Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఎగువ భద్రతో ఎడారి కానున్న రాయలసీమ

బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయకున్నా 29.5 టిఎంసి నీటిని వినియోగించుకోవడానికి అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ ద్వారా కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్ణాటక ఎగువభద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవు. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించడం రాయలసీమ నీటివనరులకు తీవ్రప్రమాదంగా మారింది. కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రెండు రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాల ప్రజలమధ్య వైషమ్యాలు సృష్టించడానికి కేంద్రం సిద్ధమైంది. మతాల మధ్య, ప్రాంతాల మధ్య నిరంతరం ఘర్షణలు రాజేసి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విధానం. నిత్యం కరువులకు గురవుతున్న రాయలసీమ జిల్లా ప్రజలకు కొంత మేరకైనా సాగు, తాగునీరు అందించే తుంగభద్ర ప్రాజెక్టుపైన నిర్మించే ‘ఎగువ భద్ర’ వల్ల రాయలసీమ ఎడారిగా మారనున్నది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుంది. రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ హడావుడి చేసిన ఆంధ్ర బీజేపీ నాయకులు మౌనముద్రలో వున్నారు. మన రాష్ట్ర నీటి వాటాను, ప్రభుత్వ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ‘అప్పర్‌ భద్ర’కు అనుమతులు, నిధులు ఇస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలపై పోరాడాల్సిన వైసీపీ, టీడీపీి తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయ పడుతున్నాయి. ప్రజలు ఇబ్బందికి గురైతే ప్రశ్నించడంతో ముందుంటానని ప్రతి సమావేశంలో జనసేనాని ‘అప్పర్‌ భద్ర’ పై ఎందుకని ప్రశ్నించరు? రాయలసీమ ఏమైతేనేమి! బీజేపీతో దోస్తీ చెడకుండా వుంటే మహాభాగ్యం అని ఈ పార్టీలు భావిస్తున్నాయి.
తుంగ, భద్ర నదులద్వారా వచ్చే నీటిని తుంగభద్ర డ్యామ్‌లో నిల్వచేసి అక్కడి నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం పంపిణీ జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతి నది పైభాగాన కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో ‘అప్పర్‌ భద్ర’ మేజర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్ర నదుల నుండి నీటిని తోడుకోవడం ద్వారా కర్ణాటకలోని వెనుకబడిన చిత్రదుర్గ, చిక్‌మంగళూరు, దావణగెరె, తుముకూరు జిల్లాల్లో దాదాపు 2,25,515 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో నికరమైన నీటిని ఈ జిల్లాలకు అందించడం, భూగర్భ జలాలను అభివృద్ధిచేయడం, తాగునీటికోసం 367 చెరువులను 50శాతం సామర్థ్యంతో నింపడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా రూ.21,473.67 కోట్లు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం, కేంద్రం ఆమోదించడం జరిగింది. కృష్ణా బేసిన్‌లో భాగంగావున్న తుంగభద్ర డ్యామ్‌పై దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రెండు దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 17.4 టీఎంసీలు, రెండవ దశలో 29.9 టీిఎంసీల నీటిని కర్ణాటక తుంగభద్ర డ్యామ్‌లోకి రాకుండా తోడేసు కుంటుంది. ఆ మేరకు దిగువనున్న హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, పోతిరెడ్డి పాడు, రాజోలిబండ డైవర్షన్‌స్కీమ్‌ కింద ఉన్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు పెట్టాయి. చట్టాలమీద, ప్రజాస్వామ్య వ్యవస్థమీద ఏమాత్రం గౌరవంలేని బీజేపీి ఏకపక్షంగా ‘అప్పర్‌ భద్ర’ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం తీసు కోవడం వెనుక కర్ణాటకలోని కరువు ప్రాంతాలను అభివృద్ధి చేయడంకంటే ఈ ప్రాజెక్టు గురించి నాలుగు జిల్లాల్లో ప్రచారం చేసుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందడమే ప్రధాన అంశంగా ఉంది.
అతీగతీ లేని రాయలసీమ ప్రాజెక్టులు
పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగడం లేదు. కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు ఉన్నా ప్రతియేటా రాయలసీమకు కరువు తప్పడంలేదు. ప్రభుత్వాల ప్రకటనలు, బూటకపు వాగ్దానాలకే పరిమితమయ్యారు. రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో సిద్దేశ్వరం అలుగు చట్టబద్ద నీటిహక్కులు సాధించేవరకు పోరాడాల్సిన అవసరంఉంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలోని అన్ని రైతుసంఘాలు, ప్రజాసంఘాల సమన్వయంతో ప్రజలను కలుపుకునే ఉద్యమం చేయాలి. సిద్దేశ్వరం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం. దాదాపు శతాబ్దంపాటు పాలకుల నిర్లక్ష్యానికి సజీవసాక్ష్యం. 1911-12 ప్రాంతంలో ఆంగ్లేయుల కాలంలో మెకన్‌ జి సిఫార్సుల మేరకు సిద్దేశ్వరం సర్వేచేసి నిర్మాణానికి అంగీకారం తెలిపారు. తదనంతరం 1958 ప్రాంతంలో భారత ప్రణాళిక కమిషన్‌ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రాయలసీమకు 18లక్షల ఎకరాలకు, నాటి తమిళనాడుకు 5లక్షల ఎకరాలకు మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరుఅందేలా దాదాపు 250టిఎంసిల సామర్ద్యంతో ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అదే జరిగి ఉంటే నేడు రాయలసీమకు 250 టిఎంసిల నికరజలాలు హక్కుగా మారి ఉండేది. సర్వతోముఖాభివృద్ధి జరిగేది. రాయలసీమకు నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అదే సందర్భంలో ఉన్న 133.7 టిఎంసిలలో కనీసం సగంనీటిని వాడుకోలేక పోతున్నాము. ప్రాజెక్ట్‌లవారిగా పరిశీలిస్తే.. 1.తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌కిఉన్న 32.5 టిఎంసిలలో 17,18 టిఎంసి లు వాడుకుంటున్నాము. 2.ఎల్‌ఎల్సీ 29.5టిఎంసిలలో 11 టిఎంసిలు మాత్రమే వాడుకుంటున్నాము. 3. కెసి కెనాల్‌కు 39.9టిఎంసిలు ఉండగా ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పి 50,60 టిఎంసిలు వాడుకున్నట్లు చూపి స్తున్నారు. కాని వాస్తవంగా 15 టిఎంసి లు మాత్రమే వాడు కుంటున్నాము. 4. బైరవాని తిప్ప 4.9 టిఎంసిలలో కేవలం 0.5 టిఎంసి లు వాడుకుంటున్నాము. 5. ఎస్‌ఆర్బీసీలో 19టీిఎంసిలు ఉన్నా అందులో ఉపయోగించుకుంటున్నది 7,8 టిఎంసిలు మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే సీమకు అధికారికంగా, హక్కుగా ఉన్న 133.7 టిఎంసిలలో మనం దాదాపు సగం అంటే 65 టిఎంసిలను వాడుకోవడంలేదు. దీని ఖరీదు వరిపంట అయితే కనీసం 5,6 లక్షల ఎకరాలు, అదే డ్రిప్‌ లాంటి వ్యవసాయం అయితే 13 లక్షల ఎకరాలు పంట నీటిని వాడుకోలేని పరిస్దితి. ఇవికాక శ్రీశైలంలోని క్యారి ఓవర్‌ క్రింద 60టిఎంసిలు, పట్టి సీమ నిర్మాణంద్వారా 45 టిఎంసిలు, పులిచింతల ద్వారా ఒప్పందం మేరకు 54 టిఎంసిలను మనం వాడుకోవాలి. అంటే దాదాపు 159 టిఎంసి ఇంకా రాయలసీమ వాడుకోవడానికి అవకాశంఉంది. అధికారికంగా ఉన్న 133.7 టిఎంసిలనే వాడుకునే ఏర్పాట్లు లేనపుడు ఇంకా అవకాశం ఉన్న 159 టిఎంసిలను ఎలా వాడుకోవాలి. రెండు కారణాల వలన సీమప్రాంతం నీటిని వాడుకోలేక పోతుంది. 1. నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లు తగినంతగా సీమలో లేవు. 2. అవకాశం ఉన్న శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తుకు నీటిని ఉంచకుండా 69 జీఓ ద్వారా 834 అడుగుల వరకు నీటిని కృష్ణా డెల్టాకు తీసుకు వెళ్లడం వలన సీమకు నీటి కష్టాలు వచ్చాయి. అందుకే జీఓ నెం.69ని రద్దుచేసి శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగులు ఉండేలా చూడాలి.
డా. యం.సురేష్‌ బాబు
ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు, సెల్‌:9989988912

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img