెవలప్‌మెంట్‌ విషయంలోను అమరావతి కాంట్రాక్టరు వద్ద సొమ్ము తీసుకున్నట్లు రుజువైతే చంద్రబాబు అరెస్టు అవుతాడంటారా. భలేవాడి వయ్యా చంద్రబాబును అలా తక్కువ అంచనా వేయకు. ఆయన కోర్టు లను మానేజ్‌చేయగలడని అంటారు కదా! ఆయనకు స్టేల బాబు అనే పేరుంది. స్టేలతో ఒకసంవత్సరం గడిపితే తరువాత తన ప్రభుత్వం వస్తుందనేె ధీమా ఆయనలో ఉంది..నిజమే అందుకేనేమో మరల ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశాడు. నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు వారసత్వాన్ని పోషిస్తున్నాడు కానీ లోకేష్‌ కేముంది? మరో గుర్తింపు ఉన్న నాయకుడితో పాదయాత్ర చేయిస్తే బాగుండేదేమో, కన్నప్రేమ, అధికారం ఆ పనిచేయనివ్వరుగ. అంతెందుకు జూనియరు ఎన్‌టిఆర్‌ను ప్రోత్సహిస్తే పార్టీ బలపడి అధికారం జేజిక్కించుకోవచ్చునని ఆ పార్టీలో చాలమంది అభిప్రాయం. కాని తన కుటుంబం నుండి అధికారం చేజారిపోతుందని చంద్రబాబు అందుకు అంగీకరించడంటారు. చూడు బావ ఏది ఏమైనా గతంలో రాజకీయ పార్టీలకున్న నైతిక విలువలు నేడు స్థానిక పార్టీలకు లేదు. అందుకు సిద్ధాంతాలతో పార్టీ స్థాపించక పోవడమే కారణం. అందుకే సంపాదన కోసం యంఎల్‌ఏ టికెట్టు గెలిచిన తర్వాత సంపాదన, సంపాదించిన సొమ్ముతో ఓట్లుకొని మరల గెలవడం, ఇదే ప్రస్తుత పార్టీల సిద్ధాంతం. అందుకే ఇలా పార్టీలు మారడం.
వ్యాస రచయిత సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img