Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉత్పత్తిరంగంపై కేంద్రం నిర్లక్ష్యం

నంటూ బెనర్జీ

ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా లాంటి నినాదాలు చేయడం మినహా దేశంలో ఉత్పత్తిరంగంపైన ఎక్కువగా నిర్లక్యం చూపారు. అధికంగా సేవల రంగంపైనే దృష్టిపెట్టారు. అలాగే వినిమయదారులను ఆకట్టుకునేందుకు ప్రకటనల విభాగం, మార్కెటింగ్‌ ప్రచారం మాత్రం బాగాసాగింది. రక్షణరంగం, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపైన దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా పెట్టుబడి, పరిశ్రమలు విస్తరించిన దాఖలాలులేవు. చైనా నుంచి 1.2ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తి యూనిట్లను మనమే తీసుకుని నిర్వహించాలని మోదీ పదేపదే చెప్పి నప్పటికీ అదిపగటికలలే అయ్యాయి. అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉత్పత్తిరంగంలో పెట్టుబడులకు అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ దేశవిదేశాల పెట్టుబడిదారులు ముందుకువచ్చి కొత్తపరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఉత్పత్తిరంగానికి, ఆర్థికవృద్ధికి దగ్గర సంబంధం ఉంటుంది. ఇదే సక్రమంగా జరగడంలేదు. ఇటీవల విదేశాంగమంత్రి జైశంకర్‌ అర్థవంతమైన మాటే చెప్పారు. ‘‘మనం చైనావైపు చూడడం మానేయాలి. నిజంగా స్థిరంగా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అనుకుంటే భిన్నరంగాలకు విస్తరించాలి. దేశీయఉత్పత్తుల, విక్రయదారుల గొలుసును ఏర్పాటు చేసుకోవాలి. చిత్తశుద్ధితో ఉత్పత్తిరంగాన్ని విస్తరిస్తే ఆర్థికవృద్ధి జరుగుతుంది. ఉత్పత్తిరంగంలో పురోగతి సాధించకుండా ప్రపంచస్థాయికి చేరాలని ఏ దేశమూ భావించదు. విదేశీ పెట్టుబడులకు ఆర్థికవ్యవస్థను తెరచి ఉంచాలని, ప్రపంచస్థాయికి అభివృద్ధి చెందాలని కోరుకుంటే సరిపోదు. ఇతరులకు సబ్సిడీలుఇచ్చి ఉత్పత్తిక్షేత్రాన్ని సరిదిద్దాలనుకుంటే అది పరిశ్రమలు లేని దేశంగా తయారవుతుంది’’ అన్నారు.
ఉత్పత్తిరంగం విస్తరణ, భిన్నత్వం, వృద్ధి కోసం మార్కెట్‌లో ప్రవేశించి ప్రజలనుంచి నిధులు సేకరించి ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు పెట్టడం గత పదేళ్లకాలంలో గొప్పగా జరగలేదు. కేవలం సర్వీసురంగంలో మాత్రమే ఈ విధమైన ప్రయత్నం జరిగింది. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాలు కలిసి పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. అయితే అలాంటి పరిశ్రమలు నిధులు సమకూర్చినవారికి చేసిన వాగ్దానాలను నెర వేర్చడంలో విఫలమయ్యాయి. గత ఐదేళ్లకాలంలో చూసినట్లయితే ఈ విధమైన పరిశ్రమలు ఒక్కటికూడా రాలేదు. ఇనీషియల్‌ పబ్లిక్‌ఆఫరింగ్‌ల (ఐపీఓ) ద్వారా పెట్టుబడులు పెట్టింది ఎల్‌ఐసి(21వేల కోట్లు), పే టైమ్‌ (16,300కోట్లు), జీఐసీ (11,256.3కోట్లు), ఎస్‌బీఐకార్డులు (10,354. 8కోట్లు), న్యూఇండియా ఎస్యూరెన్స్‌, జొమేటో, హెచ్‌డీఎఫ్‌సీ లాంటివి పెట్టుబడులతో విస్తరించాయి. ఇంకా అనేకం సేవలరంగంలో మాత్రమే ప్రవేశించాయి. మూడు దశాబ్దాలకాలానికిపైగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి అమలు చేస్తున్నారు. ఈ కాలంలో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి భారీగా పెట్టుబడులుపెట్టిన సందర్భాలులేవు. మోదీ ప్రభుత్వం ఉత్పత్తి సంధాన ప్రోత్సాహకం(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన వారులేరు. దేశంలో పెట్టుబడుల రంగం ప్రస్తుతం చాలా ఉదారమైన రంగాలలో ఒకటిగా ఉంది. విదేశీ పెట్టుబడుల రాకలో ఉత్పత్తి రంగానిది నాలుగవ స్థానమే. తక్కిన రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతను విదేశీ పెట్టుబడిదారులు ఈ రంగానికి ఇవ్వడంలేదు. పీఎల్‌ఐ పథకం కూడా వీరిని పెద్దగా కదిలించలేదు.
మౌలికసదుపాయాల విభాగంలో జాప్యం, భూసేకరణలో కాలహరణ, వివిధ రాజకీయ ఒత్తిడులు, అనేక ఉత్పత్తిరంగ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నాయి. జాతీయ రహదారులు, ఇతర రోడ్డు మార్గాలు, రైల్వేలు, నీటిమార్గాలు తదితరాలలో ప్రభుత్వం మెగామౌలిక సదుపాయాల ప్రాజెక్టులు బాగాజాప్యమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్పత్తిరంగంలో కొత్తగా స్థానిక పరిశ్రమలు, దీర్ఘకాలం నిలబడేవి ప్రస్తుతం అవసరం. అయితే ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. భారతదేశానికి లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టి) పరిశ్రమ వచ్చినట్లుగా ఇతర ఏ పరిశ్రమలు రాలేదు. దేశంలో విలువైన ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల రంగం సంబంధిత ఉత్పత్తి పరిశ్రమలు అనేక దశాబ్దాలుగా ఉన్నాయి. కొత్తగా స్టార్టప్‌లు, ఈజీమనీ, అధికవిలువ లభించేవి, త్వరగా ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకు బదిలీకావడానికి యువపారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వ మౌలిక సదుపాయాల, ప్రాజెక్టు నిర్వహణ డివిజన్‌ (ఐఎమ్‌పీడీ) 150కోట్ల రూపాయల లోపు విలువకలిగిన కేంద్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణ సంస్థ. ఇది తప్పనిసరిగా 150కోట్ల లోపు ఆ పైన ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల అమలు ఏజన్సీలకు అన్‌లైన్‌ కంప్యూటర్‌ మానిట రింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఈ సమాచారాన్ని అందచేయాలి. దిల్లీ` ముంబై ఎక్స్‌ప్రెస్‌ రహదారి 1350కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఈ మార్గంలో దాదాపు లక్ష కోట్లరూపాయలకుపైగా విలువైన ప్రాజెక్టులు నత్తనడకగా ఏర్పాటవుతున్నాయి. 240 ప్రాజెక్టులను మాత్రమే సకాలంలో పూర్తిఅయి వాటి నిర్మాణ విలువలు పెరగకుండా ఉన్నాయి. ఇతర అనేక ప్రాజెక్టులు జాప్యమై నిర్మాణవ్యయం పెరుగుతున్నది. గత మూడు దశాబ్దాల కాలంలో చైనా ప్రభుత్వం ఉత్పత్తిరంగంపై శ్రద్ధ వహించి అపారమైన అభివృద్ధిని సాధించిన మార్గంలోనే భారత ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img