Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఇప్పటికీ మారని రైతు బతుకు

భారతదేశం వ్యవసాయక దేశం. దేశంలో సుమారు 90 శాతానికిపైగా సన్న, చిన్న కారు రైతులు ఉన్నారు. వ్యవసాయంలో ప్రధాన భూమికరైతుదే. అలాంటి రైతు బతుకే కాలక్రమేణా అధ్వానంగా మారుతోంది. పాలకులు ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా వారి తలరాతలు మారటంలేదు. దీనికి ముఖ్య కారణం మానవునిచేతిలోలేని వాతావరణ మార్పుల కారణంగా ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవడం, దీనికి పలు ఇతర సమస్యలు తోడవడం రైతు బతుకును మరింత ఛిద్రం చేస్తోంది. ఇంకో విచిత్రమేమిటంటే పంట అధికంగా పండినా, తక్కువగా పండినా లేదా అసలు పండక పోయినా రైతుకు నష్టమే. ఇన్ని సమస్యల మధ్య రైతులు బతుకు ఈడ్చుకుంటూ రావడం కత్తి మీద సామే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఫిబ్రవరి 2019లో పియం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పధకాన్ని అన్నదాతల బతుకులు మెరుగుపరచే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. తెలంగాణ, జార్ఖండ్‌, ఒడిస్సా, రాష్ట్రాల్లో అప్పటికే ఈ పథకం అమలు చేయడంతో సత్ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ఇవ్వడంచూసి, కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందని కొందరి భావన. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని రైతులతో బాటు భూమిలేని కౌలు రైతులకు కూడా వర్తింప జేయడం ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించడం గమనార్హం.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రెండు హెక్టార్లకు మించకుండ ఉన్న వ్యవసాయ కుటుంబాలకు ఏటా రు.6,000 మూడు విడతల్లో రు.2000 చొప్పున చెల్లిస్తారు. ఈ పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించ డానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటుచేసింది. ఇవన్నీ టోల్‌ ఫ్రీ నెంబర్లు. ప్రతీ ఏడాది తొలివిడత సాయం నిధులు ఏప్రిల్‌- జూన్‌ మధ్య విడుదల అవుతుంటాయి. ఈ పథకం నూటికి నూరు పాళ్ళు కేంద్రమే ఆర్ధికసాయాన్ని రాష్ట్రాలతో సంబంధంలేకుండా అందజేస్తుంది. లబ్ధి దారులు ప్రతి ఏటా ఈ పథకంకింద తమపేరును రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అవసరమైతే దగ్గరలోని, కామన్‌ సర్వీసు సెంటరుకు వెళ్ళి పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంతవరకు 13 వాయిదాలు ఈ పథకం కింద విడుదల అయ్యాయి. అంటే, ఒక్కో లబ్దిదారునికి ఇంతవరకు రు.26,000 ముట్టాయి. అయితే ఈ స్వల్ప మొత్తం రైతుల దుస్థితిని పరిష్కరించలేదు. వ్యవసాయ ఖర్చుల భారం కూడా కొంత తగ్గుతుంది. దీనికి రాష్ట్రాలు అందిస్తున్న నగదు కలిపితే రైతుకు మరింత లబ్ధి చేకూరుతుంది. ఫలితంగా గ్రామీణ సమీప పట్టణ వస్తు, సేవలకు అదనపు డిమాండు ఏర్పడుతుంది. ఈ పథకం కౌలు రైతులను పట్టించుకోకపోవడం పలు విమర్శలకు గురి అవుతోంది. దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నది వారే. వీరికి చెందవలసిన నగదును భూ యజమానులు అనుభవించడం న్యాయం కాదు. ఈ విషయంలో వారు పెద్దమనసు చేసుకోవాలి. ఈ సాయాన్ని కౌలురైతుకు అందించాలి.
ఇతర లోపాల విషయానికొస్తే, ఈ పథకంలో రైతు నిజంగా సేద్యం చేస్తున్నాడా లేదా తన పోలాన్ని కౌలుకిచ్చాడా అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే యంత్రాంగం కోరవయింది. ముఖ్యమైనదే మిటంటే, రెండెక్టార్ల భూమిని కోలమానంగా నిర్ణయించడం, ఒకొక్క రాష్ట్రంలో లేదా ప్రాంతంలో భూమి ఉత్పాదకత ఒక్కోలాగుంటుంది. వాతావరణం, వసతులు, నేలస్వభావం వంటి వాటిపై దిగుబడి ఆధారపడి వుంటుంది. ఇలాంటి సమస్యలతో సతమత మవుతున్న గ్రామాలు అనేకం. కొన్ని ప్రాంతాల్లో యజమానికి 20 ఎకరాలున్నా దిగుబడి అంతంత మాత్రమే. మరికొన్నిప్రాంతాల్లో రెండెకరాలున్నపంట భారీగా పండుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భూ పరిమితులను నిర్ణయించాలే తప్ప దేశవ్యాప్తంగా ఒకే పరిమితిని నిర్ణయించడం సమంజసం కాదు. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలుకు అసలు రైతుల సమాచారం చాలా అవసరం. భూ రికార్డులు పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ చేసిననాడే ఈ పథకం విజయవంత మవుతుంది. కాని కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదు. కౌలు రైతులకు సంబంధించిన వివరాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో లేవు ఈ పథకంలో అర్హులైన రైతులు తమ కష్టాలను, విన్నపాలను చెప్పుకొనే యంత్రాంగం లేదు. తాజా బడ్జెట్లో ఈ పథకం కింద అర్హులను కుదించి గత ఏడాది కన్నా నిధులు తగ్గించారు. గతంలో రు.68,000 కోట్లు కేటాయించినా, పలు అంక్షలతో రు 60 వేలు కోట్లే చెల్లించారు. ఈసారి కూడా అంతే మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించారు.
యస్‌.వై. విష్ణు, సెల్‌ : 9963217252.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img