Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఇది మల్లెల వేళయనీ…

అవును… ఇది మల్లెల కాలం. మల్లెల మాసం. పూలండోయ్‌ పూలు… మల్లెపూలు అంటూ సైకిళ్ల వెనుక బుట్టల్లో తెల్లటి మల్లెల్ని నింపుకుని చిరు వ్యాపారులు వీధుల్లో తిరుగాడే కాలం. మల్లెలు కనపడగానే.. ఆ సువాసన ముక్కుని తాకగానే ప్రాణం ఎక్కడికో పోతుంది. మూడు నెలలు మాత్రమే కనిపించే మల్లెపూలకు ఏడాదంతా గుబాళింపే. పువ్వుల్లో మేనక వంటిది ఈ మల్లె. గుబులు రేపుతుంది. రావులపాలెం నుంచి అలా రాజమండ్రి వరకూ జాతీయ రహదారిపై వెళ్తుంటే మల్లెలు రారమ్మని పిలుస్తాయి. ఆగాల్సిందే. కొనాల్సిందే. భార్యకో, ప్రియురాలికో కాన్కగా ఇవ్వాల్సిందే.
తెలుగు సినిమా పాటల్లో ఈ మల్లెలకే అగ్రతాంబూలం. మల్లెలమీద పాట రాయని సినీకవులు బహుఅరుదు. సినారె తన సినీకవి ప్రయాణంలో తొలి పాటలు మల్లెల మీద రాసారు. అఫ్‌కోర్స్‌ అందులో విరహ గీతాలూ ఉన్నాయనుకోండి. హీరో ఎన్టీఆర్‌ తన విరహాన్ని, వేదనని మల్లెపూలతో పంచుకున్నాడు. ‘‘మల్లియలారా… మాలికలారా.. మౌనముగా ఉన్నారా.. మా కథనే విన్నారా’’ అంటారు సినారె. నిజానికి మల్లెలు మౌనంగానే మత్తెక్కిస్తాయి. మౌనంగా మానవుల కథలు వింటాయి. ఏ కథైనా ఆప్తులకే చెప్పుకుంటాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారైతే మల్లెలకి పరవశించి రాసిన పాటలెన్నో ఉన్నాయి. ‘‘ఇది మల్లెల వేళయని… వెన్నెల మాసమని… ముందే కూసిన కోయిలా’’ అంటూ సుఖదుఖాలు కలబోసుకున్నారు. అంతేకాదు…ఈనాటి బంధం ఏనాటిదో సినిమాలో మల్లెలకి, బొండు మల్లెలకి తేడా కూడా చెప్పారు. ఈ సినిమాలో ‘‘ఎవరు నేర్పేరమ్మ… ఈ కొమ్మకు’’ పాటలో ‘‘మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి… మొల్లలివి నన్నేలు నా స్వామికి’’ అంటారు. తాను కొలిచే అమ్మవారికి మల్లెపూలు ఇస్తే తనను ఏలే శ్రీవారికి మొల్లలిచ్చింది హీరోయిన్‌. మొల్లలంటే బొండు మల్లెపూలు. బ్రహ్మ సృష్టించిన మల్లెలకి విశ్వామిత్రుడు చేసిన ప్రతిసృష్టే బొండు మల్లెలు. విశ్వామిత్ర సృష్టిని దైవ కార్యానికి ఉపయోగించరు. ఆ తేడాని రెండులైన్లలో చెప్పి మల్లెపూల విశిష్టతను కూడా చెప్పారు దేవులపల్లి.
వేటూరి సుందరరామమూర్తి అయితే తనకు అవకాశం వచ్చిన ప్రతీసారీ మల్లెల మీద పాటలు గుప్పించారు. ఇంటింటి రామాయణం సినిమాలో మల్లెలు పూచే… వెన్నెల కాచే… అంటూ మల్లెలకి, వెన్నెలకి ఉన్న బంధాన్ని మరోసారి చూపించారు. చిరంజీవి ఆరాధన సినిమాలో కూడా ‘‘తీగనై… మల్లెలూ…’’ అంటూ ఓ మెచ్యూర్డ్‌ ప్రేమని మల్లెలతో ముడిపెడుతూ రాసారు. తెలుగు వారి జీవితాల్లోనే కాదు సాంస్కృతిక వారసత్వంలో కూడా మల్లెపూలకి విశేషమైన స్ధానం ఉంది.
తెలుగు కథా సాహిత్యంలో కూడా మల్లెపూల గురించిన కథలు చాలానే వచ్చాయి. ప్రముఖ కథకుడు సి.ఎస్‌.రావు రాసిన మల్లెపూలు కథ చాలా గొప్పకథ. ఓ కామందు తన పూదోటలో విరగబూసిన మల్లెల్ని కోయడానికి కొందరు మహిళలను కూలీలుగా చేర్చుకుంటాడు. వారంతా సాయంత్రం వరకూ మల్లెలుకోసి మార్కెట్‌కి తరలించే వరకూ వొళ్లు వంచి పనిచేస్తారు. ఇంత పని చేసినా వారికి మల్లెపూలు పెట్టుకునే భాగ్యం మాత్రం కలగదు. వారి మల్లెల కోరిక ప్రతిరోజూ వాడిపోతుంది. అలాంటి సమయంలో ఓ మహిళా కూలికి గుప్పెడు మల్లెలు ఇచ్చి ఆమెని లొంగదీసుకుంటాడు ఆ కామందు. ఈ మాత్రానికే స్త్రీలు లొంగిపోతారా అనే ఆలోచన వద్దు. ఆ కారణాలు అలాంటివి. ఇక్కడ మల్లెల విశిష్టత, వాటిపై మహిళలకుండే అనురాగమే ప్రధానం. ఇక అభ్యుదయ రచయిత చా.సోగా ప్రసిద్ధికెక్కిన చాగంటి సోమయాజులు గారు కూడా బొండు మల్లెలు అని కథ రాసారు. ఈ కథలో శ్రమదోపిడీ గురించి చెప్తారు చా.సో. తన ఇంటి పెరట్లో మల్లె పందిరివేసి ఆ పంటను ధనికులకు ఎక్కువ మొత్తానికి విక్రయించాలని ప్రధాన పాత్రధారి ఉద్దేశం. ఇందుకోసం ఓ తాతను పనిలో పెట్టుకుంటాడు. మల్లెపందిరి విస్తారంగా పంట ఇస్తుంది. ఆ యజమానికి కూడా భారీగానే డబ్బులు వస్తాయి. కానీ, ఆ మల్లెతోటకోసం అహర్నిశలు పనిచేసిన తాత మాత్రం డబ్బులులేక, తిండి లేక మరణిస్తాడు. ఇక్కడ సారూప్యం ఏమిటంటే మల్లెలు కూడా సుఖాన్నిఇచ్చి వాడిపోతాయి. పనివాడు తాత అలాంటి మల్లెలకి ప్రతీక.
మరో రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి కూడా కొండ మల్లెలు అని ఓ కథ రాసారు. ఇందులో రెండు జంటల జీవితాలను చూపించిన సరస్వతీదేవి అందులో గిరిజన జంటను మల్లెలాంటి మనసులకు ప్రతీకలా చూపించారు. ఇలా మల్లెపూలకి, మనుషులకి ఉన్న అనుబంధం తీరనిది. తీర్చలేనిది. సమయం మించిపోతోంది. ఇక ఎంతోకాలం మల్లెలురావు. ఇప్పుడే పూల మార్కెట్‌కు వెళ్లండి. మల్లెదండ తీసుకొచ్చి శ్రీమతి చేతిలో పెట్టండి. మీరేమడిగినా ఆ స్త్రీ మూర్తి చేసేస్తుంది. స్త్రీలు మెచ్చే, నచ్చే పెద్ద కానుక మల్లెపూలే.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img