Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అడకత్తెరలో ఆర్థిక భారతం

బి. లలితానంద ప్రసాద్‌

ఏ సమాజంలోనైనా పరిస్థితుల ప్రభావం సమాజంలోని అందరి పైన ఏదో రూపంలో ఉంటుంది. వీటిని అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. మ్యాంద్యం, ద్రవ్యోల్భణం రెండూ ఒకేసారి కలిసి పయనిస్తున్నట్లుగా పలు గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ఇది అరుదైనది. అవాంఛనీయమైనది.
ఈ రెండిరటి అడకత్తెరలో దేశంలోని ప్రజలంతా
ఎంతగా నలిగిపోతున్నారనేది అంచనాలకు అందదు.

దేశంలో ఆర్థిక పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దీని దుష్ఫలితాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. రెండేళ్ళుగా కొవిడ్‌ కారణంగా అతలాకుతలమైన ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మనదేశం పరిస్థితీ ఇదే. అన్ని రంగాలను మించి ఆర్థిక రంగం అస్తవ్యస్తమైంది. ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకు మన జీడీపీ వృద్ధిరేటును గత అంచనా 11 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. దీంతో పాటు ఇతర ఆర్థిక అంశాలు పరిశీలిస్తే మనం ఎటు వెళ్తున్నాము? ఏమైపోతున్నాం? అనే సందేహాలు వెంటాడుతున్నాయి వీటిని సక్రమంగా సమీక్షించి సరిదిద్దుకోవాలి. నిష్పాక్షికంగా వాస్తవాల ప్రాతిపదికన సదవగాహనతో సమీక్ష అవసరం.
ఆర్థిక అంశాల పరిశీలనలో తరచూ ప్రస్తావనకు వచ్చేవి జీడీపీతో పాటు ద్రవ్యో ల్బణం, ఆర్థికమాంద్యం. జీడీపీపై దృష్టి పెట్టినంతగా మిగిలిన అంశాలను పట్టించు కోరు. నిజానికి అవి కూడా వాస్తవ పరిస్థితులకు దర్పణం పడతాయి. ద్రవ్యోల్బణంలో సహజంగా ధరలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకోవటం అంటుంటారు. ఇందులో ద్రవ్య చలామణి అధికంగా ఉంటుంది. రెండోది ఆర్థికమాంద్యం దీనికి పూర్తిగా భిన్నం. ఇది ఉన్న ప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు. తద్వారా ద్రవ్య చలామణి ఉండదు. ఉన్నా అతి తక్కువగా ఉంటుంది. అంతటా ద్రవ్య కొరతే. దీంతో వస్తుసేవలు కొనే వారు, వినియోగించుకునేవారు ఉండరు. ఉత్పత్తులు బయటికి వెళ్లక గోడౌన్లలో మూలుగుతూ ఉంటాయి. ఉత్పాదక స్తోమత పాక్షికంగానే వినియోగంలో ఉంటుంది. ఎంత తక్కువకు వస్తుసేవలు లభ్యమైనా ముందుకు వచ్చేవారు ఉండరు. ఇంచు మించుగా ద్రవ్యోల్బణానికి అన్నివిధాలా వ్యతిరేకంగా ఉంటుంది. ఏ సమాజంలోనైనా పరిస్థితుల ప్రభావం సమాజంలోని అందరి పైన ఏదో రూపంలో ఉంటుంది. వీటిని అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. రెండూ ఒకేసారి కలిసి పయనిస్తున్నట్లుగా పలు గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. ఇది అరుదైనది. అవాంఛనీయమైనది. ఈ రెండిరటి అడకత్తెరలో దేశంలోని ప్రజలంతా ఎంతగా నలిగిపోతున్నారనేది అంచనాలకు అందదు.
నాలుగు నెలలుగా దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా టోకు ధరల సూచి పది శాతం పైగా, వినిమయ ధరల సూచి 6 శాతం పైగా ఉండి రిజర్వు బ్యాంకు నిర్దేశిత పరిధిని అధిగమించాయి. అనేకమంది ఉద్యో గాలు, ఉపాధి కోల్పోవడం, నిరుద్యోగం ప్రబలడంతో పాటు డిమాండ్‌ కొరత ఎంతగానో ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడిరది. నేటి దుస్థితి అధికార గణాంకాలను అనుమానించేలా చేస్తోంది. సాధారణంగా గణాంకాలు అనేవి గడచిన సంవత్సరంలో అదే కాలంతో పోల్చి చెబుతారు, చూపిస్తారు. 2020 ఏప్రిల్‌, మే నెలల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఎలాంటి గణాంకాలు సేకరించలేదు. జూన్‌, జులైలో లాక్‌డౌన్‌ తొల గించినా మామూలు స్థితికి రాలేదు. అలాంటప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌-జులై నెలలను గత ఏడాదితో పోల్చడానికి లేదు. అందువలన ఈ ద్రవ్యోల్బణం అంకెలూ వాస్తవాలు ప్రతిబింబించడం లేదనేది స్పష్టం.
ద్రవ్యోల్బణం అనేక వస్తుసేవల సామూహిక సూచికలు కలగలిపిన సగటు. టోకు వ్యాపార సూచి ఉత్పత్తి ఆధారంగా ఉంటుంది. అదే వినిమయ ధరల సూచి దీనికి భిన్నంగా వినిమయంపై ఆధారపడి ఉంటుంది. అది అందరి విషయంలో ఒకేలా ఉండదు. అది పేద, మధ్య, ఉన్నత వర్గాల వారి ఆర్థిక స్తోమతలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది. అన్నీ కలిపి సగటు చేస్తారు. వాస్తవ ప్రాతిపదికపై వీటిని పునఃపరిశీలించాలి.
2020లో లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రజల నిత్యావసరాల విని యోగం జరిగింది. రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం వినిమయ విశ్వాసం 2020 జనవరిలో 105 నుండి 2021 జనవరిలో 55.5కి పడిపోయింది. అనధికారిక లెక్కల ప్రకారం ఆర్థిక అభివృద్ధి మొదలైనా వినిమయ విశ్వాసం దిగజారింది. ఉద్యోగ ఉపాధి కొరతలతో ఆదాయాలు తగ్గిపోయాయి. ఒక నివేదిక ప్రకారం దాదాపు 230 మిలి యన్లు మంది దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. దీని ప్రకారం అన్ని రకాల వినిమయదారుల్లోనూ గణనీయంగా మార్పులు వచ్చాయి. ఉద్యోగం, ఉపాధి లేని వారు, వాటిని కోల్పోయిన వారు వినిమయం తగ్గించుకోక తప్పని దారుణ పరిస్థితి. ఈ నేపథ్యంలో వినిమయ ధరల సూచి కారణంగా ఏర్పడిరది అంటున్న ద్రవ్యోల్బ ణాన్ని తిరిగి సమీక్షించాలి. ఇది జరగలేదు. ‘పులి మీద పుట్రలా’ కొవిడ్‌ రెండో దశ వల్ల పరిస్థితి మరింత దిగజారింది. వినిమయ విశ్వాసం ఈ ఏడాది జులైకి 48.6 కి తగ్గింది. ఈ వివరాలు మన ద్రవ్యోల్బణం అంకెల బండారం బయట పెడుతున్నాయి.
ద్రవ్యోల్బణం ప్రతి వినిమయదారుని జేబు మీద ప్రభావం చూపుతుంది. మచ్చుకి అది 15 శాతం అయితే గత సంవత్సరం కన్నా అదనంగా 15 శాతం అదే వస్తు సేవలు పొందడానికి చెల్లించాలి. అదే రీతిలో అతని ఆదాయం 15 శాతం పెరిగితే ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ అది అంత కన్నా తగ్గితే అతని పరిస్థితి అగమ్యగోచరం. అది మధ్యతరగతి వారి అత్యవసర వినిమయం పైనా, పొదుపు పైనా తీవ్రంగా ప్రభావం చూపి తగ్గించేస్తుంది. సామాన్యుల కుటుంబాలన్నీ దీన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతాయి. పేదవారు పొదుపు మాటనే మరవాలి. అత్యవసరాలని కూడా తగ్గించుకోక తప్పని దయనీయ పరిస్థితి.
మనదేశంలో 94 శాతం అసంఘటిత రంగంలో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. నిత్యం పెరిగే ధరలతో వారంతా అరకొరగానే అతి కష్టంతో బతుకీడుస్తు న్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగినా వారి వేతనాలు పెరగవు. పైగా లాక్‌డౌన్‌ కారణంగా సంఘటిత, అసంఘటిత రెండు రంగాల్లోనూ వేతనాలు పడిపోయాయి. ఇది వారి కుటుంబం మొత్తాన్ని ఏదో రూపంలో నిత్యం వేధిస్తూనే ఉంటుంది. వీటన్నింటి పర్యవసానంగా అత్యవసరాలకే గాక ఇతరత్రా అన్నింటికీ డిమాండ్‌ కొరవడిరది. ఈ వలయంలో ఆర్థిక పునరుజ్జీవనం కుంటుపడిరది. అలాగే ఉపాధి కల్పన అవకాశాలు కూడా. అంతిమంగా ప్రభుత్వ ఆదాయం పైన ప్రభావం చూపుతుంది. అది బడ్జెట్‌ లోటుకు దారి తీస్తుంది. దీంతో మరల ప్రభుత్వ వ్యయంపై కోత పడుతుంది. అందులో ఎల్లప్పుడూ ముందుండేది సామాజిక విభాగానికి సంబంధించినవి. అది మరలా పేదరికాన్ని పెంచి వినిమయాన్ని తగ్గిస్తుంది. కొను గోలు శక్తి లేనందున ఉత్పత్తులకు డిమాండ్‌ వుండదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నంలో ఇంధనంపై పన్నులు విపరీతంగా పెంచాయి. ఈ పెంపుదల ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది. అందునా ఇది పరోక్ష పన్ను అవటంతో అపారంగా అంచనాలకంద నంతగా పేదలపై భారం మోపుతుంది. దీన్ని నియంత్రించడం రిజర్వుబ్యాంకుకు కష్టసాధ్యం. ప్రభుత్వం 2020-2021లో ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. అందులో దాదాపు సగం పన్నుల ద్వారానే. ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోలేకనే దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాలేదు, తీసుకురారు. వస్తే అక్కడ గరిష్ఠ పన్ను 28 శాతం మాత్రమే. పన్నుల పట్టకారుతో సామాన్యుల పీకలు నొక్కేస్తున్నారు. ప్రపంచమంతా ఇంధన ధరలు కిందకు పోతుంటే మనవి పైపైకి పోవటం సంబంధిత బాధ్యత గలవారి సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజల పాలిట శాపం. అసమర్థతల్ని పంచడంలో పోటీపడడం శోచనీయం.
వ్యాస రచయిత రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img