Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

స్ఫూర్తినిస్తున్న రష్యన్‌ విప్లవం

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

మానవ జాతి చరిత్రలో కొన్ని సంఘటనలు ప్రజా సమాజంపట్ల మన అవగాహననుమార్చివేశాయి. వీటిలో ముఖ్యమైనది రష్యన్‌ విప్లవం (అక్టోబరు 25, 1917, కొత్త క్యాలెండర్‌ ప్రకారం నవంబరు 7). ఈ విప్లవం మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఫ్రెంచి విప్లవం ప్రజా సమూహాల విప్లవకరఆకాంక్షలను రేకెత్తించింది. అయితే ఆ తరవాత అది బోనా పార్టీ భావజాలానికి లోనైంది. రష్యా విప్లవం విజయవంతమై మొదటిసారిగా కార్మికవర్గ రాజ్యస్థాపన జరిగింది. దోపిడీలు, అసమానతలు, అన్యాయాలులేని సమాజాన్ని అనేకమంది దార్శనికులు, తత్వవేత్తలు ఊహించేందుకు ప్రయత్నించారు. అయితే మహనీయుడు లెనిన్‌ నాయకత్వంలో రష్యా ప్రజలు ప్రపంచ పటంలో సోవియట్‌ను ఆవిష్కరించ గలిగారు. కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ మానవాళి విముక్తి కోసం రూపొందించిన సిద్ధాంతం ఆధారంగా లెనిన్‌ రష్యా విప్లవాన్ని సాధించారు. ఈ మహత్తర విప్లవ కాలంలో జీవించి ఉన్న అమెరికా జర్నలిస్టు జాన్‌రీడ్‌ ఆ కాలంలో జరిగిన చరిత్రాత్మక మార్పును ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు (టెన్‌డేస్‌ దట్‌ షుక్‌ది వరల్డ్‌) గ్రంథంలో అభివర్ణించారు. మార్క్సిజం భావజాలం అమలులో సాహసోపేత సాధన మార్గాలు, మహత్తరమైన సిద్ధాంత పరిశీలనల పునాదుల పైనే రష్యా విప్లవం నిర్మాణమైంది. మార్క్సిజం విప్లవాత్మక భావజాలంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత, సోషలిజం, అంతర్జాతీయ వాదం లాంటి విలువలు పెట్టుబడిదారీ దోపిడీ సంకెళ్ల నుంచి, జార్ల నియంతృత్వం నుంచి రష్యా ప్రజాసమూహాలను విముక్తి గావించాయి. భావజాల పరమైన విశిష్టమైన అంచనా రష్యావిప్లవాన్ని ప్రపంచ చరిత్రలో నూతన శకంలో మహత్తర సంఘటనను సృష్టించడమే కాక ప్రపంచవ్యాప్తంగా విముక్తి ఉద్యమాలకు స్ఫూర్తి దాయకమైంది.
నూతన సమాజ నిర్మాణంలో మార్క్సిజం నిర్వహించిన పాత్రపై ఐరోపా అంతటా తీవ్రమైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అయితే లెనిన్‌ మాత్రమే సోషలిస్టు విప్లవాన్ని సాధించగలిగారు. రష్యా సమాజం ప్రత్యేకతలకు అను గుణంగా మార్క్సిజాన్ని ఆయన అమలు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ, ఇంగ్లండ్‌లలో విప్లవకర పరిస్థితులు ఏర్పడతాయని ఆనాడు మార్క్సిస్టు శక్తులు అంచనా వేశాయి. అయితే అత్యంత వెనుకబడిన రష్యాలోనే మొదటి సోషలిస్టు విప్లవాన్ని లెనిన్‌ గొప్ప నాయకత్వంలో సాధించగలిగారు. నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కార్మికులు, కర్షకుల మధ్య విడదీయలేని సఖ్యతను ఆయన నిర్మించగలిగారు. రష్యన్‌ విప్లవం, ఇతర విముక్తి పోరాటాల అనుభవాలను, మేధోమథనంతో రూపొందించిన భావజాలానికి అనుగుణంగా విప్లవాన్ని తీసుకురావాలి. ఇదే సమయంలో దోపిడీ రూపాలను, నమూనాలను, వారసత్వాన్ని ఎదుర్కొని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని అర్థవంతంగా, సమర్థంగా నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాలి.
మార్క్సిస్టులకు, సోషల్‌ డెమోక్రాట్‌లకు అత్యంత తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సందర్భంగా లెనిన్‌ ఇలా రాశారు. ‘‘విప్లవకర సిద్ధాంతం లేనిదే, విప్లవకర ఉద్యమం లేదు. ఆచరణాత్మక కార్యకలాపాలను సంకుచిత రూపాలలో వ్యామోహం, అవకాశవాదం కలగలపి ఫ్యాషన్‌ కోసం ప్రచారం సాగించే సమ యంలో ఈ భావజాలాన్ని గట్టిగా అమలు చేయకూడదు.’’ (లెనిన్‌, 1902) విప్ల వాత్మక సిద్ధాంతం, ఆచరణ, దోపిడీ అంతానికి జరిపే పోరాటం రానున్న తరా లను కూడ ఉత్తేజపరిచేదిగా సందర్భ సహితంగా ఉండాలి. విప్లవ సిద్ధాంతం సందేశం స్పష్టంగానే ఉంది: నిర్థిష్ట పరిస్థితులలోనే సిద్ధాంతాన్ని అమలు చేయాలి.
రష్యాలో విజయవంతమైన విప్లవ వార్త భారతదేశంలో ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ విప్లవం భారత స్వాతంత్య్ర పోరాట కార్యక్రమాలు, నూతన ఆశలను ఒక తాటి మీదకు తీసుకొచ్చింది. భారతదేశంలో ప్రజలు అత్యంత వేగంగా ఎర్రజెండా వైపు ఆకర్షితులయ్యారు. దేశంలో అనేక రూపాలలో ఉన్న దోపిడీని, వర్గం, మతం, స్త్రీ పురుషుల మధ్య అంతరం ఉన్న సమాజం విదేశీ పాలకుల సంకెళ్ల నుండి విముక్తిని ఎర్రజెండా ద్వారా సాధించవచ్చునని ఆశగా చూశారు. వేలాది మంది యువత క్రమంగా భారతదేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి కృషి చేయటం ప్రారంభించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రగతిశీల, నిర్థిష్టమైన కృషిని కొనసాగించారు. స్వతంత్ర రాజ్యాంగ అసెంబ్లీ, సంపూర్ణ స్వాతంత్య్రం, కార్మిక హక్కులు, జమీందారీ విధానం రద్దు, ప్రాథమిక హక్కులు కావాలన్న డిమాండ్‌, భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు నిస్వార్థమైన భూమికను నిర్మించడం, ఇందుకు గొప్ప త్యాగాలు చేయడం లాంటివి వెంటవెంటనే చోటు చేసుకున్నాయి. సోషలిస్టు విప్లవ భావజాలం విస్తృతంగా యువతను ఉత్తేజపరిచింది. ఈ విషయంలో భగత్‌ సింగ్‌ లాంటి యువకులు అత్యంత కీలకంగా నిలిచారు. భారతదేశంలో ఉన్న వాస్తవ సంక్లిష్టతను మన నాయకులు అర్థం చేసుకున్నారు. 1925లో పార్టీ ప్రథమ మహాసభలో అంటరానితనం నిర్మూలన కోసం ప్రభావశీలమైన పిలుపు నిచ్చారు. విప్లవకర సిద్ధాంత మార్గదర్శకంలో వామపక్షం ముందుగా ఎఐటియుసి (1920) ద్వారా పారిశ్రామిక కార్మికుల సమీకరణ, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌1936) ద్వారా విద్యార్థుల సమీకరణ, అఖిల భారత కిసాన్‌సభ (1936) స్థాపన ద్వారా రైతుల సమీకరణ, అభ్యుదయ రచయితల అసోసియేషన్‌ (1936) ఏర్పాటు ద్వారా రచయితల సమీకరణ, ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (1943) ఏర్పాటు ద్వారా కళాకారుల సమీకరణ చేశారు. ఈ సంస్థలన్నీ కాల పరీక్షకు నిలిచాయి. సమాజంలో ప్రగతిశీల ప్రజా సమూహాల ప్రతినిధిగా కొనసాగుతున్నాయి. మహత్తర చరిత్ర నుండి పాఠాలను తీసుకొని నేడు వామపక్షం సమర్థంగా ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోవాలి. కుల వివక్ష, మతాల వారీ విభజన, స్త్రీ, పురు షుల మధ్య అంతరం నెలకొని ఉన్న సమయంలో మనం జీవిస్తున్నాం. ఈ సామా జిక రుగ్మతలన్నీ బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ల పాలనలో మరింత వికృతంగా కొన సాగుతూ మనల్ని సవాల్‌ చేస్తున్నాయి. మహత్తర పోరాటం ద్వారా సాధించుకొన్న స్వాతంత్య్రాన్ని, స్వాతంత్య్ర ఉద్యమ సమ్మిళిత వారసత్వాన్ని ఈ శక్తులు హరించివేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలు ద్రవ్యోల్బణం, అసమానతలు, ఆకలి, పేదరికంలో మగ్గిపోతున్నారు. నమా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ మన జాతీయ సంపదలను ధ్వంసం చేస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. అత్యంత ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అన్ని రకాల అసమ్మతిని దేశ ద్రోహంగా చిత్రిస్తోంది. ఈ నేపథ్యంలో సెక్యులర్‌, ప్రజాస్వామ్య, ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తక్షణం బీజేపీని ఓడిరచాలి.
విచ్ఛిన్నకర, హింసాత్మక భావజాలం, రాజకీయం నిక్షిప్తమై ఉన్న మను స్మృతిని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరాధిస్తోంది. వీరు మన రాజ్యాంగాన్నే సవాలు చేస్తున్నారు. కులం, మతం, ఛాందసవాద వారసత్వ మతాధిపత్య సమాజాన్ని నెలకొల్పాలని తహతహలాడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా వామపక్షం క్రియాశీలంగా పోరా టాలు జరపాలి. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితి రాజీలేని సైద్ధాంతిక పోరాటం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై జరపాలని డిమాండ్‌ చేస్తోంది. వామపక్షం ఈ పోరా టంలో క్రియాశీలంగా నిలవాలి. వామపక్ష పాత్ర సెక్యులర్‌ ప్రజాస్వామ్య శక్తులపై ప్రభావాన్ని చూపాలి. రష్యా విప్లవ దినోత్సవాన్ని నిర్వహించటం ద్వారా కార్మిక వర్గం ఐక్యం కావాలని పిలుపునివ్వాలి. కార్మిక వర్గం, సెక్యులర్‌ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ పైన తీవ్రమైన దాడి జరుగుతున్న నేపథ్యంలో ఈ పోరాటానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పటికీ రష్యా విప్లవం ప్రపంచ వ్యాప్తంగా శతాబ్ది తర్వాత కూడ ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉంది. ఈ స్ఫూర్తి రానున్న తరాల విప్లవ శక్తులలో కూడా కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img