Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అరచేతిలో స్వర్గం అనర్ధాలకు నిలయం

టెక్నాలజీ మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్లు విస్తృతంగా వినియోగం లోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ దుర్వినియోగం కూడా పెరిగింది. కంప్యూటర్లను వాడే వారు కూడా అరచేతిలో ఇమిడిపోయే మొబైల్‌ ఫోన్లకే అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. పెరిగిన ఇంటర్నెట్‌ వేగం కూడా సాంకేతిక పరిజ్ఞానం విరివిగా వాడడానికి దోహదం చేస్తున్నది. ప్రపంచంలో ఎలాంటి ఆవిష్కరణలు జరిగినా అవి ఇప్పటివరకూ మానవజీవితం సౌకర్యవంతం కావడానికి ఉపయోగపడ్డాయి. ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ పరికరాలు జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చి, జనజీవన విధానంలో ఒక భాగమై, పనిచేసే విధానంలో అనేక మార్పులు తెచ్చాయి. వైజ్ఞానిక శాస్త్ర ఫలితాలు మానవ ఆరోగ్యంపై కూడా విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. వ్యాధుల నివారణ కోసం మాత్రమే కాకుండా, నూతన వ్యాధుల పుట్టుకకు కూడా అధునాతన పరికరాలు దోహదం చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే మైబైల్‌ ఫోన్ల వినియోగం మరొక ఎత్తు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే మనకు తెలిసేపోయే విధంగా అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొబైల్‌ వినియోగం ఎంతగా వ్యాప్తిచెంది, ప్రపంచాన్ని మన కళ్ళెదుట నిలబెట్టిందో, అదే నిష్పత్తిలో మానవ సంబంధాలను, విలువలను విధ్వంసంచేసింది. టెక్నాలజీ దుర్వినియోగం వలన మానవజీవితం అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి చేరింది. సోషల్‌ మీడియాపై నియంత్రణ లేకుండా పోయింది. నాలుగుగోడల మధ్య జీవితం నడిరోడ్డుకు చేరింది. విలువల విధ్వంసానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం బీజాలు వేసింది. చరవాణి మానవ జీవితాలను చిందరవందర చేసింది. జీవితమంటే సరదాగా గడిపే క్రీడలా తయారైనది. చదువుకున్న వారు, చదువుకోలేని వారు కూడా సోషల్‌ మీడియాకు బానిసలుగా మారిపోయారు. అసభ్యమైన కంటెంట్‌ కోసం అర్రులుచాసే యువతరం బయలుదేరి సాంఘిక మాధ్యమాలకు ప్రభావితమై, అనేక అరాచకాలకు ఒడిగడుతున్న మాట వాస్తవం. అడ్డదిడ్డమైన అడల్ట్‌ కంటెంట్‌ అడ్డదారుల్లో తొక్కి, విలువల పతనానికి ప్రేరేపిస్తున్నది.
మంచిని పెంపొందించే వీడియోలకు ఆదరణ కరువైనది. జుగుప్సా కరమైన దృశ్యాలు అత్యంత వేగంగా ప్రజాదరణ పొందడాన్ని చూస్తుంటే చెడుపై ఆకర్షణ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. సమాజం పెడదారిన పడుతున్నది. యువతతో పాటు, చిన్న పిల్లలు కూడా సాంఘిక మాధ్యమాల ప్రభావంతో చెడిపోతున్నారు. తెలిసీ, తెలియని బాల్యదశలోనే తప్పటడుగులు పడుతున్నాయి. అసాంఘిక చర్యలకు ఆలవాలంగా మారుతున్న సాంఘిక మాధ్యమాలను నియంత్రించడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైనది. వీక్షకుల విచక్షణకే వదిలేసిన చాలా రకాల అసభ్యకరమైన సైట్లు మానవ విలువలను ధ్వంసంచేసి, జంతుప్రవృత్తిని అలవాటు చేస్తున్నాయి. ప్రపంచాన్ని ఏదో ఉద్దరిస్తున్నట్టుగా సాగుతున్న దరిద్రమైనభావజాలం మానవ సమాజం లోకి ప్రవేశించింది. ఫ్రాంక్‌ వీడియోల ప్రహసనం విశృంఖలంగా కొనసాగు తున్నది. ఇందులో ద్వందార్ధ సంభాషణలతో కూడిన అశ్లీలత యువతను పాడుచేస్తున్నది. ప్రేక్షకుల సంఖ్య పెంచుకోవడానికి నగ్నత్వాన్ని జన బాహుళ్యం లోకి విచ్చలవిడిగా వదులుతున్నారు. మరికొంత మంది రీల్స్‌ పేరుతో, పేరడీలపేరుతో గారడీలు చేస్తున్నారు. చివరికి తమ ఇంటివిషయా లను, నట్టింట జరిగే కార్యకలాపాలను సైతం సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తమ గొప్ప తనాన్ని చాటిచెప్పడానికి తమ ఇంట్లో ప్రతి అంగుళాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయంచేస్తూ మోసగాళ్ళకు ఆస్కారం కల్పిస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ పుణ్యమా అని కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సైబర్‌నేరగాళ్ళ చేతికిచిక్కింది. దేశవ్యాప్తంగా ఇటీవల సుమారు 67 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా చోరీ జరిగినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల అంచనా. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2 కోట్లమంది, తెలంగాణాకు చెందిన 50 లక్షల మంది వ్యక్తిగత సమాచారం దొంగిలిం చారని చెబుతున్నారు. కోట్లాది మంది ప్రజల గోప్యత అమ్మకానికి పెట్టడం అత్యంతదారుణం. వ్యక్తుల ఈ మెయిల్‌, ఫోన్‌నెంబర్లను, వారి కార్యకలాపా లను, ఆధార్‌ నెంబర్లను, పాన్‌కార్డు వివరాలను, బ్యాంకుఎక్కౌంట్లను సేకరించి, అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తున్నది. కేంద్రప్రభుత్వంకూడా దీనిపైస్పందించి మొబైల్‌, కంప్యూటర్లు వినియోగిన్తున్నవారు మాల్వేర్‌, బోట్నెట్‌ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా యాంటీ వైరస్‌ను ఏక్టివేట్‌ చేసుకోవాలని ఇటీవల మొబైల్‌ సందేశాలు పంపించింది. ఏదిఏమైనా మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం పెద్ద తప్పిదం. ఆధార్‌, పాన్‌కార్డువంటి వివరాలను, బ్యాంకు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి.
– సుంకవల్లి సత్తిరాజు, మొ:9704903463

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img