Friday, April 19, 2024
Friday, April 19, 2024

అధిక ఉష్ణోగ్రతలతో ఆహార భద్రతకు ముప్పు

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడం వాతావరణ శాస్త్రజ్ఞులకు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికే దేశంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌కు చేరడం పెరుగుతున్న భూ తాపాన్ని తెలియ జేస్తోంది. ఈ పరిణామం ఆహార భద్రతపై మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలపై ప్రభావం చూపనుంది. ఈ సంవత్సరం వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ఆందోళన వెలిబుచ్చింది. ఈ ప్రభావం తాగునీరు, విద్యుత్‌ సంక్షోభానికి దారితీయవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఆరోగ్యసేవలను ప్రభావితం చేస్తుంది. ఇది యావత్తు దేశానికి ఆందోళన కలిగించే విషయం. 2022లో భారతదేశ గరిష్ఠ ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది సగటు కంటే 1.86 డిగ్రీలు అధికం. తాజా పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, రైతులకు సలహాలు ఇవ్వడం తాత్కాలిక చర్య మాత్రమే. అయితే భూతాపం పెరంగడం ద్వారా సంభవించే విపత్తును నివారించడానికి, సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి దేశానికి సమగ్ర విధానం, వ్యూహం అవసరం. ఖరీఫ్‌ పంటలకు- ముఖ్యంగా గోదుమలు, ఆవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు ఆందోళన వెలిబుచ్చారు. గత మార్చిలో వేడిగాలుల ప్రభావం కారణంగా గోదుమల ఉత్పత్తి క్షీణించింది. దీంతో మేలో గోదుమ ఎగుమతులను నిలిపేయాల్సి వచ్చింది. గత సంవత్సరం లోటును భర్తీ చేయడానికి, మైక్రో ఇరిగేషన్‌ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం రైతులకు సలహాలు జారీచేసింది. గత సంవత్సరం నమోదైన నష్టం ఆహారధరల పెరుగుదలకు కారణమైంది. ఇది పేదలపై మరింత ప్రభావం చూపింది.
అత్యధికంగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు గోదుమ సాగుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పుష్పించే కాలం, పక్వానికి వచ్చే కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల దిగుబడిని కోల్పోయే ప్రమాదం ఉంది. పంటలు, తోటల పెంపకంపై కూడా ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ‘‘నేలలో తేమను కాపాడేందుకు, ఉష్ణోగ్రత సమతుల్యతకోసం రెండు వరుసల కూరగాయల పంటల మధ్య ఖాళీలో మరో పంటవేయాలని భారత వాతావరణ విభాగం సూచించింది. అయితే పేద రైతులకు అంత స్థోమత లేదని ప్రభుత్వం గమనించవలసిన విషయం. పెరుగుతున్న భూతాపం డిసెంబర్‌-జనవరిలో విత్తిన గోధుమ పంటపై 5-10 శాతం, ఆవాల పంటపై 4-6 శాతం ప్రభావం చూపుతాయని, ఆలస్యంగా విత్తిన పంటలు 40శాతం వరకు తీవ్రంగా నష్టపోయే అవకాశంఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో మనదేశం ప్రధానమైంది. తీవ్రమైన ఉష్ణోగ్రత, వేడిగాలులు మానవ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా పర్యావరణం, వ్యవసాయం, నీరు, ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై కూడా ప్రభావం చూపుతాయి. వాతావరణ మార్పులతో దేశంలో ప్రతికూల ప్రభావాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ బహుళ-ప్రమాద ప్రణాళిక అవసరాన్ని నొక్కిచెప్పింది. గత సంవత్సరం ఏప్రిల్‌-మేలో దేశంలో తీవ్రమైన వేడిగాలుల పరిస్థితులు నెలకొనడంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. కొద్దిరోజులకే వాయవ్య భారతంలో నెలకొన్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుందని, మే మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో 60 డిగ్రీలను దాటే అవకాశం ఉన్నట్లు ఉపగ్రహాల ద్వారా తెలిసింది. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోడానికి ప్రభుత్వం ఎటువంటి సమగ్ర వ్యూహాన్ని రూపొందించలేదు.
గతంలో కన్నా ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులుంటా యన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలను నిజం చేస్తూ దేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఈ ఫిబ్రవరిలోనే వేడిగాలులు ప్రారంభమయ్యాయి. దక్షిణాసియాలో వేడిగాలులు, తేమతో కూడిన వేడి ఈ శతాబ్దంలోనే లేనంత అధికంగా ఉంటుందని వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ తన 6వ అంచనా నివేదికలో పేర్కొంది. 1951-2015 మధ్య కాలంలో దేశంలో వేడి తీవ్రత పెరిగిందని కేంద్ర భూగర్భ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ గత సంవత్సరం ఒక పత్రాన్ని విడుదల చేసింది. గడచిన 30 ఏళ్ల (1986`2015)నుంచి పగలు, రాత్రి అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిణామాల ప్రభావం ఇరవై ఒకటవ శతాబ్దంలో వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేయబడిరది.
దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుందని గత ఏడాది ప్రపంచ వాతావరణ శాఖ, బ్రిటన్‌ వాతావారణ కార్యాలయం హెచ్చరించాయి. 2022-2026 కాలం అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని పేర్కొంది. ఇది భారత్‌, పాకిస్తాన్‌లకు తీవ్ర ఆందోళన కలిగించింది. అమెరికా ఆధారిత ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2022 గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ నివేదిక కూడా దక్షిణాసియా వాతావరణ మార్పుల ప్రధాన కేంద్రం అని హెచ్చరించింది. 2100 నాటికి భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత 2.4 నుంచి 4.4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతుందని పేర్కొంది. ఆ సమయానికి వేసవి వేడి మూడు రెట్లు లేదా నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ భూమి ఉత్పాదకత తగ్గుతోందని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల ఉపశమనానికి దోహదపడే కీలక కార్యక్రమాలను తీసుకోవడంలో దక్షిణాసియా దేశాలన్నీ వెనుకబడి ఉన్నాయని నివేదిక నొక్కి చెప్పింది. ఈ ప్రాంతాల భవిష్యత్తు దృక్పథం అస్పష్టంగా ఉందని నివేదిక హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img