Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

హక్కులకు పాతర!

కూన అజయ్‌బాబు

అది అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ నగరానికి సమీపంలో గల ఓ చిన్న పట్టణం. ఓ అఫ్గానీ మహిళ విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ తన ఇంటికి ఆవలివైపున ఉన్న వీధిలో గల ఓ వైద్యుడి దగ్గరకు వెళ్లింది. ఆ వైద్యుడు ఆ మహిళ నాడి పట్టుకొని చూశాడు. చేతికి ఓ ఇంజక్షన్‌ వేశాడు. ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది… కానీ అంతలోనే… రెండు నిమిషాలైనా దాటకుండానే నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి ఆ డాక్టర్‌కు చెందిన రెండు చేతులు నరికేశారు. ఆ మహిళను బరాబరా ఈడ్చుకొంటూపోయి నడివీధిలో మెడకు తాడుకట్టి, ఆమెను ఉరి తీశారు. హాహాకారాల నడుమ ఆ అమాయకపు ప్రాణి తుదిశ్వాస విడిచింది. ఈ భయానక దృశ్యం ఆ ప్రాంతాన్ని వణికించింది. ఇది 1996 నాటి మాట. ఆ తర్వాత ఐదేళ్లకాలంలో ఇలాంటి ఘటనలు వేలాదిగా జరిగాయి. అఫ్గానీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇటువంటి చావులు సర్వసాధారణంగా మారిపోయాయి. మగతోడు లేకుండా బయటకు వచ్చిన ఓ మహిళను పాయింట్‌బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్చిచంపారు. బయటకు వచ్చాక క్షణకాలంపాటు బుర్ఖా తీసినా మరుక్షణమే ఆమె ప్రాణం గాల్లో కలిసిపోతుంది. పదేళ్లు దాటిన ఏ ఒక్క మహిళ కూడా ఇంటి బయటకు రాకూడదు. పురుష డాక్టర్లు మహిళలకు వైద్యం చేయకూడదు. ఈ రూల్స్‌ను ఎవరు ఉల్లంఘించినా…వారి ప్రాణాలు పోయినట్లే! సంక్షిప్తంగా చెప్పాలంటే ఇదే తాలిబాన్ల పాలన. ఆధునిక యుగంలో అతిపెద్ద రాక్షస పాలన. మధ్యయుగం నాటి విధానాలను అమలు చేసే ముఠాల్లో తాలిబాన్లు ఒకరు. దియోబందిజం, జీహాదిజం, ఇస్లాం ఫండమెంట లిజం… ఇలా వీటన్నింటినీ ఆపోసన పట్టి, అసలుసిసలు ఇస్లాం మత ఉదారత్వానికి దూరంగా పైశాచిక పాలన చేసిన తాలిబాన్లు మళ్లీ అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించారు. సామూహిక హత్యాకాండలు, మానవ అక్రమ రవాణా, మహిళలపై అణచివేత చర్యలు, పౌరులపై హింసాకాండ, హిందువులు, సిక్కులపై వివక్ష, క్రైస్తవులు, ఎయిడ్‌ వర్కర్స్‌పై వేధింపులు, ఆధునిక విద్యపై నిషేధం, సాంస్కృతిక దాడులు వంటివి తాలిబాన్ల పాలనలో సహజం. అందుకే తాలిబాన్ల పునరాగమనంతో ఆ దేశంలో ఒక్కసారిగా హక్కులు మృగ్యమైనట్లుగా నూటికి నూరు శాతం అఫ్గాన్‌ ప్రజలు నమ్ముతున్నారు. అఫ్గానీ మహిళలు, వారి ఈతిబాధల గురించి ప్రస్తావించకుండా ప్రపంచ మహిళల హక్కుల గురించి మాట్లాడుకోలేం.
అటు అమెరికాకైనా, ఇటు బ్రిటన్‌, రష్యా, చైనాలకైనా, మన భారత్‌కైనా అఫ్గానిస్థాన్‌ అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన దేశం. ఒకప్పుడు సుసంపన్నమైన భరత ఖండానికి రావాలంటే అఫ్గానిస్థాన్‌ మార్గమే శరణ్యం. బ్రిటన్‌ను అదుపు చేయడానికి రష్యా, రష్యాను నియంత్రించడానికి బ్రిటన్‌, తదనంతర ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్‌ యూనియన్‌, అమెరికాల మధ్య ఘర్షణలకు అఫ్గాన్‌ ఎల్లప్పుడూ బలిపశువుగా మారుతూ వచ్చింది. అఫ్గాన్‌ను ఎవరో ఒకరు, ఏదో ఒక దేశం పాలిస్తూనే వుంది. సుసంపన్నమైన ఖనిజాలు ఉన్నప్పటికీ, అది పేదదేశంగానే ఉండటానికి గల కారణం అది అగ్రరాజ్యాల యుద్ధభూమిగా మారి ఉండటమే. అందుకే ఆ దేశంలో ప్రజలు ఏనాడూ పూర్తిస్థాయి హక్కులను అనుభవించలేదు. ‘రైట్స్‌’ అనే పదానికి అర్థం తెలియకపోయినా, దాని ప్రాధాన్యత తెలిసిన ప్రజలు అఫ్గాన్‌ దేశీయులే. వారు అంతగా అనుభవించలేదు కాబట్టే వారికి హక్కుల విలువ తెలుసు.
1972`1996 మధ్యకాలంలో అఫ్గానిస్థాన్‌ పూర్తిగా సోవియట్‌ యూనియన్‌ ఆధిపత్యంలో వుంది. ఆ కాలంలోనే పిడిపిఎ (పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఆఫ్గానిస్థాన్‌) ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. నిజానికి అదే ప్రభుత్వం కొనసాగి వుంటే అఫ్గానీయుల హక్కులకు ఢోకా వుండేది కాదేమో! అయితే వారి సంస్కరణలు నచ్చని మత ఛాందసులు ముజాహిదీన్‌లు తిరుగుబాటు మొదలుపెట్టారు. రష్యాకు ఇండియా మద్దతుఉండేది. దాంతో అభద్రతకు లోనైన పాకిస్థాన్‌ అమెరికా సహకారంతో ముజాహిదీన్‌లను, ఆ తర్వాత తాలిబాన్లను పెంచి పోషించడం మొదలుపెట్టింది. ఆ క్షణమే అఫ్గానీల భవిత నాశనమైంది. రష్యా నిష్క్రమణ తర్వాత అంతర్యుద్ధంలో మునిగి తేలిన అఫ్గానీలను ముజాహిదీన్‌లు, ఆ తర్వాత తాలిబాన్లు పాలించి, సర్వనాశనం చేశారు. అమెరికాలో 11/9 బాంబుదాడి తర్వాత బిన్‌ లాడెన్‌, అల్‌ఖైదాకు వ్యతిరేకంగా అమెరికా మోగించిన సమరభేరి తాలిబాన్ల అంతానికి దారితీసింది. తాజాగా అమెరికాసేనలను అఫ్గానిస్థాన్‌ నుంచి ఉపసంహరిస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్ది రోజులకే తాలిబాన్లు తిరిగి పుంజుకొని, ఇప్పుడు కాబూల్‌ను ఆక్రమించే స్థాయికి చేరుకున్నారు. గంజాయి, డ్రగ్స్‌, ఇతర మాదక ద్రవ్యాలు, ఆయుధ స్మగ్లింగ్‌లతో ప్రపంచంలోనే అత్యంత సుసుంపన్నమైన ఉగ్రవాదులుగా పేరు మోసిన తాలిబాన్లు మరోసారి అఫ్గానిస్థాన్‌లో సాంస్కృతిక హననానికి పూనుకుంటా రన్నది నగ్నసత్యం. విదేశీ విమానాల చక్రాలు పట్టుకొని పారిపోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారంటే, తాలిబాన్ల అసుర పాలన ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాలిబాన్ల ఆక్రమణ ఆ దేశ ప్రజల హక్కులకు మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలకూ ముప్పే. మతోన్మాదుల చేతికి అధికారపగ్గాలు చేరితే, దేశంలో హక్కుల పరిస్థితి ఎలా వుంటుందో భారత ప్రజలు కూడా గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img