Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆకలి కేకల్లో మనది ప్రథమస్థానం!

ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన భారత దేశం రెండవ స్థానంలో ఉండడం ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, పోషకాహారలోప సూచీల్లో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యంతో పాటు విచారాన్ని కలిగిస్తున్న అంశం. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేణా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కేకలు కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గత అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10శాతం పోషకాహారలోపంతో, 30శాతం జనాభాకు కనీస ఆహారం దొరక్కపోవడం గమనార్హం. కరోనా వైరస్‌ విజృంభణతో అదనంగా మరో 11.8 కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు.
2022-23లో 326 మిలియన్‌ టన్నులు, 2021-22లో 316 మిలియన్‌ టన్నులు రికార్డుస్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. (2020-21లో 311 మిలియన్‌ టన్నులు, 2019-20లో 298 మిలియన్‌ టన్నులు, 2018-19లో 285 మిలియన్‌ టన్నులు) భారత దేశం ఆహారధాన్యాలలో స్వయం సమృద్ధి స్థాయికి చేరినా, పోషకా హారలోపం 2018లో 13.8 శాతం ఉండగా 2020లో 15.3 శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికమై, మిగులు స్థాయికి చేరినప్పటికీ నిరుద్యోగం, పేదరికంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహార లోపం, ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో దాదాపు 14శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహారలోపంతో, 20శాతం 5ఏళ్ల్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35శాతం పిల్లలు గిడసన బారిన ఎదుగుదలతో, 52శాతం 15-49 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతమవుతున్నారు.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌-2023 వివరాల ప్రకారం, 121 దేశాల్లో నమోదైన ఆకలి సూచికలో భారతదేశ స్థానం అట్టడుగున 107వ స్థానంలో ఉండడం విస్మయాన్ని, విచారాన్ని కలిగిస్తున్నది. 2020లో ఇండియా స్థానం 94 ఉండగా, 2021లో 101 వరకు మరింత దిగజారడం గమనార్హం. 2022 వివరాల ప్రకారం దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాలైన శ్రీలంక (64), బంగ్లాదేశ్‌ (84), నేపాల్‌ (81), పాకిస్థాన్‌ (99) ఆకలి సూచికల స్థానాలతో పోల్చితే భారత్‌ మరింతగా వెనుకబడి ఉండడం విచారకరం. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ(ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, యఫ్‌ఏఓ) నిర్వచనం ప్రకారం, ఆకలి సూచికలను గణించడానికి పోషకాహార లోపం, ఎత్తు కంటే తక్కువ బరువు ఉండడం, వయసు కన్న తక్కువ ఎత్తు ఉండడం, పిల్లల మరణాల రేటు అనే నాలుగు అంశాలు పరిగణలోకి తీసుకొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమం 1975లో భారత్‌ సమగ్ర బాలల అభివృద్ధి సేవలను ప్రారంభించింది. భారత ప్రభుత్వం చేపట్టిన పోషన్‌ అభియాన్‌, ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలు, పిల్లలు గిడసబారడం, రక్తహీనత, తక్కువబరువుగల శిశు జననాలను తగ్గించ డానికి ఉద్దేశించినది. ఆహార భద్రత పథకంలో భాగంగా గర్భిణులు, పిల్లల తల్లులు, బాలలకు పోషకాహారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. పేదల కనీస అవసరాలు తీర్చడానికి ఆయుష్మాన్‌ భారత్‌, అంత్యోదయ, పీఎం కిసాన్‌, స్వచ్ఛ భారత్‌, ఉజ్వల, 100 రోజుల పనికి ఆహారపథకం లాంటివి కూడా ప్రజారోగ్య కల్పనకు దోహద పడుతున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, మిగులు నిల్వలు ఉన్నాయని సగర్వంగా చెప్పుకున్నప్పటికీ, పేదల కడుపుల్లో ఆకలి కేకలు వినపడడం ఆవేదనని కలిగిస్తున్నది. ఆహార నిల్వలు గోదాముల్లో పందికొక్కుల పాలు కావడంతో పాటు మురికి వాడల్లో/గ్రామీణ నిరుపేదల కుటుంబాలకడుపుల్లో ఎలుకలు పరుగెడు తున్నాయి. మన దేశం స్థూలకాయం ఓ వైపున, బక్కచిక్కిన అస్థిపంజర అభాగ్య పేదలు మరోవైపు పెద్ద సమస్యగా నిలుస్తున్నారు.
ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచడానికి ఉద్యోగ ఉపాధుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు, విద్య వసతుల కల్పన, లింగ సమానత్వ చర్యలు, జనాభా నియంత్రణ లాంటివి జరిగినపుడు అసమానతలుతగ్గి అందరికీ పోషకాహారం అందుబాటులోకి వస్తుంది.
డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి, సెల్‌. 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img