Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

సీటు కొరకు పాట్లు

అన్నపానము లేని బాధ బాధకాదు. ఆలుబిడ్డలు లేని బాధ బాధకాదు. స్వపక్షములో విపక్షమున్న బాధయే బాధ. కాకి దుస్తుల వారు కొట్టిన కౌకు దెబ్బలవలె బాధ. అంతు చిక్కని బాధ. మందు దొరకని బాధ. మందాగ్ని బాధ. రాజకీయములలో ప్రత్యర్ధి పార్టీ అయినచో పరిపరి విధముల తిట్టవచ్చును. విరీసములు సవరించ వచ్చును. జబ్బలు చరచ వచ్చును. కాలు దుయ్యవచ్చును. కలియబడవచ్చును. ఇది అటుల కాదే! పార్టీ యొక్కటే… పతాకమొక్కటే… గుర్తు యొక్కటే… గుణగణము లొక్కటే… అసెంబ్లీ సీటుయునూ ఒక్కటే. మరి ఆ సీటు దక్కించుకొను నరక యాతన మాత్రము ఒక్కటనుటకు లేదు.
రాత్రి రెండు జాముల వరకు కల్లు సారాయి చెడ తాగి చెట్టా పట్టాలేసుకొని, భుజము భుజము రాసుకొని కలియ తిరిగిన నాయకులు ఉదయమే నడి బజారున చెడమడ తిట్టుకొనుటకు కారణమేమై యుండును. తండ్రి తాతలను ఒకరు నొకరు దుర్భాషలాడుకొనుచు నోటికి రాని తిట్లు తిట్టుకొనుచు తీవ్ర ఆవేశముతో, ఉద్రేకముతో, ఉక్రోషముతో తయతక్కలాడుచుండ జనులు చిత్రాతి చిత్రముగా చూడరా? బడితే ఏదిరా? బాణాకర్ర ఏదిరా? చూచుచున్నామేమిరా? బూడిద గుమ్మడి వలె పగులునట్లు వాని బుర్రపై కొట్టవేమిరా? యనుచుండ అయ్యో! రాత్రికి రాత్రి ఏమైనది. గొంతుముడి వరకు తాగినది ఇంకనూ దిగలేదా? ఈ విబేధములకు, విధ్వేషములకు కారణమేమియని జనులు నివ్వెరపోరా? సంభ్రమాచ్చర్యములు పడరా? తోలుబొమ్మలాట చూచునట్లు చూడరా? ఇక ఉచితముగా నిచ్చు వినోదము మాని ప్రక్కన ఉర్వశీ టాకీసులోనికి పోవు వారుండునా? అయిననూ అందు ప్రదర్శించు చిత్రములో మాత్రమేమున్నది? ఒక నాయకుడు ప్రతినాయకుని(విలన్‌)కి చెందిన పాతిక మందిని పరిపరి విధముల కొట్టును. ఎడమ వైపు వచ్చిన ఎడమ చేతి దెబ్బ… కుడి నుండి వచ్చిన కుడి చేతి దెబ్బ… ఎదుట నుండి వచ్చిన పొట్టెలు దెబ్బ… వెనుక నుండి వచ్చిన గాడిద తన్ను… మరి మూకగా వచ్చిన కోతి వలె నెగురుట. అంతే! చేతికి మట్టిలేదు. వంటికి అలుపు లేదు. ఇన్ని జంతు లక్షణములు ఆ నాయకునిలో తాండవించుచుండ వెయ్యి మందిని కొట్టుట ఏమంత కష్టము? ఇది జూచియె కాబోలు డార్విన్‌ యను శాస్త్రజ్ఞుడు కోతి నుండి మనిషి పుట్టినాడని ఖండితముగ జెప్పినాడు. ఒప్పుకొన దగినదే. అటులైన అంతకు పూర్వమో, మరీ అంతకు మునుపో గాడిద నుండి గాని, గొర్రె పోటేలు నుండి గాని మనిషి వచ్చినాడను అంశము విచారించదగినది. పాశ్చాత్యులు, తెల్ల తోలు కప్పుకొనిన వారు జెప్పిన మనవారు అంగీకరింతురు. ఒక భారతీయుడు జెప్పిన యెడల తెల్లముఖము వేయుదురు. ప్రకృతి విషయము ప్రక్కకు పోవుచున్నట్లున్నది. పంటలకు తెగులు ఆశించినట్లు పదవులను ఆశించు జనులు పెరుగుచున్నారు. ప్రజా సేవా పరాయణులు పచ్చ పురుగుల వలె వృద్ధి యగుచున్నారు. ఎన్నికలు సమీపించువేళ మన దాయాది రాష్ట్రమైన తెలంగాణాలో ఒక నాయకునికి ఇట్టి కష్టము సంభవించినది. కష్ట నివారణకు ఆ నాయకుడు పడరాని పాట్లు పడినాడు. అసెంబ్లీ సీటు తన పక్షము కావలెనని యాగము జేసినాడు. ప్రజలకు సేవచేసి తరించి స్వర్గమునకు పోవు మార్గము సుగమము జేయవలెనని పూజలు జేసినాడు. పురాణ కాలక్షేపము జరిపినాడు. గండి పోచమ్మకు దండ కడియము జేయించెదనని మొక్కినాడు. మరి సీటు దక్కవలెనన్న కల్వకుంట్ల వంశాదీశుల కటాక్షము పొందవలెను గాని యాగ పండితులను ఆశ్రయించిన ఏమి ఫలితము? కాశీకి పోవు టిక్కెట్‌ జేబులోనున్నది. అసెంబ్లీ టిక్కెట్‌ జేబులో పడవేయమన్న పడవేయు వారుండునా? లేనిచో కాశీలో కాకరగాయ వదిలినాను. నాకొక్క సీటు విడవరాదా? యనిన విడుచువారుండునా? సేవించవలసిన వారిని సేవించవలెను. ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించవలెను. అంతియే గాని మణుగుల కొద్ది చందనపు చెక్కల ఖర్చెందులకు? కడవల కొద్ది ఆవు నెయ్యి వ్యయమెందులకు? పురోహితులకు బహుమతులెందుకు? భక్తులకు భోజనము ఖర్చెందులకు? మత్స్య యంత్రము కొట్టవలెనన్న మట్టగిడస లాంటి పిల్లను చూడవలెను గాని కొరమేనుచాప రుచి కొరకు యోచించిన బాణము గురి కుదురునా? దృష్టి నిలుచునా? సీటు దక్కలేదు. ఐహిక సుఖములకై ఆధ్యాత్మిక పట్టు పట్టుటచే పట్టుకుదరలేదు. అనుగ్రహించమని తనను కోరక వేరొకరిని ఆశ్రయించుటచే అధినాయకుడు అటు వైపు చూడలేదు. వరములిచ్చిన వాడే దేముడు. పదవులిచ్చినవాడే అధినాయకుడు. లేనిచో వున్న నేమి? లేకున్న నేమి? యనుచుండ బయట అలజడి రేగినది. ఏనుగుపై ఒక నాయకుని కూర్చుండ బెట్టుకొని జనులు ఊరేగుతున్నారు. జయజయ నాయకా… జయహో నాయకా యనుచున్నారు. భూత బేతాళ టక్కు టమార వేషములు వెంట నడుచుచున్నవి. రాజకీయములకు టక్కు టమార విద్యలు తోడగుటచే సభికులు ఆ వేడుకజూడ పోయినారు. సభ ముగిసినది.
పానుగంటి వారికి కృతజ్ఞతలతో
ఎన్‌.జి.కె

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img