Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆఖరి మెట్టెక్కలేని అకీల్‌ ఖురేషీ

న్యాయమూర్తి అకీల్‌ ఖురేషీ మొన్నటి దాకా త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక మీదట ఆయన రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. నలుగురు న్యాయమూర్తులు మాత్రమే ఉన్న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఖురేషీ 50 మంది న్యాయమూర్తులు ఉండడానికి అవకాశం ఉన్నా 35 మంది న్యాయమూర్తులతో పని చేస్తున్న రాజస్థాన్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయ మూర్తి కావడం అంటే పదోన్నతి కిందే లెక్క. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నాయకత్వంలోని కొలీజియం గురువారం (సెప్టెంబర్‌ 17) సమావేశమై 8 హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సూచించింది.
ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏకంగా తొమ్మిది మంది పేర్లు సిఫార్సు చేసింది. అందులో ముగ్గురు మహి ళలు ఉండడం మరీ విశేషం. అంతకన్నా విశేషమూ ఉంది. అదే న్యాయ మూర్తి ఖురేషీ పేరు లేకపోవడం. కొలీజియం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే కారణం. మొన్నటికి మొన్న కొలీజియం సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ ఖురేషీ పేరు సిఫార్సు చేయాల్సిందేనని పట్టుబట్టారు. కొలీజియం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించాలి. కానీ ప్రభుత్వ ఆంతర్యం తెలిసిన మిగతా కొలీజియం సభ్యులు ఖురేషీ పేరు చేర్చడానికి సాహసించలేదు. రెండేళ్లుగా కొలీజియం ఏ న్యాయమూర్తి నియామకానికి సిఫార్సు చేయలేదు. మొన్న చేశారు అనుకుంటే అందులో న్యాయంగా ఉండవలసిన ఖురేషీ పేరు లేదు. నారిమన్‌ ఆగస్టు 12 న ఉద్యోగ విరమణ చేసిన వారం రోజుల్లో కొలీజియం సమావేశమై ఖురేషీ పేరును మినహాయించి తొమ్మిది పేర్లను సిఫార్సు చేసింది.
ఖురేషీకి ఎదురు దెబ్బలు తగలడం ఇది మొదటిసారేం కాదు. 2019లో కొలీజియం ఆయనను మొదట బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఒప్పలేదు. అప్పుడు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. మోదీ ప్రభుత్వం ఆ సిఫార్సునూ తిప్పికొట్టింది. చివరకు త్రిపుర ప్రధానన్యాయమూర్తిగా నియమించారు. అసలు ఖురేషీ గుజరాత్‌ హైకోర్టుకు చెందినవారు. ఆయన ప్రధాన న్యాయమూర్తి కావలసిన సమ యానికి అక్కడి నుంచి బదిలీ చేశారు.
ఖురేషీ కష్టపడి పని చేస్తారని, స్వతంత్రంగా వ్యవహరిస్తారని, ఆయన హేతుబద్ధత, తర్కం బ్రహ్మాండంగా ఉంటాయని ఆయనను గమనించిన వారు చెప్తారు. మరి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎందుకు కాలేదు, ఏలిన వారికి ఎందుకు నచ్చలేదు అన్న అనుమానం రావడం సబబే. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఖురేషీ 2010లో ఒక కీలక తీర్పు ఇచ్చారు. సోహ్రాబుద్ధీన్‌ హత్య కేసులో నిందితుడైన అప్పటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను జైలుకు పంపించారు. 2011లో గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన అధిపతిగా ఉన్న బెంచి మరో కీలక తీర్పు ఇచ్చింది. అప్పటి గుజరాత్‌ గవర్నర్‌ కమలా బేనీవాల్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌.ఎ.మెహతాను లోకాయుక్తగా నియ మించారు. ఆ నియామకాన్ని సవాలు చేసినప్పుడు ఖురేషీ గవర్నర్‌ సిఫా ర్సును సమర్థించారు. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ఇది నచ్చలేదు. ప్రభువులకు నచ్చని ఇన్ని పనులు చేసిన వారికి రావాల్సిన పదవులు ఎలా వస్తాయి!
ఇక్కడ రెండు అంశాలు పరిశీలించాలి. ఒకటి కొలీజియం సభ్యుడైన నారిమన్‌ సూచన ఆయన ఉద్యోగ విరమణతో ముగిసిపోతుందా? భిన్నాభి ప్రాయాన్ని పట్టించుకోనవసరం లేదా? దాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది కదా! అసమ్మతిని కొట్టిపారేయడానికి వీలు లేదని రెండవ జడ్జీల కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పు అటకెక్కినట్టేనా! న్యాయమూర్తుల సీనియారిటీని ప్రత్యేక కారణం ఉంటే తప్ప తోసిపుచ్చడానికి వీలు లేదని కూడా ఇదే తీర్పులో చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఖురేషీ సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ రెండిరటినీ కొలీజియం పట్టించుకున్నట్టు లేదు.
న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసే అధికారం కొలీజియంకు ఉండొచ్చు. ఇప్పుడు ఆ కొలీజియం అధిపతి ప్రధాన న్యాయమూర్తి రమణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలడిగి, పౌరహక్కులకు అనుకూలంగా మాట్లాడి, అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠ పునరుద్ధరించడానికి ప్రయత్ని స్తున్న గట్టి వారనిపించుకుని ఉండవచ్చు. న్యాయమూర్తుల పేర్లు సిఫారసు చేసే అధికారం ఉన్న కొలీజియం ప్రభుత్వం కాదంటే ప్రతిఘటించ లేనప్పుడు అసలు అధికారం ఎవరిది? వినియోగించలేని అధికారం ఉండి ఫలమేమి?

  • అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img