Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అయితే మా కేంటి

ఎర్రజెండా చేతబట్టరా తీరునులే మన కష్టాలు ఎత్తర సోదరా మరల ఎర్రజెండా. రా బావ ఏమిటి ఎర్రజెండా ఎత్తమని పాడుతున్నావు. ఏం లేదు బావ ఈ మధ్య మేడే వేడుకలు జరిగాయి కదా నేను కూడా వెళ్లాను జరిగి నాల్గురోజులైనా నేను విన్నపాట మాత్రం మరువలేకున్నాను. నిజమే ఆనాడు ఆ పోరాటం వలెనే ఎనిమిది గంటల పదినినాలు మొదలైనవి. అంతకు ముందు రాత్రి, పగలు పనిచేయించుకునేవారు. ఆ పోరాటం కార్మికులకు స్పూర్తి. ప్రస్తుతం నిర్లిప్తత, నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. అందుకే ప్రముఖ కమ్యూనిస్టు ఆంటోనియా గ్రాంసీ నిర్లిప్తత అంటే తనకు నిలువెల్లా అసహ్యం అని ఏనాడో అన్నాడు. కాని ప్రస్తుతం నిర్లిప్తంగా ఉండేవారు ఎక్కువయ్యారు. ఇలాంటి నిర్లిప్తులు, నిరాశావాదులు, నాకేంటి అనే వారి వల్ల సమాజం సర్వనాశనమవుతోంది. పోరాటం పలుచబడి ఏమీ సాధించలేక కొంతమంది ఆశావాదులు ప్రాణాలర్పిస్తున్నారు.
నిజమే బావ కొంతమంది అందరికోసం జరిగే పోరాటంలో పాల్గొనకుండా మాకేంటి అని స్వార్థంతో, నిర్లిప్తతో, నిరాశావాదంతో ఇంటికి పరిమితమవుతున్నారు. ఇది నిజంగా క్షమించరాని నేరం. వారి వల్ల అనుకున్నది సాధించలేకపోవడంతో వచ్చే నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. పోరాటం వల్ల కలిగే లాభనష్టాలు సమాజంలోని ప్రజలందరిది. కాని కొద్ది మంది మాత్రమే పోరాటానికి ముందుకు దూకడం వల్ల అనుకున్నది సాధించలేక పోతున్నారు. నిజమే దాని వల్ల స్వార్థ పరులు అందలమెక్కి ప్రజలను ఒప్పించడం ద్వారా కాక అణచివేసి పాలన సాగిస్తున్న సంగతి చూస్తున్నారు. సమాజంలో జరిగే ప్రతి పరిణామం తెలివైన పౌరుల, చైతన్యవంతమైన కార్యాచరణ ఫలితంగానే జరుగుతుంది. కొంతమంది త్యాగాల వల్లనే సమాజంలో మార్పు వస్తుంది. ఎక్కువమంది ఎవరో తెచ్చిపెట్టిన ఫలాలు స్వీకరించడానికి అలవాటుపడి ఇతరులపై ఆధారపడి జీవనం సాగించడానికి అలవాటు పడ్డారు. ఎక్కువమంది నిర్లిప్తతతో మాకెందుకులే వస్తే అందరికి వస్తాయి అనే పదం వెల్ల వేస్తారు. అందుకే అటు, ఇటు నిలబడలేక అటువంటి పిరికి పందలు, స్వార్థపరులంటే తనకు పరమ అసహ్యమని గ్రాంసి అంటారు.
మానవ సమూహమే సమాజం. సమాజంతో సంబంధంలేకుండా మనిషి మనలేడు. కాని ప్రస్తుతం కొంతమంది సమాజంతో నాకు పనేంటి అంటారు. ఇంకా కుల, మత, వర్గరహిత సమాజంకోసం శ్రమించేవారు వారి పరిధిలో వారు క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నారు. వారి శ్రమ ఫలిస్తే మంచిదేకాని చేయమనండి ఏం జరుగుతుందో చూద్దాం అనే వారెక్కువయ్యారు. అందుకు జరిగే పోరాటం మంచిదేకాని నాకు తీరిక లేదనే నిర్లిప్తవాదులు ఎక్కువయ్యారు. గతంలో ఇలా ఆలోచిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చేదికాదు. ఇటుంటి నిరాశవాదులు అనాడు ఆంగ్లేయుల నుండి విభజించి పాలించమనే సూత్రం మాత్రం వంటపట్టించుకొన్న పాలకులు ఎక్కువయ్యారు. సమాజంలో జరిగే ప్రతి నిర్ణయం సమాజంలోని ప్రతి పౌరునిమీద పడుతుందనే సంగతి మరచి ప్రవర్తిస్తున్నారు. కర్తవ్య బోధకులు కూడా తమ కర్తవ్యం పాటించరు. నిజమే బావ ప్రతిసంవత్సరం మే ఒకటిన అలవాటు ప్రకారం ఎర్రజెండా ఎగరవేయడమే కాని ఆనాటి త్యాగ ధనుల స్పూర్తి మాత్రం మరచిపోయారు.
ప్రస్తుతం ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరి క్రియాశీలకంగా ప్రతి వ్యక్తి పనిచేయాలి కాని 5 కోట్ల జనాభాలో ఉన్న అన్ని పార్టీలలో సభ్యత్వం ఉన్నవారు కోటిమంది కూడా ఉండరు. అంటే ఎవరో సాధించిపెట్టిన ఫలాలు అందరికీ లభ్యం అవుతాయికదా అని నిర్లిప్తతతో వ్యవహరించేవారే ఎక్కువ. అంటే ఎవరో సాధించిపెడితే వారి మీద ఆధారపడేవారే ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా ఉన్నారు. అలా ఉన్నవార్ని పాలక పార్టీలు తమ ఖాతాలో వేసుకుని నియంతృత్వపాలన సాగిస్తున్నారు. అందుకే గ్రాంసి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సిద్ధాంతంతో పనిచేసే పార్టీలో చేరాలి కానీ తటస్థంగా నిర్లిప్తతతో జీవనం సాగించడం ఆయనకు నచ్చదు. అటువంటి వ్యక్తులంటే ఆయనకు పరమ అసహ్యం. 86 సంవత్సరాల క్రితం గ్రాంసీ చనిపోయినా, ఆయన ఆలోచన ఇప్పటికీ ఆచరణీయమే. అయితే నాకేంటి అనే భావనకు స్వస్తి పలికి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సిద్ధాంతంతో ముందుకు సాగాలి.
వ్యాస రచయిత సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img