Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉభయ భ్రష్టుత్వ ఊబిలో తెలుగు రాష్ట్రాలు!

వి. శంకరయ్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులకు బ్రేక్‌ వేశామనే ఆనందం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు మిగలలేదు. ముందు వెనుకగా పాలమూరు రంగారెడ్డి పథక నిర్మాణం నిలుపుదల చేయవలసి వస్తోంది. పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులు అంశంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటే తెలం గాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకాల అంశంలో పర్యావరణ ఉల్లం ఘనలకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఫలితంగా వచ్చే రెండేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే రెండు ప్రాంతాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చెన్నై బెంచి క్షేత్రస్థాయి పరిస్థితికి భిన్నంగా అఫిడవిట్‌ వేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి శిక్ష విధించే అంశంపై మీమాంస ఒక వేపు కొనసాగుతుండగా తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి పథకం గురించి ట్రిబ్యునల్‌ నియమించిన సంయుక్త కమిటీ తాజాగా ఇచ్చిన నివేదిక మరో వేపు తెలంగాణకు అశనిపాతంగా తయా రైంది. తాగునీటి కాంపొనెంట్‌తో సహా సాగునీటికి ఎత్తిపోతల పథక నిర్మాణం కొనసాగుతోందని పర్యావరణ చట్టాలు ఉల్లంఘించారని నివేదికలో స్పష్టం చేశారు. అంతేకాదు. ఎనిమిది పంపులు ఏర్పాటు చేశారని రోజుకు 2.07 టియంసిల నీరు 60 రోజుల్లో 120 టియంసిలు ఎత్తిపోసే విధంగా నిర్మాణం జరుగుతోందని ఈ నివేదికలో వుంది.
2016 సెప్టెంబర్‌ 21 వతేదీ అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరు రంగారెడ్డి పథకం కొత్త ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు లేవని గట్టిగా వాదించారు. అంటే ఈ పథకం విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో లేదని స్పష్టం చేశారు. కెసిఆర్‌ మాత్రం తమ వాటా నీళ్లు మాత్రమే ఈ పథకాలకు వాడుకుంటా మని జవాబు చెప్పి తప్పించుకున్నారు. ఆనాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇది కొత్త ప్రాజెక్టుగా తీర్మానం కూడా చేశారు. ఇది గతం.
2019లో ఎన్నికలు జరిగి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులకు జీవో జారీ చేయగానే అప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య చెడిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు వేదికలపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తింది. 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కెసిఆర్‌ పాలమూరు రంగారెడ్డి పథకం గురించి ఏ సమాధానమైతే చెప్పారో జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే జవాబు చెప్పారు. తమ వాటా నీళ్లు మాత్రమే తాము వాడుకుంటామని పైగా నీటి పంపిణి బాధ్యత బోర్డు చేతిలో వున్నందున అదనంగా తాము నీరు వాడుకొనేది లేదని వివరించారు.
ఎన్నివాదోపవాదాలు విమర్శలు పరస్పరం సంధించినా తెలంగాణ వేపునుండి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తలుపుతట్టకుండా ఈకేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్‌ కాకుండా వుండి వుంటే పాలమూరు రంగారెడ్డి పథకం ట్రిబ్యునల్‌కు ఎక్కేదేకాదు. వాస్తవంలో పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులు ఏ మేరకు జరిగి నిధులు ఎంత వ్యయం చేశారో ఏమో గాని తెలంగాణ మాత్రం పాలమూరు రంగారెడ్డి పథకంతో పాటు దిండి ఎత్తిపోతల పథకాలపై ఐదేళ్లుగా భారీ ఎత్తున నిధులు వ్యయం చేసింది. వాస్తవంలో ఇప్పటికీ తాగునీటి పథకం గానే తెలంగాణ చెబుతోంది. పరస్పరం కోర్టు మెట్లెక్కడంతో చెరపకురా! చెడేవు అన్నట్లు ఉభయ రాష్ట్రాలు ఉభయ భ్రష్టుత్వ ఊబిలో పడ్డాయి. ఈ కథ అంతటితో ఆగలేదు. కెసిఆర్‌ పరిభాషలో చెప్పాలంటే అంతా ఆగమాగమౌతోంది.
తాజాగా రెండు నదీ బోర్డులకు ఉభయ రాష్ట్రాలు ఒకరిపై మరొకరు సంధించుతున్న లేఖాస్త్రాలు పరిశీలించితే ఇప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య ఒక వేళ బోర్డుల పరిధి అధికారయుతంగా నోటిఫై చేసినా సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు పరిష్కారం నోచుకుంటాయనే నమ్మకం కలగడం లేదు. ప్రధానంగా అటు దక్షిణ తెలంగాణ ఇటు రాయలసీమ ప్రాంతాలకు చెందిన అనేక పథకాల నిర్మాణం స్థంభించిపోయే ప్రమాదం పొంచి ఉంది. తుదకు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పొందుపర్చిన పథకాలు వివాదాస్పదమౌతున్నాయి.
గోదావరి నదీ జలాల్లో ఎవరి వాటా ఎంతో తేలేవరకు (ట్రిబ్యునల్‌ ప్రతి పాదన వుంది) గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సీతారాముల ఎత్తిపోతలు తుపాకుల గూడెం మరి మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లు ఆమోదించ వద్దని గోదావరి నదీ యాజమాన్యం బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాసింది. శ్రీ రామసాగర్‌ కాళేశ్వరం దేవాదుల అన్ని ప్రాజెక్టులు బోర్డు అధీనంలోనికి తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తోంది. గోదావరి బేసిన్‌ నుండి కృష్ణ బేసిన్‌కు తెలంగాణ తరలించే నీటిలో తమకు వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది.
మరో వేపు తెలంగాణ తక్కువ తినలేదు. అయితే దాని వాదన స్వవచన విఘాతంగా చాలా చిత్రంగావుంది. ఉమ్మడిప్రాజెక్టులు తప్ప మిగిలిన ప్రాజె క్టులు బోర్డు అధీనంలోకి అక్కరలేదంటూనే ఉమ్మడి ప్రాజెక్టు కాకున్నా పెన్నాబేసిన్‌లోని బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కూడా బోర్డు అధీనంలో వుండాలని డిమాండ్‌ చేస్తోంది. పైగా గాలేరు నగరి పథకం ఆధునీకరణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని కృష్ణ బోర్డుకు లేఖ రాసింది. ఇంతకు ముందే రాసిన మరో లేఖలో హంద్రీనీవా ఎత్తిపోతలు పథకాలకు కూడా అనుమతులు లేవని, వీటినీ నిలుపుదల చేయాలనికోరింది. గమనార్హమైన అంశమే మంటే తమ వేపు వున్న కల్వకుర్తి నెట్టెంపాడు భక్త రామదాసు మాధవరెడ్డి పథకాలకు అనుమతులు లేవనే అంశం మరుగు పర్చుతోంది. మరీ తెలంగాణ జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ మురళీధర్‌ రాస్తున్న లేఖలు సాంకేతిక నిపుణుడు రాస్తున్నట్లు వుండటం లేదు.
ఇటీవల కెసిఆర్‌ దిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్‌ను కలసి పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనుల వలన దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుం దని ఫిర్యాదు చేశారు. కెసిఆర్‌ అందుబాటులో వున్న ప్రతి అవకాశాన్ని ఉప యోగించుకొంటున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు చట్ట నిబంధనలు విరుద్ధంగా వుండటంతో అన్నీ నిష్పలమౌతున్నాయి. కృష్ణ నదిపై వున్న ప్రాజెక్టులన్నీ అధికార యుతంగా బోర్డు అధీనంలోకి వెళ్లి వాటా మేరకు బోర్డు నీరు విడుదల చేస్తే ఎవరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా వృధా తప్ప ప్రయోజనం లేదు. కెసిఆర్‌ ఈ సింపుల్‌ సూత్రం ఎందుకు విస్మరించి ముందుగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఎక్కారో అవగతం కావడం లేదు.
ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేపుల పనులు స్థంభించిపోవడం ఖాయం. రాయలసీమ వాసులకు జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడితే కెసిఆర్‌ ఇప్పటివరకు వ్యయం చేసిన నిధులు ఎందుకూ కొరగాకుండా పోవడమే కాకుండా దక్షిణ తెలంగాణ ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులు చేపట్టే సమయంలో అదనంగా నీటి కేటాయింపులు అవసరం లేదని తెలుసు. కేవలం పర్యావరణ అటవీ అనుమతులే కాబట్టి ముందు జాగ్రత్త పడి వుంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. అదే సమయంలో కెసిఆర్‌ కూడా తొలి రోజుల్లో వాదించినట్లు ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు వేచి వుండి ఎవరి వాటా వారు వాడుకొనే పద్దతికి కట్టుబడి వుంటే పాలమూరు రంగారెడ్డి పథకాలతో పాటు దిండి పథకం చిక్కుల్లో పడేవి కావు. అంతిమంగా ఉభయ భ్రష్టుత్వం తప్పడం లేదు.
వ్యాస రచయిత విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img