Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

హిమంతకు టెర్రరిస్టులతో సంబంధాలు

ఆశిస్‌ బిస్వాస్‌

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత కీలకమైన నేతగా అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మకు గతంలో తీవ్రవాదులతో, టెర్రరిస్టులు, చొరబాటు దారులతో సంబంధాలున్నాయన్న వార్తలు వెలువడి సంచలనం కలిగించాయి. అనంతరం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మణిపూర్‌లో రెండు గిరిజన తెగలు మెయితీలు, కుకీల మధ్య చెలరేగిన మంటలు ఆరలేదు. హిమంతకు మణిపూర్‌లో శాంతిభద్రతలు అప్పగించింది. గతంలో టెర్రరిస్టులతో సంబంధాలున్నందున మణిపూర్‌ బాధ్యతను అప్పగించి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. మణిపూర్‌లో ఆరనిమంటల ప్రభావం అసోంపైన కూడా ఉంటుందని భావిస్తున్నారు. అనూహ్యంగా ఈశాన్య ప్రాంతంలో కొత్త విషయాలు వెలుగు చూడటంతో రాజకీయ పరిస్థితులు మరోమలుపు తిరిగాయి. మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజులు పర్యటించి, శాంతి కమిటీని ఏర్పాటు చేసివచ్చిన తర్వాత కూడా రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు ఆగకపోగా హింస తీవ్రమైంది. చివరకి రాష్ట్ర హోం మంత్రి ఇంటిని సైతం దగ్ధం చేసేందుకు దుండగులు దాడిచేసి పాక్షికంగా ధ్వంసం చేశారు. అమిత్‌ షా పర్యటన విఫలం కావడంవల్లనే హిమంతకు అదనపు బాధ్యతను అప్పగించారని భావిస్తున్నారు. పొరుగున ఉన్న మైన్మార్‌ నుండి అక్రమ చొరబాటుదారులు వస్తున్నందున రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు, గృహదహనాలు, లూటీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీనితో రాష్ట్రం అరాచక పరిస్థితిలోకి జారుకుంటోందని అంచనా. మాట మాట్లాడితే తమది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని ప్రచారంచేసే ప్రధాని మణిపూర్‌ కల్లోలాన్ని గూర్చి అంతగా పట్టించుకున్న దాఖలాలులేవు. మెయితీలకు అనుకూలంగా బీజేపీ వ్యవహరించడమే ఈ అల్లర్లకు మూలమన్న విషయం అందరికీ అర్థమైంది.
ఇటీవల కంగ్‌పొక్సి జిల్లాలో దొంగచాటుగా కుకీ మిలిటెంట్లు 13మంది మెయితీలను కాల్చిచంపినట్లుగా వెలుగులోకి వచ్చింది. కొండప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు తమను మెయితీలు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలాఉండగా, అసోం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు తీవ్ర ఇబ్బందికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ గతంలో టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకున్నారన్న విషయం బైటపెట్టడంతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. వివాదాస్పదమైన ఇలాంటి వ్యక్తులను పాలక బీజేపీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది ఆ పార్టీ ప్రతినిధులు చెప్పవలసి ఉంటుంది. పైగా కల్లోల ప్రాంతాల్లో వివాదాస్పదమైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ఏమిటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసోంకు చెందిన 12 రాజకీయ పార్టీల నాయకులు టెర్రరిస్టులతో సంబంధం కలిగిన శర్మను దేశభద్రతా చట్టంక్రింద తక్షణం అరెస్టు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రకటన చేసిన పార్టీలలో కాంగ్రెస్‌, సీపీఎం, రైజర్‌డాల్‌, అసోం జాతీయ ప్రత్యర్థి, సీపీఐ, ఆర్‌జేడీ, జెడీ(యు), తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ(ఎంఎల్‌) సంతకాలు చేశాయి. రహస్యంగా పనిచేసే తీవ్రవాదులతోనూ, నిషేధిత కుకీ గిరిజన సంఘాలతోనూ శర్మకు సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. తమ డిమాండ్‌పై కేంద్రనాయకత్వం స్పందన లేకపోతే తాము దిల్లీకి వెళ్లి విలేకరులతో మాట్లాడి అన్నివిషయాలు చెపుతామని అసోంకు చెందిన ఈ పార్టీల ప్రతినిధి వెల్లడిరచారు. రాజకీయ పరిస్థితిని గందరగోళం పరచడానికి ప్రస్తుతం వివిధ జాతులు, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య సఖ్యతను శర్మ తన వివాదాస్పదమైన ఎత్తుగడలతో, ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ఆయనను అసోం ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని ప్రకటన చేసిన నాయకులు తెలియజేశారు. శర్మ చేసే పనుల్లో అత్యంత క్రూరంగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లను ప్రోత్సహించడం, ప్రైవేటు ఆస్థులపై బుల్‌డోజర్‌లు నడపడం, అతి తక్కువ సమయంలో వారికి నోటీసులు ఇవ్వడం ప్రత్యర్థులైన రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి హింసించడం, బీజేపీకి ఓట్లు వేయని సామాజికంగా వెనుకబడినవారిని హింసించడంఉన్నాయి. ఈశాన్యప్రాంతంలో తీవ్రవాద గ్రూపులతో సంబంధాలను నెరపుతున్న శర్మలాంటి వారినుండి ఎటువంటి ప్రయోజనాలను ఆశించలేం. అంతేకాదు, వివిధ సామాజిక గ్రూపుల మధ్య భయాందోళనలను సృష్టించడం ఈ పరిస్థితి అసోంలేనే కాకుండా, ఎక్కడైనా కనిపిస్తోంది. ఇలాంటి చర్యలను జాతీయ,అంతర్జాతీయ మానవహక్కుల గ్రూపులు, కొన్నిసార్లు న్యాయాధికారులు ఖండిస్తూనే ఉన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, బీజేపీ కేంద్ర నాయకత్వం క్రూరమైన చర్యలకు పాల్పడుతున్న శర్మపై ఏమాత్రం విమర్శించడంలేదు. ఈశాన్యప్రాంతంలో శర్మ సుప్రీం నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఆయనను ఏమీ అనకపోగా, ఈప్రాంత వ్యవహారాలన్నీ ఆయనకే అప్పగించారు. ఆయనచేసే పనులకు సంబంధించి మోదీ`షా లకు మాత్రమే జవాబు చెప్పవలసి ఉంటుంది. వీరిద్దరూ శర్మ చేసే పనులను బహుశ మెచ్చుకుంటున్నారు. ఇటీవల శర్మ గౌహతిలో కుకీ సాయుధగ్రూపుల ప్రతినిధులతో రహస్యంగా కలుసుకుని మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఇంఫాల్‌కు చేరుకుని ఈ ప్రాంతంలో జరుగుతున్న హింసాకాండను నిలిపివేసేందుకు తిరిగినట్లుగా బీజేపీ వర్గాలు చెప్పాయి. ఆయన వివిధ గ్రూపుల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. దిల్లీ నుంచి ఆదేశాలు రావడం వల్లనే మణిపూర్‌ బీజేపీ మంత్రులతో సహా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడిరచలేదు. అసోం కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేన్‌ బొరాప్‌ా మాట్లాడుతూ కుకీ తీవ్రవాద నాయకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)అధికారులకు అసలు విషయం తెలియజేశారు. తాము శర్మను కలుసుకున్నది నిజమేనని వారు వెల్లడిరచారు. మణిపూర్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీని గెలిపించేందుకు తాము సహకరిస్తామని అయితే తమ కోర్కెలను అంగీకరించాలని శర్మ, రామ్‌ మాధవ్‌లతో చెప్పినట్లుగా కుకీ గిరిజన నాయకుడు తెలిపారు. టెర్రరిస్టులతో సంబంధంఉన్న నాయకుడికే ఈప్రాంతంలో శాంతిని నెలకొల్పే బాధ్యత అప్పగించడం అత్యంత తీవ్రమైన నేరమే అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img