Friday, March 31, 2023
Friday, March 31, 2023

స్త్రీ, పురుష అసమానతలోనూ మనదే పైచేయి!

రువాండా ప్రపంచదేశాల్లోకెల్ల ఒక చిన్న పేద ఆఫ్రికన్‌దేశం. దేశ జనాభాలో 90శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. జనాభాలో మూడో వంతుకన్నా ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారే. భారత్‌ 3.5 ట్రిలియన్ల ఆర్ధికవ్యవస్థయితే, రువాండా కేవలం 12 బిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ గల దేశం. ఇది భారత్‌ తలసరి ఆదాయంలో 30శాతం. కాని భారత్‌(135) తోబాటు, యుఎస్‌ఏ(27) యుకె(22) ఈయూ దేశాల కన్నా ఒకే ఒక అంశంలో ముందువరసలో ఉందంటే అది లింగసమానత్వ విషయం లోనే. ఈ విషయంలో రువాండా ఆరోస్థానంలో నిలిచింది.

లింగ సమానత్వమనేది ఒక నిర్దిష్ట జనాభాలో పురుషులు, మహిళలు లేదా అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య నిష్పత్తులను తెలియజేయడానికి ఉపయోగించే ఒక గణాంక కొలత. ఉదాహరణకు ఒక దేశంలో బాలురు, బాలికలు సమానసంఖ్యలో ప్రాథమికవిద్య నభ్యసిస్తే, ఆదేశంలో లింగసమానత్వం ఉందని చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ లింగ సమానత్వంకోసం సెప్టెంబరు 20, 2014లో ‘‘హి ఫర్‌ షి’’ పేరుతో ఉద్యమం ప్రారంభించింది. వీరిద్దరిమధ్య సమానత్వాన్ని హరించి మహిళా వెనుకబాటుతనానికి దారితీసే అంశాలు 1) ఆర్థిక పరమైనవి 2) సాంఘిక పరమైనవి 3) ఆరోగ్యపరమైనవి 4) విద్యాపరమైనవిగా చెప్పొచ్చు. పితృ స్వామ్య సమాజం, పుత్ర ప్రాధాన్యం లింగ అసమానతలకు కారణాలు. ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానత్వం కొనసాగుతుండడం గమనార్హం. 2016లో ప్రపంచదేశ లింగసమానత్వ విషయంలో 87వ స్థానం పొందిన భారత్‌, తాజాగా 2022లో 146దేశాల్లో 135వ స్థానం పొందడం పాలకులు ఆలోచించవలసిన విషయం. మహిళలకు పాఠశాల విద్యను నిషేధించిన అప్ఘానిస్థాన్‌ వంటి దేశంకన్నా 11 స్థానాలు ఎగువలో భారత్‌ ఉంది. పొరుగు దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, మైన్మార్‌, భూటాన్‌, చైనా, శ్రీలంక, భారత్‌ కన్నా ఈ విషయంలో మెరుగుగా ఉన్నాయి. భారత్‌ సహా దక్షిణాసియా దేశాలన్నీ లింగసమానత్వం సాధించడానికి మరో 200 ఏళ్లు పట్టవచ్చని ప్రపంచ ఆర్థికఫోరం పేర్కొంది.
మహిళల వెనుకబాటు
పురుషులు, మహిళలు ఒకేఅర్హతతో, ఒకేస్థాయిలో పనిచేయడం ప్రారంభించినా, ఆర్థికరంగంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని ఆక్స్‌ఫాం నివేదిక-2022 తెలిపింది. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-21లో శ్రామిక శక్తిలో మహిళలు 25.1శాతంకాగా, బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2004-05లో శ్రామికశక్తిలో మహిళలు 42.7శాతమున్నారు. ఇప్పుడది దాదాపు సగానికి పడిపోయింది. ఈ కాలంలో దేశం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, శ్రామికశక్తిలో మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఈ నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాల కొరత తీవ్రమైంది. అది మహిళలను మరింత ఎక్కువగా శ్రామికశక్తి నుంచి బయటకు నెట్టివేసింది. ఇంటి బాధ్యతలు, సాంఘిక పరిస్థితుల కారణంగా అర్హతలున్నప్పటికీ మహిళలు ఉద్యోగాల్లో చేరడానికి మొగ్గు చూపట్లేదు. ఈ అంశం వివక్ష తీవ్రతను తెలియజేస్తోంది. సగటున 99శాతం మహిళలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపరంగా లింగవివక్ష ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.
రాజకీయ వెనుకబాటు
రాజకీయంగా చూస్తే, నేటికీ మహిళలు పురుషుల కన్నా చాలా వెనుక బడేవున్నారు. యూపీఏ హయాంలో మహిళాబిల్లు పెద్దలసభలో ఆమోదించినప్పటికీ నేటికీ లోకసభలో ఆమోదానికి నోచుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి కీ.శే నందమూరి తారకరామారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమానంగా మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడంతోబాటు తండ్రి ఆస్తిలో సమానవాటా దక్కేట్లు చట్టం చేసారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ 2016లో ఈ రంగంలో మహిళలు తొమ్మిదో స్థానంలో నిలవగా, 2017లో ఇది 15వ స్థానానికి, 2018లో 19వ స్థానానికి, 2021లో 51వ స్థానానికి దిగజారింది. రాష్ట్రాల స్థానిక సంస్థల పరిపాలన విషయంలో మహిళలు సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, ఎంపిటిసిలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా ఎన్నికైనప్పటికీ, కుటుంబసభ్యులు చక్రం తిప్పడం కొనసాగుతోంది. ఇక ఆరోగ్యపరంగానూ, ఆర్ధికఅంశాల్లోనూ, భారత్‌ 146 దేశాల్లో 143వ స్థానంలో ఉంది. ఈ అంశాల్లో భారత్‌ మొదటినుంచి వెనుకబడేవుంది. దేశంలో గత ఐదేళ్ళనుంచి ప్రతీ 1000 మంది మగపిల్లలకు 952 ఆడశిశువులు జన్మించడం దీనికి ఒక కారణం, జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే ప్రకారం ప్రతీ 1000 మంది మగశిశువులకు, ఆడశిశువులు 929గా తేల్చారు. ఇక మహిళల ఆర్ధిక అవకాశాల విషయానికొస్తే, 2020-21లో పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ నివేదిక, 2020-21 ప్రకారం, భారత్‌లో మహిళా కార్మికశక్తి 23.15 శాతం కాగా, పురుషులు 57.75శాతం. మిగిలినవారు 18 ఏళ్ల లోపువారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో కేవలం 25.2శాతం మంది మహిళలు కాగా, 74.8శాతం పురుషులే. భారత్‌లో పురుషులు 82శాతం మంది కార్మికులుగా ఆదాయాన్ని సంపాదిస్తుంటే, మహిళలు కేవలం 18శాతం మాత్రమే ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ప్రపంచ అసమానతల నివేదిక-2022 పేర్కొంది. ఏటా బడ్జెట్‌లో సామాజిక ఆర్ధిక ఫలాలకోసం మహిళలకు పురుషులతో సమానంగా తగినన్ని నిధులు కేటాయించడం అవసరం. ఈ విషయంలో ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌ దేశాలు మొదటి ఐదు స్థానాల్లో నిలవగా, పాకిస్థాన్‌, అఫ్ఘ్ఘానిస్థాన్‌ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
రువాండా ఆదర్శం
రువాండా ప్రపంచదేశాల్లోకెల్ల ఒక చిన్న పేద ఆఫ్రికన్‌దేశం. దేశ జనాభాలో 90శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. జనాభాలో మూడో వంతుకన్నా ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారే. భారత్‌ 3.5 ట్రిలియన్ల ఆర్ధికవ్యవస్థయితే, రువాండా కేవలం 12 బిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ గల దేశం. ఇది భారత్‌ తలసరి ఆదాయంలో 30శాతం. కాని భారత్‌(135) తోబాటు, యుఎస్‌ఏ(27) యుకె(22) ఈయూ దేశాల కన్నా ఒకే ఒక అంశంలో ముందువరసలో ఉందంటే అది లింగసమానత్వ విషయంలోనే. ఈ విషయంలో రువాండా ఆరోస్థానంలో నిలిచింది. ప్రపంచదేశాల్లో పురుషులు కన్నా ఎక్కువగా మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఏకైక దేశం. 26 సభ్యులున్న ఆదేశ మంత్రివర్గంలో 13మంది మహిళలే. సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు న్యాయమూర్తులలో నలుగురు మహిళలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 80శాతం మంది మహిళలే. భారతలో ప్రతీ ఒక డాలరు పురుషులకు, అదే పనికి మహిళలు కేవలం 20సెంట్లు మాత్రమే సంపాదిస్తుంటే, రువాండాలో మహిళలు సంపాదన 88 సెంట్లు.
రువాండా ఎన్నోరంగాల్లో విజయాలు సాధిస్తోంది. కాని దేశంలో మహిళలపై వివక్ష కొనసాగుతునే ఉంది. మహిళలు సమాజంలో రెండు రకాలుగా వివక్షకు గురవుతున్నారు. 1) తల్లిదండ్రులు, ఆడపిల్లల ఉన్నత చదువుకు అడ్డుపడడం 2) చదువుకున్నా ఉపాధి రంగంలో మహిళలపై వివక్ష చూపడం. 75ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇద్దరు మహిళలు దేశ మొదటి పౌరులుగా, ఒక మహిళ దేశ ప్రధానిగా పేరొందిన దేశంలో లింగసమానత్వం చాలా అధ్వాన్నంగాఉంది. ఎక్కడో అట్టడుగున ఉండడం కలవరపరచే అంశం. విద్యారంగంలో మహిళలు పురుషులు కన్నా చాలా వెనుకబడే వున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ, ఇది మరీ ఘోరం. ఒకఅబ్బాయి, అమ్మాయిగల పేదకుటుంబాలు అమ్మాయి చదువు కన్నా అబ్బాయి చదువుకే ప్రాధాన్యత నీయడం. మహిళలకు పురుషుల కన్నా కుటుంబ బాధ్యత లెక్కువ. మహిళా సాధికారతకు, సమానత్వానికి, వారసత్వ చట్టం-1956, హిందూ వివాహ చట్టం-1955, వరకట్న నిషేధ చట్టం 1961 వంటి చట్టాలు రూపొందించినప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మహళలపై గృహహింసలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు కోకొల్లలు. పురుషుల్లో సత్ప్రవర్తన, పరిఢవిల్లిననాడే ఇవి కనుమరుగవుతాయి తప్ప చట్టాలు వల్ల సాధ్యం కావు.
డా.యస్‌వై విష్ణు, సెల్‌: 9963217252

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img