Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆదివాసీల ఆనవాళ్లనూ మిగల్చరా?

ప్రసాదరావు

నేటి ప్రజాస్వామ్య యుగంలో పెట్టుబడిదారులు ప్రకృతి వనరులను దోచి, అమాయక గిరిజనులను మోసగించి ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటూ, అభివృద్ధి అనే పేరుతో ఆదివాసీల ఆనవాళ్లు లేని స్థితికి తీసుకుని వస్తూ ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఆదిలాబాద్‌లో 1980 వరకూ 90% ఉన్న గిరిజనులు ప్రస్తుతం మైనార్టీలుగా మారిపోయారు అంటే ఎంతగా ఇతరులు వచ్చి చేరారో ఇట్టే అర్థమవుతోంది. అలా వివిధ ప్రాంతాల్లో ‘అణగారిన అల్ప సంఖ్యాకులుగా ఆదివాసీలు’ మారిపోతున్నారు.


పచ్చని చెట్ల నీడలే ఆవాసం. గలగల పారే సెలయేళ్ళతో సావాసం. పక్షుల కిలకిలా రాగాలే మేలుకొలుపులు. మొత్తంగా పక్రృతి సుగంధ ఆస్వాదన వారి సొంతం. వారే కల్మషమెరుగని ఆదివాసీలు పక్రృతి రక్షకులు గిరిజనులు. ప్రపంచ నలుమూలల కొండలు, పర్వతాల మధ్య కాపురం చేసే అంతరాలు తెలియని అలౌకికులు వీరు. ఇలాంటి ఆదివాసీలు, గిరిజనుల ఆనవాళ్ళనూ చెరి పేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో వారి ఆవాస నివాసాలు, ఉపాధులకు ఎసరు పెడుతున్నారు. తినడానికి తిండి, నిలువ నీడ లేకుండా చేసి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వాధికారులు, పాలకులు అందరి భాగస్వామ్యం ఉండడమే అత్యంత విషాదం.
ఐ.ఎల్‌.ఓ నివేదిక ప్రకారం విశ్వ వ్యాప్తంగా సుమారు 48 కోట్లు (476.6 మిలియన్లు) మంది ఆదివాసీలు ఉన్నారు. 100 దేశాల్లో నివాసం ఉంటున్న ఈ గిరిజనులకు 6700 భాషలు ఉన్నాయి. ఇందులో 5000 సమూహాలు ఉన్నాయి. ఆధునీకరణ పేరుతో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను అన్ని చోట్లా కాలరాస్తున్నారు. చివరికి అస్థిత్వం కోసం పెనుగులాడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం ఆదివాసీలు ఎక్కడ ఉన్నా ప్రమాదం అంచున నిలబడి పోరాట బాట తప్పని స్థితిలో ఉన్నారు. మన భారతదేశం విషయానికొస్తే జనాభాలో 9-10% గిరిజనులు. అంటే సుమారు 10 కోట్ల మంది. హిమా లయాల్లో 11%, మధ్య భారత్‌లో 57%, పశ్చిమ భారత్‌లో 25%, దక్షిణ భారతదేశంలో 7% మంది నాలుగు జోన్స్‌ పరిధిలో విస్తరించి ఉన్నారు. వీరిలో ఎక్కువగా ‘గోండు’ జాతి గిరిజనులు కోటి 20 లక్షల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో అత్యధికంగా కని పిస్తారు. తెలంగాణలో 10-12% గిరిజనులు ఉండగా వీరిలో ఎక్కువ లంబా డీలు, రాజ్‌ గోండులు, చెంచులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 6% మంది ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ ఆదివాసీలు ఆఫ్రికాలో ఉన్నారు. ఆసియాలో మనదేశంలో ఉన్నారు. ఏ దేశానికైనా మూలవాసులు ఆదివాసీలు.. గిరిజనులే.

చేగువేరా చెప్పినట్లు ‘‘తెలివిలేక మనం వెనుకబడలేదు… తిరుగుబాటు లేక మనం వెనుకబడ్డాం’’ అని ఇకనైనా ఆదివాసీలు గుర్తెరగాలి. ఆదివాసీల హక్కుల కోసం, ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ కోసం కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు, సమ్మక్క సారక్క స్ఫూర్తితో ఉద్యమించాలి. వీరికి ఐక్యరాజ్యసమితి నుండి క్రింది గ్రామ పంచాయతీ వరకూ అనేక హక్కుల ఇచ్చినా, ప్రభుత్వ విధానాలు, పెట్టబడిదారులు, దోపిడీదారులు వలన అన్యాయాలకు గురై అభి వృద్ధికి ఆమడదూరంలోనే ఉంటున్నారు. 1982లో 140 దేశాల నుంచి 29 మంది మేధావులతో కమిటీ ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి వారి నుంచి ఆదివాసీల హక్కుల రక్షణకు నివేదిక కోరింది. భూములపై యాజమాన్యం హక్కులు గిరిజనులకు కల్పిస్తూ రక్షణ చట్టాలను చేయాలని ఈ కమిటీ సూచిం చింది. గిరిజనుల కోసం దాదాపుగా అన్ని దేశాల్లో చట్టాలైతే ఉన్నాయిగానీ ‘హామీలు ఆకాశమంత.. అమలు అధః పాతాళానికి’ అన్నట్లు ఉంది పరిస్థితి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5, 6, పదవ భాగం ఆర్టికల్‌ 244(1) ద్వారా వీరికి హక్కులు, భద్రత కల్పించారు. 1/70 చట్టం, పీసా చట్టం తీసుకొచ్చారు. ఎన్ని ఉన్నా అమలు అంతంత మాత్రమే. జీవో3ని అన్యాయంగా రద్దు చేసారు.
మైదాన ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతాల్లో చేరి వారికి అనేక విధాలుగా హాని కలిగిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారు. ముఖ్యంగా భూములను ఆక్రమించి, వ్యాపారాలు చేస్తూ పక్రృతి సంపదను కొల్లగొడుతున్నారు. విశాఖలో బాక్సైట్‌, ఓబుళాపురం, ఒరిస్సాలో దామన్‌ జోడ్‌ తదితర అనేక ప్రాంతాలు, రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ప్రాజెక్టులు పేరుతో గిరిజనులను నిరాశ్రయులు చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం గిరిజనుల పాట్లు మనకందరికీ తెలిసిందే.
రెడ్‌ ఇండియన్స్‌ అనే ఆదివాసీలను అంతం చేసి అమెరికా అగ్రరాజ్యంగా ఎలా ఎదిగిందో… అదే తరహాలో నేటి ప్రజాస్వామ్య యుగంలో పెట్టుబడి దారులు ప్రకృతి వనరులను దోచి, అమాయక గిరిజనులను మోసగించి ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటూ, అభివృద్ధి అనే పేరుతో ఆదివాసీల ఆనవాళ్లు లేని స్థితికి తీసుకుని వస్తూ ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఆదిలాబాద్‌లో 1980 వరకూ 90% ఉన్న గిరిజనులు ప్రస్తుతం మైనార్టీలుగా మారిపోయారు అంటే ఎంతగా ఇతరులు వచ్చి చేరారో ఇట్టే అర్థమవుతోంది. అలా వివిధ ప్రాంతాల్లో ‘అణగారిన అల్ప సంఖ్యాకులుగా ఆదివాసీలు’ మారిపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, రవాణా, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, బ్యాంకింగ్‌, కమ్యూనికేషన్‌ నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయంటే ప్రభుత్వాలు వారిని ఎంత చిన్నచూపు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నేటికీ గర్భిణులను డోలీలో, ఎండ్ల బండిలో, చేతుల మీద ఎత్తు కుని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు తరచూ చూస్తూనే ఉన్నాము. మార్గమధ్యలోనే ప్రసవాలు జరుగుతున్న సంఘటనలు కోకొల్లలు. మలేరియా, డెంగ్యూ, తదితర అనేక సీజనల్‌ వ్యాధుల బారినపడేవారిలో అత్యధికులు ఈ ఆదివాసీలు, గిరిజనులే. ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం, అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలేవీ తీసుకోరు. కావలసినంత అప్రమత్తతను ప్రకటించరు. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో కనీసం ఐసోలేషన్‌ కేంద్రాలు కూడా వారికి అందుబాటులో లేవు. ఉన్నా అరకొర వసతులే.
ప్రభుత్వాలు మేల్కొవాలి. ఆదివాసీల సమస్యలు పట్టించుకోవాలి. వారి ఆవాసాలకు ఇబ్బంది రాకుండా చూడాలి. ‘కొమ్ము’, ‘థింసా’ వంటి గిరిజనుల జానపద కళారూపాలు, వారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఐక్యరాజ్యసమితి చేసిన 6 తీర్మానాలు ఆదివాసీల స్వయం పాలన హక్కు, స్వేచ్ఛ, మానవ హక్కుల రక్షణ, సంప్రదాయ జీవన విధానం, భాషా వేషధారణ కాపాడుట, స్వయం పాలన వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలి. మనదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ఆదివాసీలకు వీటిని అందించేం దుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. 2006 అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలు చేయాలి. గిరిజనుల భాషలకు లిపి కనుగొనాలి. సబ్‌ ప్లాన్‌ నిధులు మంజూరుతో పాటు సక్రమంగా అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలి. ఆయా ప్రాంతాల్లో గనులు నుండి లభించే ఆదాయం వారికే ఇవ్వాలి. ఉద్యో గాలు ఇవ్వాలి. అడవుల అక్రమ నరికివేత అరికట్టాలి. విద్య, వైద్యం అందు బాటులో ఉంచాలి. వీరి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ఆదివాసీల భవిష్యత్‌కు భరోసా ఏర్పడుతుంది.
వ్యాస రచయిత సెల్‌ 9948272919

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img