Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

సినబ్బతో ఓ సాయంత్రం

మూడున్నర దశాబ్దాల కల. ఉదయం దిన పత్రికలో పచ్చనాకు సాక్షిగా చదువుతూ… ‘‘ఈ తిరప్తి బట్టను కలియాల్సిందే. ఇతగాడి అచ్చరాలు ప్రత్యేకంగా పుట్టాయబ్బా’’ అనుకొనుండాను ఆనాడు. ఇన్నాళ్లూ ఈ నామిని సుబ్రహ్మణ్య నాయుడ్ని సదివిందే తప్ప చూసింది లేదు. మధ్యలో కుటుంబంతో కలిసి తిరుపతి వచ్చినా ‘‘ఇప్పుడూ సాహిత్యమేనా ‘‘అన్న మాటలకి తలొగ్గి ఈ సినబ్బను కలవకుండానే వెనుతిరిగాను. ఇన్నాళ్లకు ఆ నా కల ఈడేరింది. తిరుపతి శివారు తనపల్లిలో ఉంటున్న నామిని సుబ్రహ్మణ్య నాయుడి దగ్గరకు తీసుకువెళ్లింది పెమ్మరాజు గోపాల కృష్ణ. ఇద్దరం ఆయన బండి మీద వెళ్లాం ఆ సాయంత్రం.
మెల్లకన్ను మనిషి అని తెలుసు కాని ఆకారానికి సంబంధించిన వివరాలేవి తెలియవు. ఫోన్‌ లో అడ్రస్‌ చెబుతూ ‘‘ సరే అంటే ఎలాగబ్బా. సానా ఇబ్బంది పడతారు. మాట్లాడుతూ రండి. సందు తిరంగానే కాపడతా’’ అన్నారు సినబ్బ. సందు తిరగ్గానే కనపడ్డారు కూడా. తెల్లని గడ్డం. మాసిపోయి అసలు రంగు కోసం రీసెర్చి చేయాల్సిన ట్రాక్‌. ఎరుపు రంగే కాని వెలిసిపోయిన పార్టీ జెండాలా ఉన్న ఎర్ర టీ షర్టు. ఎంతటి వారైనా సరే కాళ్లకి దండం పెట్టడం, పెట్టించుకోవడం అసహ్యం నాకు. కాని, నామిని కనపడగానే అప్రయత్నంగా కాళ్లకు మోకరిల్లా. ‘‘ఎందబ్బా ఇది. వద్దు’’ అంటూ వెనక్కి వెనక్కి జరిగారు. నా భుజాలు పట్టుకుని పైకి లేపి కౌగలించుకున్నారు. నా గుండెలకి సినబ్బ తల తగిలింది. ‘‘ మిట్టూరోడి కతలు’’ వంటివి ఈ జనమకి రాయలేం కాని సినబ్బ మనకంటే రెండు, మూడు గుప్పిళ్లు పొట్టొడే అని ఓ ఆత్మతృప్తి.
ఎవుసాయం మనిషి కదా… ఇంట్లోకి వెళ్లగానే గోనెసంచె మీద ఆరబెట్టిన తెల్ల ఉల్లిపాయలు. ఆ పక్కనే ప్లాస్టిక్‌ సంచీలో సగం వరకూ ఉన్న చోళ్లు. ఇద్దరం నేల మీద ఎదురెదురుగా కూర్చున్నాం. పక్కనే సోఫాలో పెమ్మరాజు గోపాలకృష్ణ. కూర్చున్నారు. నెపాన్ని కాసేపు మోకాళ్ల మీదకు నెట్టేస్తే… చెప్పబ్బా… అన్నారు నామిని. నాకు భయం కాదు కాని…. నోట మాట రాలేదు. మూడు దశాబ్దాల పాటు తన సాహిత్యాన్ని నా వెంటేసుకుని తిరిగాను. ‘‘అవునూ….పతంజలంటే మీకు ఎందుకు కోపం…’’ అని అడిగాను. ‘‘ తప్పుబ్బా. నాకు కోపం ఏంది. ఓ హెడ్డింగ్‌ కోసం పతంజలి లాంటి వారితో గొడవ పడతామా. ఆయన నాకు దేవుడు. హీరో ‘‘ అన్నారు నామిని. మరి తాడి ప్రకాష్‌ ఏదో రాసారు అని అడిగితే ‘‘ఈ పేసుబుక్కులో ఏదేదో రాసేశాడు. నేను కొత్తోడ్ని. నా చేత కాలం రాయించారు పతంజలి. ఎడిటర్‌తో గొడవ పడి మరీను’’ అన్నారు. ‘‘ఈ పిల్లాడి మీద అంత నమ్మకం ఏంటి నీకు అని ఎడిటర్‌ అడిగారు. అంతే కాదు… ఏం రాస్తాడు అని కూడా అడిగారు’’ అన్నారు. ‘‘నాకు తెలీదు ఏం రాస్తాడో. కానీ రాస్తాడు. పేలుతుంది. నాకు నమ్మకం ఉంది’’ అని గొడవ పడి నా చేత పచ్చనాకు సాక్షిగా రాయించారు పతంజలి. అది లేకపోతే నేను లేను కదబ్బా’’ అన్నారు.
రా.వి.శాస్త్రిని కూడా మీరు ఇష్టంలేదన్నారు. ఎందుకు అని అడిగితే… ‘‘అవునబ్బా. వాడు ఇరవై ఏళ్ల క్రితం ఇలా ఉండేవాడు, ఆమె కట్టుకున్న సీర ముప్ఫై ఏళ్ల క్రితం కొత్తది అంటూ రాస్తాడు. ఇప్పుడెందో రాయాలి కాని ఇదంతా ఏందీ’’ అన్నారు నామిని. అలాగే కారా మాస్టారు రాతలు కూడా నాకు నచ్చలేదు. అదేచెప్పా. ‘‘అంటే ఎలా రాయాలి’’ అని అడిగితే ‘‘ఎవరి బాష వారు రాయాలి. ఎవరి జీవితం వారేరాయాలి. అందుకే అలా రాయని వాళ్లంటే నాకు నచ్చదు. అదే చెప్పా. మా జిల్లా రచయిత ఓ పెద్దాయన కథల్లోను, నవలల్లోను ఓ క్యారెక్టర్‌కి ఆనందరావు అని పేరు పెట్టారు. మాజిల్లా అంతా యతకతా ఉన్నా. ఇక్కడోళ్లెవ్వరూ ఆనందరావు అనే పేరుపెట్టరు. ఈ జిల్లా బాష, సంస్కృతి, అలవాట్లురాయాలి కాని, అరువు, ఎరువుతెచ్చుకుని రాయకూడదబ్బా’’ అన్నారు అదోలాంటి నవ్వుతో.
‘‘మీ కథల్లో, నవలల్లో బూతు పదాలు రాసేస్తారు. చదివే వారికి ఇబ్బంది అనిపిస్తుంది కదా’’ అని అడిగితే… ‘‘ అవి బూతులు కదబ్బా… ఆ పాత్రలు ఎలా మాట్లాడతాయో అదే రాసాను. అదే రాయాలి కూడా. పాత్రలకి నీ బాష తగిలించేస్తే ఎలా’’ అన్నారు. అలా అంటున్నప్పుడు ఆ మెల్లకన్నులోనూ ఓ మెరుపు మెరిసింది. ఇలా మాట్లాడుకుంటూంటూంటే ‘‘పబా… కాపీ… తాగేందుకు నీళ్లు ఇస్తావా’’ అన్నారు నామిని. ఆ మాటలు ఇంకా నోట్లోంచి రాకుండానే మంచినీళ్లు తెచ్చారు పభావతి. ఆ తర్వాత కాఫీ కూడా. కాఫీ ఓ సిప్‌ చేశాకా ‘‘ కాఫీ బాగుంది’’ అని పొగడ్తలాంటి కితాబు ఇచ్చారు పెమ్మరాజు. ‘‘ పబావతి కాఫీ బాగా పెడుతుంది. అందుకే నేను ఇంకెక్కడా తాగను. ఇంట్లోనే తాగుతా’’ అని కేలీ ఇలాసంగా నవ్వారు నామిని.
‘‘హైదరాబాద్‌ ఎందుకు వదిలేసారు’’ అని అడిగితే….‘‘అది మంచి ఊరు కాదు. మనుషులని చంపేస్తుంది. పతంజలే ప్రత్యక్ష సాక్ష్యం. హైదరాబాద్‌ వచ్చాకే పతంజలి మారిపోయాడు. ఆయన అలవాట్లూ మారిపోయాయి. అక్కడే ఉంటే నేనూ అలాగే అయిపోదును’’ అన్నారు నామిని. ఇక బయలుదేరతామంటే….‘‘రెండు చపాతీలు తిని పొండబ్బా. పబావతి చపాతీ కూడా బాగా చేస్తుంది’’ అన్న వాత్సల్యాన్ని సున్నితంగా కాదని సినబ్బ జ్ఞాపకాలతో వెనక్కి బయలుదేరాం.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img