Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అప్పర్‌ భద్రకు నిధులు పోలవరంకు మొండిచేయి

వి. శంకరయ్య

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వ్యాపించిన బుందేల్‌ ఖండ్‌ ప్రాంతం(విభజన చట్టంలో దానికి అమలు జరిపే ప్యాకేజీ ఇస్తామన్నారు) సస్యశ్యామలం కోసం అమలు జరుగుతున్న కెన్‌-బెత్వా నదుల అను సంధాన పథకం ఇప్పటివరకు పోలవరంతో పోల్చుకొని అంగలార్చే వారం. తాజాగా అప్పర్‌ భద్ర కూడా చేరింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బిజెపికి రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికికూడా భిక్షం పెట్టడని మరోసారి రుజువైంది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 90 మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమైంది. ఇదే సెక్షన్‌లో ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం కేంద్రం పూర్తిగా భరించాలని పొందుపర్చారు. అంతేకాదు. నష్ట పరిహారం, పునరావాసానికి అయ్యే వ్యయం కేంద్రం భరించాలని, పైగా పర్యావరణ, అటవీ తదితర అనుమతులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని నిర్దిష్టంగా పేర్కొన్నారు. కాని ఏం జరిగిందీ ప్రత్యేకించి చెప్పే పనిలేదు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని కొన్నాళ్లు గడిపి తుదకు ఎగ్గొట్టినట్లు పోలవరం ప్రాజెక్టులో తాగునీటి వ్యయం తాము భరించబోమని తొలి కొర్రీ వేసింది. తుదకు 2017 లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని చెప్పి 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్లు మేరకే భరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ అంటోంది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని కేంద్ర మంత్రి వర్గం సవరించవచ్చా? అధికార ధిక్కరణే కదా? తుదకు రెండవ డిపిఆర్‌ ఇంత వరకు ఆమోదించలేదు. ఇప్పుడు తాజా బడ్జెట్‌లో పోలవరం ఊసేలేదు.
కాని పక్కనే వున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన అప్పర్‌ భద్ర ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్‌లో 5,300 కోట్లు రూపాయలు కేటాయించారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వం వున్నందున తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి 2022 లోనే అప్పర్‌ భద్రను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. రెండు విధాలుగా గోడదెబ్బ చెంపదెబ్బ వెనుకబడిన రాయలసీమకు తప్పడంలేదు. 29.9 టియంసిలతో తుంగభద్ర ఎగువ భాగంలో ఎత్తిపోతలు పెడితే దిగువ రాష్ట్రమైన రాయలసీమకు మున్ముందు నీటి ఎద్దడి తప్పదు. 194 టియంసిల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయం పూడిపోయిందని ఏపీ వాటాలో కోత పెడుతున్నారు. మున్ముందు నీటి ప్రవాహంలేదని మరింత కోతపెట్టే ప్రమాదం వుంది. కాగా ఎగువ, దిగువ కాల్వలు కర్నాటక భూభాగంలోకి కొంతమేర వస్తున్నందున కర్నాటక రైతుల జలచౌర్యం తప్పడంలేదు. 2022లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినపుడు బడ్జెట్‌లో భారీగా నిధులుఇచ్చి పోలవరం తోకకోసినా ఏపీి ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి నిరసన తెలపలేకపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. కర్నాటకలో ఎన్నికలు ముంచుకొస్తు న్నందున ఈ పథకం త్వరితగతిన నిర్మాణం జరిగే అవకాశంఉంది. తుంగభద్ర జలాశయం ఎగువభాగంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నందున డిపిఆర్‌ సామర్థ్యానికి మించి నీళ్లు ఎత్తిపోసుకున్నా అజమాయిషీచేసే యంత్రాంగంలేదు. తుంగభద్ర బోర్డుకు దానిపై అధికారంలేదు. ఫలితంగా రాయలసీమకు మున్ముందు తుంగభద్ర నుండి వచ్చే నీళ్లకు భారీగా గండి పడబోతోంది.
కొసమెరుపు ఏమంటే అప్పర్‌ భద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే సమయంలో జరిగిన నీటి కేటాయింపులు బిజెపియేతర రాష్ట్రాలకు సాధ్యంకాదు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కర్నాటకకు కేటాయించిన నీటివాటా నుంచి 2002లో కర్నాటక ప్రభుత్వం రూపొందించిన మాష్టర్‌ప్లాన్‌లో అప్పర్‌ భద్రకు 21.5 టియంసిలు కేటాయించారు. కాగా తుంగభద్ర వేదవతి సబ్‌ బేసిన్‌లో బచావత్‌ ట్రిబ్యునల్‌ చిన్న నీటివనరులకు కేటాయించిన నీటి నుండి 6 టియంసిలు చూపెట్టారు. అప్పటికీ డిపిఆర్‌ మేరకు నీటి సామర్థ్యం తగ్గినందున పోలవరం ప్రాజెక్టు నీళ్లు కృష్ణలో కలిస్తే ఎగువ రాష్ట్రాలకు చెందవలసిన 45 టియంసిల్లో కర్నాటక వాటా నుండి 2.4 టియంసిలు కలిపి మొత్తం 29.9 టియంసిలుగా కర్నాటక ప్రభుత్వం చూపెడితే కేంద్రప్రభుత్వం గుడ్డిగా వెంటనే ఆమోదించి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అందుకేనేమో తెలంగాణ కూడా ముందుజాగ్రత్తగా బచావత్‌ ట్రిబ్యునల్‌ తనకు కేటాయించిన చిన్న నీటి వనరుల నుండి పాలమూరు రంగారెడ్డి పథకానికి నికర జలాలను కేటాయించింది.
తొలుత అప్పర్‌ భద్ర ఎత్తిపోతల పథకం నిర్మాణవ్యయం 16,125.48 కోట్లు కాగా, కర్నాటక ప్రభుత్వం అప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయం చేసినందున మిగిలిన 12 వేల కోట్లు కేంద్రప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. అయితే 2018-19 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం, 21,473.67 కోట్ల రూపాయలకు కర్నాటక ప్రభుత్వం అంచనాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాబడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినందున సవరించిన అంచనాలను ఆమోదించదేమో? లేకుంటే బడ్జెట్‌లో 5,300 కోట్ల రూపాయల కేటాయింపులు చేయదు కదా? మరోవేపు చట్టబద్దతగల పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. సవరించిన అంచనా ఆమోదించలేదు.
సెల్‌: 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img