Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

‘‘ సీమ’’ కు మరో ఎన్నికల తాయిలం?

వి. శంకరయ్య

ఒకతనికి ఇద్దరు భార్యలు. ఒకరు పడుచు భార్య. మరొకరు వయసు మళ్లినావిడ. నా మొగుడు పడుచువాడని చెప్పుకొనేందుకు అతనికున్న తెల్ల వెంట్రుకలన్నీ పడుచు పెళ్లాం పీకేసింది. నేనేమీ తక్కువ తినలేదు అన్నట్లు వయస్సు మళ్లినావిడ నా మొగుడు ముసలాడని చెప్పేందుకు నల్ల వెంట్రుకలన్నీ పీకేసింది. తుదకు అతనికి గుండు మిగిలింది. ఇంత కథనం ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోటీపడి శ్రీ శైలం జలాశయం నీటిఅంశంలో వ్యవహరిస్తున్న వైఖరితో రాయలసీమ తుదకు ఎడారిగా మారే ప్రమాదముంది. రాష్ట్ర విభజనచట్టం మేరకు 2016 లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ తీర్మానాన్ని దుమ్ములో కలిపి చట్టవిరుద్ధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముందుకు తీసుకు పోతుంటే దాన్ని న్యాయ పరంగానూ చట్టబద్దతగల అపెక్స్‌ కౌన్సిల్‌ వేదికపై నిలువరించ వలసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండేళ్లు కాలం గడిపేసింది. నీటి కేటాయింపులు తప్ప మిగిలిన అనుమతులు కేంద్రంతో నిత్యం పేచీపడుతూనే తెలంగాణ సంపాదించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేంద్రంతో పూసుకు తిరుగుతున్నా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఒక్క అనుమతి సంపాదించలేదు. ఇప్పుడు దింపుడు కళ్లం ఆశగా తుదకు తాగునీటి పథకంపేర రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పాక్షికంగా నిర్మించేందుకు తల పడటం ఏమనాలి? తెలంగాణను నిలువరించేందుకు ఇది పరిష్కార మార్గమా? ఎన్నికల తాయిలంతప్ప వేరుకాదు. రెండేళ్ల క్రితమే ఈ పని చేసివుంటే ఎవ్వరూ అనుమానించే వారుకాదు.
కేంద్ర ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డును నోటిఫైచేసి రెండేళ్లవుతున్నా ప్రాజెక్టులను బోర్డుకు తెలంగాణ అప్పగించలేదు. పైగా సాగర్‌కు నీటి అవసరం లేకున్నా మరో పక్క శ్రీ శైలంలో కనీస నీటిమట్టంస్థాయి పడిపోతున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. తనేమీ తక్కువ కాదన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కూడా పోటిపడి విద్యుదుత్పత్తిచేసి ఇద్దరూ కలసి గత ఏడాది రెండువేల టియంసిలు శ్రీశైలం చేరితే జూన్‌ వచ్చేసరికి జలాశయం ఖాళీచేశారు. రాయలసీమకు సాగునీరు కాదు కదా తాగునీటికి చుక్క మిగల్చలేదు. ఇదేం అన్యాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా నిలదీసే పరిస్థితి లేకపోవడమే సీమ ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిరది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన తాగునీటి పంపింగ్‌కు కూడా జూన్‌నాటికి నీళ్లు మిగలవు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈలోపు నీటి కేటాయింపులు లభిస్తే బోర్డు వారికే ప్రాధాన్యత ఇస్తుంది. మిగిలితేనే మనకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పోటీగా పర్యావరణ అనుమతులు వచ్చినా ప్రస్తుతం లేవని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే తో వున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాగునీటి కోసమని పాక్షికంగా పనులు మొదలు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో తాజాగా జారీచేసింది. ఎన్నికల ముంచుకొస్తున్నందున తన కోటగా భావించే రాయలసీమలో ఏర్పడిన అసంతృప్తి జ్వాలలు పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా ఏదో ఒక ప్రక్రియ చేపట్టడం తప్పుపట్టలేము గాని అంతర్‌ రాష్ట్ర జలవివాదాల్లో తెలంగాణను నిలువరించేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. గుక్కెడు నీటికోసం తపిస్తున్న రాయలసీమ ప్రాంతానికి ఏదైనా మేలు జరగాలంటే తెలంగాణతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా ముందుకు పోవాలి. లేదా చట్టపరంగా తెలంగాణకు దీటుగా ఎదుర్కోవాలి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సామరస్యానికి ఎప్పుడూ సిద్ధంగాలేరు. సామరస్యానికి తలపడితే ఆయన అనుసరిస్తున్న విధానాల పునాదులు బీటలు వారతాయి. ఆంధ్ర ప్రదేశ్‌తో ఎప్పుడూ తగాదా వుండాలి. ఆంధ్రోళ్లు నీళ్లు దోచుకు పోతున్నారనే భావోద్వేగాలతో అధికారం నిలబెట్టుకోవాలి. ఇది జగమెరిగిన సత్యం. పోనీ ఈ విషయం అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చట్టపరంగా తెలంగాణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నారంటే అదీ లేదు. తెలంగాణ ప్రభుత్వంతో తలపడేందుకు కెసిఆర్‌తో పెనవేసుకున్నబంధం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాళ్లకు సంకెళ్లు వేస్తోంది. వాస్తవం చేప్పాలంటే ఈ దశలో ఎన్నికలు ముంగిట పెట్టుకొని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ తో ఢీ అంటే ఢీ అనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ండ్డి సిద్ధంగాలేరు. ఫలితంగా రాయలసీమ బలి పశువు కానున్నది. అందుకోసం అపెక్స్‌కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌చేసే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేయడంలేదు. దురదృష్టం మేమంటే రాయలసీమ కూడా ఈ దిశగా ఆలోచన చేయడంలేదు. ప్రధానంగా సీమ అస్తిత్వంకోసం నిజాయితీగా పోరాడే ఉద్యమకారులు కూడా కీలక మైన ఈ డిమాండ్‌ ముందుకు తేవడంలేదు.
2016 లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తీవ్ర చర్చలు జరిగాయి. తుదకు నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జలసంఘం నిశితంగా పరిశీలన గావించిన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించేవరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు, దిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం నిలుపుదల చేయాలని తీర్మానం చేశారు. ఇది ప్రభుత్వ రికార్డుల్లో నమోదైవుంది. గత ప్రభుత్వం చేపట్టి అమలుచేసిన ఏ అంశం కూడా పొడగిట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సర్కారు ఈ తీర్మానాన్ని పక్కన పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులువచ్చి నీటి కేటాయింపులు మాత్రం మిగిలివున్న దశలో జగన్మోహన్‌ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహించితే నీటికేటాయింపులు కూడా తెలంగాణ సాధించితే శ్రీ శైలం జలాశయం నుండి 90 టియంసిలు నికర జలాలు దానికి దఖలు పడతాయి. ఇదే జరిగితే రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సాగునీటిపై తీవ్ర ప్రతికూల ప్రభావంపడే అవకాశముంది.

వి. శంకరయ్య, సెల్‌:9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img