Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అదానీ సినిమాలో రైల్వే పోర్టర్‌ సంచలనం !!

ఎం. కోటేశ్వరరావు

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోదీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు. అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా సొంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడిరచింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోదీ, బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడిరటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోదీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వికీపీడియా వెల్లడిరచిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి. వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలంగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోదీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడిరచిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, సొంత పార్లమెంటుకు నరేంద్రమోదీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు. హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోదీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. వారంనాడు ఆ మొత్తం రు. 12 లక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే వారం క్రితం తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.
ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో రైల్వే పోర్టర్‌గా పనిచేసిన జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని అన్నాడు. నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ`మోదీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.‘‘మోదీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు. వారిది విడదీయలేని బంధం. వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేకమేడల్లా కుప్పకూలాయి. మోదీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి. ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోదీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది. నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా’’ సోరస్‌ అన్నాడు.
ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తి కలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోదీ ప్రజాస్వామికవాది కాదన్నాడు. భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతిఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోదీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండిరచాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోదీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండిరచాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.
భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతిఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోదీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా? కేంద్ర సమాచార, ప్రసారశాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిం దన్నారు. వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువు లుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోదీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు. రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img