Friday, September 22, 2023
Friday, September 22, 2023

స్త్రీలను మనుషులుగా చూడని మతాలు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

స్త్రీలను బానిసలుగా చేసే, ప్రాతివత్యానికి కుదించి, వంటింటి కుందేళ్లుగా మార్చినవి మతభావనలే. స్త్రీలను బురఖాల్లోకి నెట్టిన మతాలెన్నడూ వారిని మనుషులుగా చూడలేదు. అభ్యున్నతి సాధించామనుకుంటున్న ఈ 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీల పరిస్థితి బాగుపడలేదు. ఒకప్పుడు వారికి ఓటుహక్కు లేదు. ఉద్యోగాలు చేసినా పురుషులతో సమానంగా జీతాలు లేవు. కూలిపనిలో సైతం మగవారికి దొరికినంత కూలీ దొరకలేదు. ఇలాంటి ఎన్నో సామాజిక అవకతవకలకు మూల కారణం మతభావనలే. అవగాహనా రాహిత్యమే. మహిళా వ్యోమగాములు అంతరిక్షం చుట్టివస్తారుగానీ, కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశించలేరు. మన భారతీయ మహిళా శాస్త్రవేత్తను రాయల్‌ సొసైటీ గుర్తిస్తుంది కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ముట్టు గుడిసెలుంటాయి. అర్థనారీశ్వరుణ్ణి సృష్టించుకుని, వ్యర్థ పూజలు చేస్తారు గానీ, కుటుంబ వ్యవస్థ బలంగా కొనసాగడానికి పూర్తిసమయం వెచ్చిస్తున్న మహిళల్ని మాత్రం తక్కువగానే చూస్తారు. దైవ భావనలో మునిగిన మతాలన్నీ కలిసికట్టుగా స్త్రీలను అనేకరకాల అణచివేతలకు గురిచేస్తూ వచ్చాయి. పురుషులుబైట తమ జీవితాల్ని శాసించే పెత్తందార్ల అణచివేతకు గురైతే, మహిళలు బైట పెత్తందార్ల అణచివేతకు, ఇంట్లో పురుషుల అణచివేతకూ గురి కావల్సివచ్చింది. ఆధిపత్య వర్గాల మీద పెరిగిన కసి, కోపం ఎక్కడా వెళ్లగక్కలేక, అదంతా తెచ్చి పురుషులు ఇంట్లో స్త్రీల మీద తీర్చుకోవడం జరిగేది. అగ్రవర్ణాలు స్త్రీలకు రూపొందించిన కట్టుబాట్లు ఇతర ఆధిపత్య వర్గాలవారు, అణగారిన వర్గాలవారు కూడా పాటించడం జరుగుతూ వచ్చింది. అగ్రవర్ణాలవారు గొప్ప వాళ్లయినట్లూ, వారి అడుగుజాడల్లో తామునడవాల్సి ఉంటుందన్నట్టూ మిగతావారంతా భావించుకునేవారు. అలా అనుకరణ సాగుతూవచ్చింది. ఇదే పరాయీకరణ. గొప్పవారిలాగ తామూ బతకాలనుకోవడమే పరాయీకరణ.
అణగారిన వర్గాలు విద్యకు, వివేకానికీ దూరం చేయబడి, గుడ్డిగా అగ్రవర్ణాల్ని అనుకరిస్తూ వచ్చారు. వారు పూజించే దేవుళ్లనే తమ దేవుళ్లను కున్నారు. వారి ఆచారాలూ, చాదస్తాలూ కూడా తమవే అనుకున్నారు. అలా అనుకునేవిధంగా ప్రభావితం చేయబడ్డారు. స్త్రీల గురించి వారు రూపొందించిన నియమ నిబంధనల్ని వీరు కూడా జీవితంలో పాటిస్తూ వస్తున్నారు. ఇది సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనుధర్మశాస్త్రం ప్రకారం, బ్రాహ్మణుల కున్న స్థాయి కింది కులాలవారికి, అంటే బ్రాహ్మణేతరులకు లేదు. మరి ఈ కింది కులాలవారు పట్టుబట్టలు కట్టి, దేవతార్చనలు చేసి, యాగాలు నిర్వహించి, మఠాధిపతుల కాళ్లమీద పడి ఎందుకీ నానా యాతన? అంటే కేవలం పరాయీకరణ! తాము కానిదేదో అయిపోవాలని తాపత్రయం. మతపెద్దలతో మంచి వాళ్లనిపించుకోవాలనే దుగ్ధ. ఆత్మద్రోహం చేసుకుని, అవన్నీ చేయడంవల్ల వీరేమైనా ఉన్నతమైన సామాజిక వర్గానికి మారిపోతారా? లేదుకదా?
ఇది ఇలా ఉండనిస్తే మనుధర్మ శాస్త్రంలోనూ, ఇతర పురాణాల్లోనూ స్త్రీల గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఏం చెప్పారో చూద్దాం! మరి వాటిని అగ్రవర్ణం కానివారు, ఇతర సామాజిక వర్గాలవారు ఎందుకు ఆచరిస్తున్నారూ? ఆలోచించుకోవాలి. విజ్ఞతతో విశ్లేషించుకోవాలి. ఎవరో అగ్రవర్ణంవారు చెప్పారు కదా అన్ని గంగిరెద్దులా తలూపుతూ పాటించడమేనా? శ్రమతెలియని, శ్రమ విలువ తెలియని మూర్ఖ పండితుల బోధనల్ని ఖాతరు చేయడం ఎందుకూ? స్త్రీల గురించి ఏఏ శాస్త్రాల్లో ఏముందో ఒకసారి గమనించడండి. దాదాపు ఇవే భావాలు ఇతర మతగ్రంధాల్లోనూ ఉన్నాయి. వెలికితీసి, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. యజ్ఞవల్క స్మృతి 1187లో విషయాలు ఇలా ఉన్నాయి. భర్త ఆజ్ఞ లేకుండా స్త్రీ బైటకుపోరాదు. చప్పుడు అయేట్లు నడువరాదు. అపరి చితులైన పురుషులతో మాట్లాడరాదు. చీర మడమలవరకు కట్టుకోవాలి. నాభి భాగం కనపడనీయరాదు. రొమ్ము భాగం వ్యక్తం కానీయరాదు. నోటిని కప్పుకోవాలి తప్ప, నోరు తెరిచి బిగ్గరగా నవ్వరాదు. ఇక కూర్మ పురాణంలో మరొక మూర్ఖపు ఆలోచన రాసి ఉంది. స్త్రీలుచేసే మానసిక వ్యభిచార ఫలితంగానే వారికి నెలనెలా ముట్టురూపంలో మైల రావడం జరుగుతూఉంది. మనుధర్మశాస్త్రంలో స్త్రీలను కించపరిచే అంశాలు చాలా ఉన్నాయి. ఏ బ్రాహ్మణుడైతే శూద్ర స్త్రీని తన పానుపు నెక్కించుకుంటాడో అతను అధోగతి పాలవుతాడు. ఆమెతో సంతానాన్ని పొందితే బ్రాహ్మణ్యాన్నే కోల్పోతాడు(317) ఏ కన్యకైతే తండ్రెవరో తెలియదో, తోడబుట్టిన వాడు కూడా ఉండడో అలాంటి కన్యను వివాహమాడకూడదు. స్త్రీలు మనసుని అదుపులో పెట్టుకోలేదని రుగ్వేదం (3:33:17) చెపితే, స్త్రీల లోపాల్ని, దుర్గుణాల్ని చెప్పాలంటే నూరు నాలుకలకు నూరేళ్ల కాలమైనాచాలదు. అని మహాభారతం (8:7478) చెప్పింది.
గొప్పగా చెప్పుకునే మనుస్మృతిలో స్త్రీని గురించి అభిప్రాయాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. పురుషుల్ని చెరచడం స్త్రీల స్వభావం. వారు అజ్ఞానుల్నే కాదు, విజ్ఞుల్ని కూడా బ్రష్టు పట్టిస్తారు. వయసులో ఉన్నాడా చక్కని వాడా? అనేవి కూడా చూడరు. మగవాడైతే చాలు! పురుషుణ్ణి చూడగానే అతని పొందుకోరు కుంటారు. వ్యభిచార శీలత వారి సహజ లక్షణమని వేదాలు చెప్పాయి. ఈ వ్యభిచార కాంక్షవల్లనే స్త్రీకి భర్తమీద అనురాగం ఉండదు. తల్లి, చెల్లి, కూతురితోనైనా సరే, పురుషుడు ఒంటరిగా కూర్చోకూడదు. వ్యభిచారం చేసిన స్త్రీ తరువాతి జన్మలో నక్కగా పుడుతుంది. భర్త చనిపోతే ఆమె మళ్లీ పెళ్లి చేసుకోగూడదు. కానీ, భార్య చనిపోతే అంత్యక్రియల ఆనంతరం పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు చపలచిత్తులు కాబట్టి వారు సాక్ష్యానికి పనికిరారు. కొంచెం ఇటూ అటూగా ఇవే భావాలు అన్ని మతాలు ప్రచారం చేశాయి. స్త్రీని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా అణిచిపెట్టాయి. పురుషుల్లాగ వారు కూడా మనుషులేనన్నది గుర్తించలేదు. స్త్రీలను అణిచిపెట్టడంలో హిందు,ముస్లిం,క్రైస్తవ మతాలతో సహా ఇంకా అనేక ఇతర మతాలూ ఒకేవిధంగా ప్రవర్తించాయి. ఒకప్పటి మాతృస్వామ్య వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థగా మార్చేశాయి. మూలవాసుల్ని అణగదొక్కి, వలసవచ్చిన వారే అధికారం చేపట్టినట్లు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఒకే విధంగాఉంది. మతాలన్నీ స్త్రీలకు నీచమైన నియమ నిబంధనల్ని రాసిపెట్టాయి. అరబ్‌ దేశాల వృద్ధులు, వారికి మనుమరాళ్ల వయసులో ఉన్న ఇక్కడి బాలికల్ని వివాహం చేసుకుని, తీసుకుపోయి. వారిని బానిసలుగా వాడుకోవడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మతాలు గొప్పవైతే అవి వాటి గొప్పతనాన్ని కాపాడుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు.
బైబిల్‌లో ఆడవారి గురించి ఇలా ఉంది…
అక్క చెల్లెల్ని చూసి ‘నిన్న రాత్రి తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి నీవు అతనితో శయనించు’ ఆ విధంగా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారు క్రైస్తవ మతమునకు మూలకారకులు. (బైబిల్‌ అది కాండం 19:3138) అన్న చనిపోయిన పిల్లలకోసం మరిది వదినను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే వెలివేయబడతారు. (దితియోపదేశ కాండము 25:11) భర్త గల స్త్రీ కంటే ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది. అని యోహోవా చెపుతున్నారు (యోషయా 54:1) స్త్రీలు వలల మాదిరి ప్రమాద కారులు. వారి హృదయాలు వలల్లాంటివి. వాళ్లచేతులు గొలుసుల్లాంటివి. స్త్రీ చేతిలో చిక్కడం మరణం కంటే హీనం. వెయ్యిమందిలో ఒక్క స్త్రీ కూడా మంచిది కనబడలేదు. (ప్రసంగి 7:2629) పొద్దునలేస్తే వార్తాపత్రికల్లో, మీడియాలో, సోషల్‌మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న వార్తలు మాన భంగాలు, హత్యలు, గృహహింస,ఆత్మహత్యలు వగైరా. వీటన్నింటికీ స్త్రీల పట్ల మతాలు నేర్పించిన అభిప్రాయాలుకారణం. అవునా? కాదా? విశ్లేషించుకోవాలి. మత భావనల్ని వదిలించుకోలేని జనం, మరి వాటినే ప్రామాణికంగా తీసు కుంటున్నారు కదా? భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒకసారి ఇలా అన్నారు. ‘‘నాలాగా భర్తలేని స్త్రీలు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్లంతా గుళ్లలోకి రాకూడదు అనే దుష్ట సంప్రదాయాల్ని మీరు ప్రవేశపెట్టారు. అనుసరిస్తున్నారు. కానీ,నాలాంటి విధరవరాలు కూడా దేశాన్ని పరిపాలించే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం ప్రసాదించింది. నన్ను గుళ్లోకి రావద్దని ఆంక్షలు విధించిన వారిని సైతం శాసించే అధికారాన్ని ప్రధానమంత్రిగా నాకు రాజ్యాంగమిచ్చింది’’ రామాయణంలో రాముడుసీతను అడవులకు తీసుకుపోయాడు. మరోసారిఒంటరిగా ఆడవిపాలు చేశాడు. బాబాసాహెబ్‌ రాజ్యాంగం ద్వారా స్త్రీలకు సమానహక్కులు కల్పించాడు. వారిని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించాడు. ఒక కల్పితపాత్రకు భజనలుచేస్తూ కూర్చోవడమా? లేక మానవుడి ఔన్నత్యాన్ని పెంచిన రాజ్యాంగ స్పూర్తితో మానవీయ విలువల్ని స్థాపించుకోవడమా? అందరూ ఆలోచించుకోవాల్సిన సమయమిది! ముఖ్యంగా స్త్రీలు ఆలోచించుకోవాల్సిన విషయమిది!!
`సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img