Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

సైన్సుకు దేశంలో గడ్డు కాలం!

భారత ప్రభుత్వంవారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్‌ అకాడమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(ఐఎన్‌ఎస్‌ఏ), నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ), ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్‌ (ఐఏఎస్‌). ఆ మూడూ స్వయం ప్రతిపత్తిగల సంస్థలు. ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు చేయడం వీటి ధ్యేయం! అంతేకాదు. దేశంలో ఉత్తమ పరిశోధనలుచేస్తూ, సమాజానికి మేలుచేస్తున్న శాస్త్రజ్ఞుల్ని గుర్తించడం, వారికి అవార్డులు ప్రకటించి ప్రోత్సహించడం వీటిఉద్దేశం. ఇందులో మూడవది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఏఎస్‌) అవార్డులు ప్రకటించదు. కాని, మొదటి రెండు దేశవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాలలో కొన్ని వందల సంఖ్యలో ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తోంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్‌లోంచి వైజ్ఞానిక విషయాలు, చారిత్రక అంశాలు తొలగించి తమ హిందుత్వ ఎజెండాను అమలు పరచాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘విజ్ఞాన్‌ ప్రసార్‌’ లాంటి గొప్ప వైజ్ఞానిక సంస్థను కూడా మూసేసింది. వీటన్నిటిని ప్రారంభించి, ప్రోత్సహించింది భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గనక, ఆయనపై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగానే వైజ్ఞానిక సంస్థలు మూసివేయడం, వాటికి ప్రతి ఏటా ఇవ్వాల్సిన నిధులు అందివ్వకపోవడం చేస్తున్నారేమో ఇటీవల జవహర్‌లాల్‌ నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.యం.మ్యూజియంఅని ప్రకటించడం మనకు తెలుసు. ఎలాగైనా సరే ఎక్కడా నెహ్రూ పేరు వినిపించకుండా చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇంతటితో ఆగకుండా ప్రతి ఏటా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులను కూడా రద్దు చేసింది. 2022లో సుమారు 300 సైన్స్‌ అవార్డులను రద్దుచేసిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ, ఈ సంవత్సరం మరో ముందడుగువేసి, 92 సైన్స్‌ అవార్డుల్ని రద్దు చేసింది. ఇలాంటి విషయాలకు పత్రికలకు, మీడియా విస్త్రత ప్రచారమివ్వవు. అందువల్ల, సామాన్యజనానికి విషయాలు తెలియవు. కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకుంటున్న అకాడమీలు ఇచ్చే అవార్డులు ఇకపై కొనసాగించరాదని ఈ ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ప్రభుత్వం భావించింది. యువ శాస్త్రవేత్తలు, సైన్సు టీచర్లు, లెక్చరర్లు, జాతీయ అంతర్జాతీయస్థాయి కలిగిన సైంటిస్టులకోసం వివిధ స్థాయిల్లో ఇస్తున్న అనేక రకాల అవార్డులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. తమకు దక్కాల్సిన గుర్తింపుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసినందుకు వివిధ పరిశోధనాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పరిశోధనక విద్యారులు అందరూ అందోళనపడడం, పెద్దఎత్తున తమ నిరసనలు తెలియజేయడం మామూలే! అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విషయంలో చీమ కుట్టింది గనుకా? గతంలో పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, సాహిత్య అకాడమీ అవార్డుల్ని (అవార్డు వాపసీ) ప్రస్తుత ప్రభుత్వానికి తిప్పికొట్టినప్పుడే ఈ ప్రభుత్వం సిగ్గుపడలేదు. ఇక ఇప్పుడు పడాలని ఎందుకు అనుకుంటుందీ?
ఇక మిగిలింది ఒక్కటే ఈ దేశంలో విజ్ఞానశాస్త్రం ఎవరూ చదవగూడదు. అని చట్టం తీసుకురావడమే! ఇంత చేసిన వారు ఇక ముందు అదికూడా చేయరని నమ్మకమేమిటీ! మన కేంద్ర ప్రభుత్వంపై మనకు తప్పకుండా నమ్మకముండాలి. కాబట్టి, వారు సులభంగానే ఈ కింది చట్టాలు తేగలరు. దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు. దేశంలో వైజ్ఞానిక స్పృహ ఉండకూడదు. భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరెత్తితే ఇకపై కఠినశిక్షలు. గత జ్ఞాపకాలు ఎవరికీ ఉండకూడదు. ఎవరూ గత చరిత్రను తవ్వి తీయగూడదు. ప్రభుత్వం వారి ‘మన్‌కి బాత్‌’ మాత్రమే విని చెవులు ఊపుతూ ఉండాలి. దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతికిస్తున్నాం అంని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పి వస్తుంటారు. వాటిని విని నోరు మెదపకూడదు. మైనారిటీలను స్వంత బిడ్డల్లా చూసుకుంటాన్నమని అంతర్జాతీయ వేదికలమీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. మనమిక్కడ చప్పట్లు చరుస్తుండాలి.
బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని ప్రతి ఊర్లో సందు గొందుల్లో గొంతెత్తి నినదించాయి. దేశ రాజధాన్ని దిల్లీ నడిబొడ్డున మహిళా క్రీడాకారులుమీద దౌర్జన్యం చేశారని తెలిసినా నోరు విప్పగూడదు. అమెరికా పర్యటనలో వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో భారతదేశంలో జరుగుతున్న హిందుత్వ అఘాయిత్యాలమీద, గుజరాత్‌ మానవహననం మీద, జాతి వివక్షమీద, అసమర్థపాలన మీద విలేకరులు సంధించిన కేవలం రెండు ప్రశ్నలకు కూడా సమాధానిమివ్వకుండా ‘ప్రజాస్వామ్యం మా డిఎన్‌ఏలో ఉందని’ మన ప్రధాన నాయకుడు పిట్టకథ చెప్పి వచ్చిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించగూడదు. వాషింగ్టన్‌ డి.సి. ప్రధాన వీధుల్లో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వంమీద అక్కడి జనం విమర్శలు గుప్పిస్తుంటే మన ప్రధాన నాయకుడు నోరు మెదపకుండా నవ్వుతూ ఏడుపు మొహం వేసుకుని రాలేదా? భారతదేశంలో ప్రస్తుత హోం మత్రి ఒక జడ్జిని చంపించిన క్రిమినల్‌ అని వాషింగ్టన్‌ వీధుల్లో తమ అధ్యక్షుడు బైడెన్‌కు వినపడేంతగా మైకులు పగిలేట్టు వక్తలు ఉద్రేకంతో ఉపన్యసిస్తుంటే దేశం వెలిగిపోతోందని, మనమిక్కడ మన్నుదిన్న పాముల్లా పడిఉండాలా? వద్దా? ఉండాల్సిందే కదా? మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ఇంటర్వ్యూలో భారత ప్రధానిని ఉద్దేశించి సంధించిన ప్రశ్నలు వినిపించినా వినపడనట్లే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఆయనగారు అక్కడ తిరగలేదా? అంత పెద్దస్థాయిలో ఉన్నవాడికి లేని సిగ్గుసామాన్య మానవులం మనకు ఎందుకబ్బా? పట్టించుకోవద్దు కదా? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన చర్మాన్ని మనమే మందంగా తయారు చేసుకోవాలి! తప్పదు మరి భారత ప్రధాని పర్యటనపై స్పందిస్తూ ముగ్గురు ప్రతిభావంతులైన ప్రముఖ అమెరికా సెనెటర్లు చెప్పిన విషయాలు చూద్దాం. ఇందుల్లో మొదటి ఇద్దరు మహిళలు. చాలా తీవ్రమైన పదజాలంతో నేటి భారత ప్రభుత్వంపట్ల తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మానవహక్కులకు విఘాతం కలిగిస్తూ, జర్నలిస్టులను హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసిన ఘనమైనచిత్ర ప్రస్తుత భారత ప్రధానిదికోరి బుష్‌
మానవహక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గౌరవించకూడదు. ఒకసియో కోర్ట్జ్‌ ప్రధాని మోదీ ప్రభుత్వ పత్రికా స్వేచ్ఛను, స్వేచ్ఛాలోచనను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష సభ్యులమీద నేరాలు మోపింది. జైలుపాలు చేసింది. పౌర సంఘాల స్వేచ్ఛను హరించింది. తనను కలిసినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌,తప్పక ఈ సమస్యల్ని భారత ప్రధానికి ఎత్తి చూపాలి! ప్రశ్నించాలి!!బెర్ని శాండర్స్‌
దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఘనంగా భారత ప్రధానిని ఆహ్వానించాడూ? అందులో ఉన్న రహస్య మేమిటీ అంటే ఇరు దేశాలమధ్య ఉన్న లావాదేవీలు ముఖ్యకారణం` అంతకు మించి అక్కడ భారత ప్రధానికి వ్యక్తిగతంగా లభించిన గౌరవమేమీ లేదు. భారతదేశం మంచి కొనుగోలు దారు. ఆయుధాలు అమ్మడంలో అమెరికాది అగ్రస్థానం. కొనుగోలు చేయడంలో ప్రపంచదేశాల్లో భారత దేశానిది అగ్రస్థానం. మంచి కొనుగోలుదారుణ్ణి ఏ అమ్మకందారుడూ వదులుకోడు కదా? భారత్‌లో జరుగుతున్న అంతర్గత విషయాలను విమర్శిస్తూ వ్యాపారపరంగా వచ్చే లాభాల్ని చెడగొట్టుకోవడం ఎందుకూ? అది అక్కడి ప్రభుత్వానికి నచ్చదు కాదా?అమెరికాలో భారత సంతతివారు ఎక్కువ. పైగా అక్కడ ముఖ్యభూమిక పోషిస్తున్నవారు కూడా ఎక్కువే. భారత ప్రధాని పట్ల బైడెన్‌ ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించినట్లయితే భారత సంతతికి చెందిన అమెరికా పౌరుల నుండి బైడెన్‌ ప్రభుత్వానికి మద్దతు బలంగా ఉంటుంది కదా? అమెరికా అధ్యక్షుని నివాస భవనంలో అక్కడి విలేకరులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు భారత ప్రధాని నేరుగా సమాధానం చెప్పకపోయినా కూడా అక్కడి విలేకరులు విరుచుకుపడలేదు. కారణం అధ్యక్ష భవనంలోని ప్రోటోకాల్‌. అయితే ‘టెలివిజన్‌లలో ప్రత్యక్షంగా చూసిన ప్రపంచ పౌరులంతా భారత ప్రధాని మేథో సంపత్తిని బేరీజు వేసుకునే ఉంటారు. దేశంలో అవార్డులు రద్దుచేసి, తగుదునమ్మా అని ఈజిప్టు వారిచ్చిన అవార్డు పుచ్చుకుని రావచ్చా? అలాంటి వారికి ఆ ఆర్హత ఉంటుందా? ఈ దేశప్రజలు ఆలోచించాలి. ఇటీవలి కర్నాటక ఎన్నికల్లో ప్రజాసంఘాలు నిర్వహించిన పాత్ర గుర్తుతెచ్చుకుని, మతం అన్నవాణ్ణి మట్టి కరిపించాలి. అనే ధ్యేయంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాసంఘాలు ఏర్పడ్డాయి. జన చైతన్యానికి సమాయత్తం కావాలి!! జనవరి 2024లో జరగాల్సి ఉన్న సైన్స్‌ కాంగ్రెస్‌కు అన్ని రకాల వనరులసాయం నిలిపివేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వారి డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకటించింది. ఈ రకంగా కూడా భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మీద నేటి ప్రభుత్వం ఉక్రోషం వెళ్లగక్కుకుంది. ఆ రకంగా దేశాన్ని వెనక్కి నడిపించడంలో విజయవంతంగా మరో ముందడుగు వేసింది!
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img