Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆత్మనిర్భరతా నినాదం పచ్చి దగా

డాక్టర్‌ సోము మర్ల

జాతీయ నగదీకరణ పైపులైను కింద ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తిరోగమన చర్య. రోడ్లు 26,700 కి.మీ, రైల్వే స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, రైల్వే ట్రాక్‌లు, 28,608 సి.కె.టి. కి.మీ విద్యుత్‌ లైన్లు, 6 జి.డబ్ల్యు. హైడ్రో, ఎలక్ట్రిక్‌ సోలార్‌ విద్యుత్‌ ఆస్తులు, 2.86 లక్షల కి.మీ ఫైబర్‌ ఆస్తులు, టెలికాం రంగంలోని 14,917 టవర్‌లు, 8,154 కి.మీ. సహజ వాయువు పైపులైన్‌, 3,930 కి.మీ. పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌ లైన్‌ ఇంకా మరికొన్ని నగదీకరణ పైపులైనులు ఉన్నాయి. స్వల్ప పెట్టుబడులతోనే అయినా, చాలా విలువైన ప్రజా ధనంతో, స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దశాబ్దాలుగా ప్రణా ళికా బద్ధ స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థలు నిర్మాణమయ్యాయి. గత వలస పాలకుల, ప్రస్తుత సామ్రాజ్యవాదుల ఆర్థిక దోపిడీకి, నిరంకుశత్వానికి వ్యతి రేకంగా కార్మిక వర్గం నిర్వహించిన సుదీర్ఘ పోరాటాల ఫలితమే ఇది.
ప్రధానమంత్రి ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుతున్నాడంటే, ‘‘స్వదేశీ’’ కి అనుకూలంగానో లేదా ప్రపంచీకరణకు వ్యతిరేకంగానో మాట్లాడు తున్నాడని భ్రమ పడనక్కరలేదు. పైగా స్వదేశీ ఆశ్రిత పెట్టుబడిదార్ల, ప్రత్యేకించి విదేశీ పెట్టుబడి ప్రయోజనాల రక్షణకే నగదీకరణను ప్రయోగిస్తున్నారు. వస్తు తయారీ పరిశ్రమల బలోపేతానికి గానీ, వాగ్దానం చేసిన లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పనకు గానీ, ఆర్థిక పునాది పటిష్టతకు గానీ ప్రధాని భావనలు పరిష్కారాలను చూపటం లేదు. ఆయన ప్రవచించే ‘ఆత్మనిర్భరత’ లేదా ‘స్వావలంబన’ దీని వల్ల సాధ్యం కాదు. స్వాతంత్య్రానంతరం ఏడు పంచవర్ష ప్రణాళికల కాలంలో నెహ్రూ భావనల తరహా స్వావలంబన విధానం అమలు జరిపారు. రెండవ పంచవర్ష ప్రణాళికలో ‘మహాలనోబిస్‌’ మోడల్‌ విధానం ఆచరణలోకి వచ్చింది. ఇక్కడ భారీ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రత్యేకించి వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సామగ్రి తయారీపై కేంద్రీకరించారు. నాటి సోవియట్‌ యూనియన్‌ సహాయంతో మౌలిక రంగంలో భారీ ఉక్కు, చమురు, ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్‌, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్రభుత్వ రంగంలో నిర్మాణమయ్యాయి. భారీ పరిశ్రమలకు ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరి జ్ఞానాన్ని సమకూర్చటానికి దేశం నాలుగు చెరగులా అనేక జాతీయ పరి శోధనా సంస్థలు, ఐఐటీలు స్థాపించారు. స్వాతంత్య్రానంతరం కీలక పరిశ్రమల రంగంలో భారీ పెట్టుబడులు పెట్టగల సామర్థ్యంగానీ, తగిన ముందు చూపు గానీ ప్రైవేట్‌ పెట్టబడిదార్లకు లేదు. చాలాకాలం విరామానంతరం మాత్రమే అది సాధ్యమైంది. బాంబే ప్రణాళిక 1945లో ప్రకటించారు. ఆనాటి ఎనిమిదిమంది ప్రధాన పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరారు. నెహ్రూ తరహా ‘స్వావలంబన’ ఆర్థిక విధానానికి వారు సంపూర్ణ మద్దతు తెలిపారు.
90వ దశకం ప్రారంభంలో, ఐ.ఎం.యఫ్‌., ప్రపంచ బ్యాంకుల తీవ్ర ఒత్తిడి కారణంగా, భారతదేశం నయా ఉదారవాద ఉచ్చులో చేరిపోయింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ శక్తులతో కలిసి క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ ఆర్థిక సంస్థల ఆదేశాలను పాటించటం ద్వారా ‘స్వావలంబన’ అనే భావనే నిరుపయోగంగా మారింది. తక్కువ ధరలకే ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం కొనేందుకు ఎక్కడైనా లభ్యమౌతున్న పరిస్థితుల్లో, స్వదేశీ బండిని తిరిగి దొర్లించటం ఇంకేమాత్రం లాభదాయకం కాదని విశ్వసించారు. 80వ దశకం ప్రారంభానికల్లా, అతి పెద్ద బహుళ జాతి గుత్తసంస్థలు ప్రబలమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోగల్గాయి. ప్రపంచ వ్యాప్తంగా వస్తూత్పత్తిపై అజమాయిషీని ప్రారంభించాయి. నయా ఉదారవాద ఆర్థిక ఎజెండాలో భాగంగా 1991లో ప్రభుత్వ రంగసంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ విధానాల బాట పట్టటం జరిగింది. విధానపరమైన మార్పుకు అది దారితీసింది. అప్పటినుండి ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణ దిశగా ప్రయాణం సాగుతోంది. ప్రభుత్వరంగం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలోనే ‘మార్కెట్‌ ఆర్థికవ్యవస్థ’ కు బీజాలు పడ్డాయి. ప్రభుత్వ రక్షణ, బడ్జెట్‌ సహాయం క్షీణించిన పరిస్థితిలో 21వ శతాబ్ది ప్రారంభం కాగా, 20వ శతాబ్దం నాటి ప్రభుత్వ రంగం ఇప్పుడు మార్కెట్‌ శక్తుల పోటీని, వాటి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. లాభార్జన సామర్థ్యం ప్రాతిపదికన (25,000 కోట్ల రూపాయలు వార్షిక సగటు టర్నోవర్‌, గడిచిన 3 సంవత్సరాలలో 3000 కోట్ల రూపాయల లాభార్జన) 9 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను (బి.హెచ్‌.ఇ.యల్‌., బి.పి.సి.యల్‌., జి.ఎ.ఐ.యల్‌., హెచ్‌.పి.సి.యల్‌., ఐ.ఒ.సి., యం.టి.యన్‌. యల్‌., యన్‌.టి.పి.సి., ఒ.యన్‌.జి.సి., యస్‌.ఎ.ఐ.యల్‌) నవరత్నాలు గానూ, మరో 45 సంస్థలను ‘మినీ నవరత్నాలు’ గాను ప్రభుత్వం గుర్తించింది. వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టు బడులు పెంచుకునేందుకు జాయింట్‌ వెంచర్లుగా మార్చుకునేందుకు వాటిని అనుమతించింది. ఉదారవాద ఆర్థిక ఎజెండాకు అనుగుణంగా, ప్రభుత్వ రంగ సంస్థల నుండి క్రమేణా పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మేయటం, మూసి వేయటం కోసం ‘‘జబ్బుపడ్డ పరిశ్రమల’’ ను గుర్తించేందుకు ‘‘బోర్డ్‌ ఫర్‌ ఇండస్ట్రి యల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రికన్‌స్ట్రక్షన్‌ (బి.ఐ.యఫ్‌.ఆర్‌) అనే సంస్థను ఏర్పాటు చేశారు. వాజ్‌పాయ్‌ నాయకత్వంలోని యన్‌.డి.ఎ ప్రభుత్వ హయాంలో ప్రైవేట ీకరణ, పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ అత్యంత వేగం పుంజు కుంది. అరుణ్‌ శౌరి ఆధ్వర్యంలో ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. ఈ మంత్రిత్వశాఖ 1994`2005 మధ్యలో విదేశీ సంచార నిగం (లి), హిందూస్థాన్‌ జింక్‌, బాల్కో, ఐ.పి.సి.యల్‌., అనేక ఐటిడిసి హోటల్స్‌ ప్రైవేటీకరణ గావించటమేగాక, మారుతి ఆటో మొబైల్స్‌ను అమ్మకానికి పెట్టారు. వ్యూహాత్మక అమ్మకాలు ఆనాటి ప్రభుత్వానికి తెచ్చి పెట్టిన డబ్బు రూ. 6,344 కోట్ల రూపాయలు. నిజానికి తమ ఉనికిని కోల్పోయి, పరాయీకరణకు గురవుతున్న ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు మోదీ రాజకీయాలు ఉద్దేశించాయి. తద్వారా నయా ఉదారవాద సంస్కరణలు, ప్రైవేటీకరణ విధా నాల జైత్ర యాత్రను నిరాఘాటంగా కొనసాగించగలమని మోదీ భావిస్తున్నారు. దీనికి తోడు అవసరమనుకున్నపుడల్లా పౌరసత్వ చట్టాలు, రామాలయ నిర్మాణం లాంటి మత విద్వేషాలను ప్రజ్వలింపజేసే కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని జాతీయ వాదులమని చెప్పుకునే బీజేపీ హయాంలో, దేశ ఆర్థిక స్వావలంబనను నాశనం చేస్తూ, సామ్రాజ్యవాదుల లూటీ కొనసాగు తున్న తీరు అదీ! చిలీలో ప్రజలు వామపక్ష అభ్యర్థులను గెలిపించుకుని విద్యా, వైద్య రంగాలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకు రావటానికి ప్రయత్నిస్తు న్నారు. అదే స్ఫూర్తితో మనదేశంలో సైతం ప్రజలు సమైక్యంగా పోరాడి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రతిఘటించాలి.
(29 ఆగస్టు, 2021 న్యూయేజ్‌ సంచిక నుండి)
అనువాదం వెలుగూరి రాధాకృష్ణమూర్తి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img