Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఇక సామాన్యులకు బ్యాంకులు దూరమే!

ఎన్‌. శంకర్‌

మళ్లీ ప్రైవేటు బ్యాంకులు రాజ్యమేలనున్నాయి. బ్యాంకుల జాతీయకరణకు ముందున్నది అన్నీ ప్రైవేట్‌ బ్యాంకులే. ఇవి ధనిక వర్గాలకు మాత్రమే ఉపయోగపడేవి. అనేక ప్రైవేట్‌ బ్యాంకులు మూతబడిపోయాయి. పెద్ద పారిశ్రామికవేత్తలే బ్యాంకులను ఏర్పాటు చేసి సొంతానికి రుణాలు తీసుకుని మళ్లీ జమ చేసేవారు కాదు. ఫలితంగా అనేక బ్యాంకులు దివాలా ప్రకటించాయి. ఫలితంగా అనేక మంది నష్టపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులే ఉండేవి కావు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడేవారు. జాతీయకరణకు ముందునాటి దుస్థితి మళ్లీ తలెత్తుతుందా అని అనిపిస్తుంది. బ్యాంకులన్నీ ప్రైవేటు పరమైతే జాతీయకరణ లక్ష్యమే పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ప్రైవేట్‌ బ్యాంకులకు లైసెన్సు ఇచ్చే అధికారాన్ని బ్యాంకుల అజమాయిషీని నిర్వహించే రిజర్వు బ్యాంకుకు ఇచ్చారు. లైసెన్సు విధానంపైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే ఈ విధానం దేశ ప్రజలందరికీ ప్రయోజనం కల్పించేది కాదని, దీనివల్ల అత్యధికులు బ్యాంకు సేవలకు వెలుపలే ఉండిపోతారని అభిప్రాయపడుతున్నారు.
రిజర్వుబ్యాంకు ఈ లైసెన్సు విధానం మెరుగైన పద్ధతి అని ఆర్‌బిఐ చెబుతోంది. అయితే బ్యాంకులలో మదుపు చేసిన వారి డబ్బుకు భద్రత కల్పించేందుకు ఏనాడూ కఠినమైన చర్యలు తీసుకోలేదు. ఆర్బీఐ స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, మహిళా బ్యాంకులకు గతంలో లైసెన్సు ఇచ్చింది. ఆ బ్యాంకులేవీ ఇప్పుడు లేవు. ఇప్పుడు యూనివర్సల్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, చిన్నతరహా ఆర్థిక బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆచరణలోకి రాకముందే ఈ బ్యాంకులు ప్రజల, దేశ అవసరాలను తీరుస్తాయని నమ్మగలుగుతున్నారు. గడచిన దశాబ్దిలో 11 పేమెంట్‌ బ్యాంకులకు, 10 చిన్నతరహా బ్యాంకులకు, 2 యూనివర్సల్‌ బ్యాంకులకు ఆర్బీఐ లైసెన్సులు ఇచ్చింది. ప్రైవేటు రంగానికి చెందిన ప్రమోటర్లకే ఈ లైసెన్సులు ఇచ్చారు. ప్రజా ధనంతో కార్యకలాపాలు సాగించే ఈ బ్యాంకులు ప్రజలకు సంతృప్తికరంగా, అంకిత భావంతో, మంచి ఫలితాలను రాబట్టినవిగా పని చేశాయా అనేది ప్రశ్నార్థకమే. కార్పొరేట్‌ సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలన్న ఆర్బీఐ ప్రతిపాదనను ఈపాటికే అమలు చేసి ఉండేవారు. అయితే నిపుణులు, వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో కొంత కాలం ఆగింది.
ప్రభుత్వరంగ బ్యాంకులను మరింతగా విస్తరించి నూతన శాఖలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది ప్రజలకు సేవలు అందించేందుకు ఆర్బీఐ ఇంతవరకు ఆలోచించక పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆర్బీఐ లైసెన్సు విధానం ప్రైవేటు రంగానికి అత్యధికంగా అనుకూలంగా ఉంది. ప్రజల డిపాజిట్ల భద్రతకు గట్టి హామీని ఇచ్చే ఆలోచన ఆర్బీఐ చేసింది లేదు. దివాలా తీసిన టిఎంసి బ్యాంకును కొనుగోలు చేసేందుకు కూడా ఆర్బీఐ అనుమతించింది. కొత్త ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు, దివాలా తీసిన వాటిని కొనుగోలు చేసేందుకు ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుంది. విఫలం చెందిన బ్యాంకులకు ఈ లైసెన్సు విధానం అమలు సరైనదేనా! ప్రమోటర్లను అన్ని విధాలుగా పరిశీలించి లైసెన్సులు ఇస్తామని ఆర్బీఐ చెబుతోంది. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ప్రైవేటు బ్యాంకులు ఎందుకు విఫలమవుతున్నాయి? ఇప్పుడున్న ప్రైవేటు బ్యాంకులు సైతం పారు బకాయిల భారాన్ని ఎందుకు మోస్తున్నాయి? ప్రైవేటు బ్యాంకులు విఫలం కాకుండా నిరోధించేందుకు ఆర్బీఐ పాత్ర ప్రశ్నార్థకమైంది. అందువల్లనే ప్రజలు కచ్చితమైన, కఠినమైన, సమర్థంగా నిర్వహించే లైసెన్సు విధానం కావాలని కోరుకొంటున్నారు. కష్టపడి దాచుకొన్న కొద్ది మొత్తాలకు భద్రత ఉండేందుకు నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు.
సేవింగ్స్‌ బ్యాంకు ఎకౌంట్లు ఉన్నవారికి న్యాయంగా ఎస్‌బీఐ ఉచిత సేవలు అందించాలి. 66వ బ్యాంకు దినోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా బ్యాంకు ఎటిఎమ్‌ల నుంచి తమ డబ్బును నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా తీసుకోవచ్చునని ఆంక్ష పెట్టింది. నెలలో నాలుగుసార్లకు మించి డబ్బు తీసుకుంటే సర్వీసు ఛార్జీలను వసూలు చేయటం ఎంతవరకు సబబు? నెలలో ఎన్నిసార్లయినా ఎటిఎం నుంచి డబ్బు తీసుకొనేందుకు, ఏడాదిలో 48 చెక్కులను ఉచితంగా అందించేందుకు ఎస్‌బీఐ అనుమతించాలని కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే కౌంటర్‌ల వద్ద ఖాతాదారులు వచ్చి డబ్బు తీసుకొనేందుకు అనుమతించకుండా ఎటిఎంల ద్వారా మాత్రమే అనుమతిస్తే ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? ఇక వారికి బ్యాంకులు అందించే ఉచిత సేవలు ఏమీ ఉండవని భావించవలసి వస్తుంది. ఖాతాలో కనీస నిల్వలు లేని ఖాతాదారుల నుండి 300 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘‘ఘనత’’ ఆర్బీఐకి ఉంది. ఎస్‌బీఐ విధానాన్ని ఇతర బ్యాంకులు కూడా అనుసరించి సేవలకు ఛార్జీలు వసూలు చేస్తే క్రమంగా సామాన్యులను బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి వెలుపలికి నెట్టివేయటమే అవుతుంది.
బ్యాంకులు ఖాతాదారులకు అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఛార్జీలు కూడా ఎక్కువగా ఉన్నందున కనీస స్థాయికి తగ్గించాలని బ్యాంకు ఖాతాదారుల అసోసియేషన్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి. సేవలకు ఛార్జీలు వసూలు చేయరాదని ఉద్యోగుల అసోసియేషన్‌ ఎఐబిఈఎ కూడా డిమాండ్‌ చేసింది. వడ్డీ లేని ఆదాయంగా దీన్ని బ్యాంకులు పొందుతున్నాయని అసోసియేషన్‌ విమర్శించింది. ఎటిఎం కార్డులకు, డెబిట్‌ కార్డులకు, నగదు తీసుకున్నందుకు, నగదును డిపాజిట్‌ చేసినందుకు, ఖాతాలో కనీస నిల్వ లేనందుకు, చెక్కులకు, ఎకౌంట్‌ను క్లోజ్‌ చేసేందుకు బ్యాంకులు భారీగా ఛార్జీలు వసూలు చేయటం ఎంత మాత్రం సమంజసం కాదు. సేవింగ్స్‌ ఎకౌంట్‌లో ఎక్కువకాలం ఉండే నిల్వల పైన కూడా బ్యాంకులు ఇచ్చే వడ్డీ అతి స్వల్పంగా ఉంటోంది. ఈ విధానంలో ఎక్కువ మంది ప్రజలకు బ్యాంకు సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img