Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఉత్సాహం కలిగించిన సీపీఐ రాష్ట్రసమితి సమావేశాలు

ఎం.సి.వెంకటేశ్వర్లు

సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఈ ఆగస్టు 8వ తేదీన విజయవాడ దాసరి భవన్‌లో అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. కొవిడ్‌19 రెండవ దశ నేపథ్యంలో సుమారు ఒకటిన్నర సంవత్సరం తరవాత భౌతికంగా ఈ సమావేశం జరగడంతో సమితి సభ్యులు హాజరుకావడమే గాక రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికపై చర్చలు ఆసక్తికరంగా జరిగాయి. భవిష్యత్‌ పోరాటాలకు స్ఫూర్తినిచ్చాయి. గత సంవత్సరం (2020) మార్చిలో ప్రకటించిన లాక్‌డౌన్‌తో పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు మరుగునపడిపోయాయి. పార్టీ సభ్యులు, కార్యకర్తలు స్థబ్దతలో పడిపోయారు. ఆన్‌లైన్‌ సమావేశాలు జరిపి సందర్భానుసారంగా పార్టీ ఇచ్చిన పిలుపులకు పరిమిత స్పందన లభించింది. కొవిడ్‌19 దశలో అనేకమంది పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు మరణించినా లేదా కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డా పార్టీ ఇచ్చిన పిలుపులకు కమ్యూనిస్టు శ్రేణులు చూపించిన తెగువ, పోరాట పటిమ భవిష్యత్‌ పోరాటాలకు స్ఫూర్తినిచ్చాయి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు లేనిదే అధికారంలో ఉండలేడని, రెండు సంవత్సరాల పాలనలో లక్ష కోట్లను ప్రజల అకౌంట్లలో వేసి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మార్చుకున్నట్లు వెల్లడిరచాడు. అయితే ప్రజలకు అర్థం కాని రీతిలో ప్రజలపై అనేక భారాలను మోపారని చేసిన ఆరోపణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టాయి.
జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక నూతన పాలసీతో భవన నిర్మాణ రంగం కుదేలయింది. ఇసుక దొరక్క వినియోగదారులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మద్యం ధరలు పెంచి, సొంత బ్రాండ్‌లు పెట్టి పక్క రాష్ట్రాల నుండి రాకుండా ఆంక్షలు విధించి మద్యం ప్రియుల జేబులు కొల్లగొడుతున్నారు. జీవో నెం.196, 197, 198 తీసుకు వచ్చి ఆస్థి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు ద్వారా పట్టణ ప్రాంత ప్రజలపై అధిక భారం మోపాడు. ఎన్నికల్లో యువకులను ఆకర్షించడానికి చెప్పిన 2 లక్షల 35 వేల ఉద్యోగాల హామీని అటకెక్కించి కేవలం 13,522 ఉద్యోగాలకు ఆర్భాటంగా ప్రకటించిన జాబ్‌ కాలెండర్‌ యువతీయువకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. శాసన సభ్యులతో పాటు 25 మంది పార్లమెంట్‌ సభ్యులను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని, విభజన హామీలను అమలు జరిపిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి నేడు చేతులెత్తేశారు.
రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయవలసిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్వేష రాజకీయాలతో రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కాస్తా వెళ్ళిపోతున్నాయి. దానికి అమరరాజా ఫ్యాక్టరీ ఉదంతమే నిదర్శనం. సంక్షేమ కార్యక్రమాలను ఓట్ల రాజకీయాలకు ప్రాతిపదిక చేసుకోవడంతో రాష్ట్రాభివృద్ధి అడుగంటింది. జీతాలకు, పాలనా ఖర్చులకు అప్పులపై ఆధారపడవలసి వచ్చింది. ప్రభుత్వ ఆస్తులను, ఆదాయాలను తాకట్టు పెట్టుకొని అప్పుల కోసం కేంద్రం, బ్యాంకుల చుట్టూ తిరిగే దుస్థితి రాష్ట్రానికి పట్టింది. రాష్ట్ర విభజన నాటికి 97 వేల కోట్లుగా ఉన్న అప్పు నేటికి 4 లక్షల కోట్లకు చేరింది. అందులో సింహభాగం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే. లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు బకాయి ఉండటంతో ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేసే పరిస్థితి లేదంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండబోదు. స్థూలంగా రాష్ట్ర రాజకీయాలపై రాజకీయ నివేదిక ప్రస్తావించిన అంశాలు ఇవి.
వాటితోపాటు అవసరానికి మించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, అస్మదీయులకు పదవుల పంపకం కోసం 50కి పైగా కార్పొరేషన్‌ల ఏర్పాటు రాష్ట్ర ఖజానాపై అధిక భారం అనుటలో ఎలాంటి సందేహం లేదు. పాలనా వైఫల్యాలు, వివాదాస్పద నిర్ణయాలతో న్యాయపరమైన సమస్యలు, ఉన్నతాధి కారులు తరచుగా కోర్టు మెట్లు ఎక్కడం రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు. దీనిపై స్పందించిన సీపీఐ రాష్ట్ర సమితి ‘‘రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విధానం ఏ కోణంలో చూసినా రాష్ట్రాభివృద్ధిని సూచించడంలోగానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలోకానీ, అవినీతిని అరికట్టడంలోగానీ వైఫల్యం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో స్థూలంగా మన పార్టీ నిర్థిష్టంగా ప్రతిపక్ష వైఖరి అవలంబించాలి. స్వతంత్రంగా మన పార్టీ పోరాడాలి. అదే సందర్భంలో కలిసి వచ్చే వామపక్ష, ప్రజాస్వామిక శక్తులతో కలిసి ఉద్యమించడం అవశ్యం’’ అని తీర్మానించింది.
అదే విధంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవలసిన అవసరాన్ని రాష్ట్ర సమితి నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీలూ అవకాశవాద రాజకీయ విధానాలను అనుసరిస్తున్నాయి. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేకహోదాను కేంద్రంవిస్మరించి తెలుగు ప్రజలను అవమానించినా జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు నోరు విప్పడం లేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానిని పూర్తి చేయడం తమ బాధ్యత అని చెప్పిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మడత పేచీలు పెట్టి రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నా ముఖ్యమంత్రి, బాబు ఒకరినొకరు విమర్శించుకోవడానికి తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తున్నారు తప్ప మోదీపై ఈగ వాలనీయడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఇచ్చిన పిలుపు వామపక్ష, లౌకిక ప్రజాస్వామిక శక్తులతో కూడిన ప్రజా ఉద్యమం ఆచరణలోకి రావాలంటే మొత్తం పార్టీని సమాయత్తం చేయాలి. ప్రత్యేకించి యువజన, విద్యార్థి, మహిళలను విస్తృత సంఖ్యలో సమీకరించాలి. వారిలో రాజకీయ, సైద్ధాంతిక అవగాహనను పెంచాలి. ఈ లక్ష్య సాధన కోసం కింది బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిపాదించింది.
కర్తవ్యాలు
విద్యార్థి, యువజన సంఘాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయి యూత్‌ క్యాంపులు నిర్వహించాలి. అన్ని జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. హోల్‌టైమర్లను నిర్ణయించాలి. జనరల్‌ బాడీ సమావేశాలు, మహాసభలు నిర్వహించాలి. పార్టీ శాఖా జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సమస్యలపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయాలి. శాఖలను చైతన్యవంతం చేయడానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులతో రెండు రోజులు వర్క్‌షాపు నిర్వహించాలి. ఈ వర్క్‌షాపు తర్వాత ప్రతి జిల్లా తమ జిల్లాలోని శాఖా కార్యదర్శుల వర్క్‌షాపును ఒక రోజు నిర్వహించాలి. ఉద్యోగాల కల్పనపై పోరాడుతున్న విద్యార్థి, యువజన సంఘాల సమైక్య ఉద్యమానికి పార్టీ అండగా నిలవాలి. ప్రతి జిల్లాలో పార్టీ ఇన్‌ఛార్జీలు నిత్య సంబంధాలు కొనసాగించాలి. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలి. స్థానిక పార్టీ శాఖలు లబ్ధిదారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఉభయ గోదావరి జిల్లాల పార్టీలు మరింత చొరవ ప్రదర్శించాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరింపజేయాలి. పార్టీ చొరవతో అన్ని పట్టణాల్లో సంఫీుభావ సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని రాష్ట్రంలో కూడా విస్తరించడానికి తోడ్పాటునందించాలి.
రాష్ట్ర సమితి ఇచ్చిన కార్యక్రమం (కర్తవ్యాలు) పూర్తిగా అమలు చేయడానికి సీపీఐ వ్యతిరేకులు సాగించే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. సమితి సమావేశాలు కావడంతోనే సీపీఐ వ్యతిరేకులు, కొంతమంది మీడియా ప్రతినిధులు పార్టీపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, పత్రికల నుండి వచ్చే రాజకీయ విమర్శలను సీపీఐ ఎప్పుడూ విమర్శించదు. బయట నుంచి వచ్చే విమర్శలే కాదు పార్టీలో వచ్చే అంతర్గత విమర్శలను సైతం చర్చల ద్వారా పరిష్కరించుకొని ఐక్యంగా కార్యక్రమం రూపొందించుకొనే అంతర్గత ప్రజాస్వామ్యం కమ్యూనిస్టులకున్నది. ఈ విషయాన్ని గ్రహించలేని మందబుద్ధులు లేనివి సృష్టించి కమ్యూనిస్టులను అభాసుపాలు చేయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయి. కమ్యూనిస్టు పార్టీ వీటికి ఎన్నడూ భయపడదు. వెనకడుగు వేయదు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, రాజకీయ ప్రత్యామ్నాయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img