Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏడేళ్లుగా రోజుకు వందకోట్ల బ్యాంకు మోసాలు

నంటూ బెనర్జీ

స్టాక్‌ మార్కెట్‌లలో కొన్ని కంపెనీల షేర్లను అమానుషంగా ధర పెంచి వాటిపై భారీగా బ్యాంకు రుణాలు తీసుకోవడం ఎక్కువైంది. ఇలా తీసుకున్న రుణాలు లక్షలకోట్లలో ఉన్నాయి. అనేకమంది బడాబాబులు తీసుకున్న రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. చాలామంది దేశంలోనే ఉన్నారు. బ్యాంకులకు చెల్లించని రుణాలను పుస్తకాలలో సర్దుబాటుచేసి వాటిని నిరర్థక ఆస్థులుగా పరిగణించి రద్దు చేస్తున్నారు. ఇటీవల కుంభకోణానికి పాల్పడిన అదానీ గ్రూపు కూడా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం గత ఏడేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రోజుకు వందకోట్ల రూపాయల బ్యాంకు మోసాలు జరిపినట్లుగా రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించింది. ఆర్‌బీఐ బైటపెట్టలేని అంశాలు ఇంకాఎన్నో ఉన్నాయి. 2015 ఏప్రిల్‌ నుండి 2021 డిసెంబరు నాటికి 2.5లక్షల కోట్ల ఆర్థిక మోసాలు జరిగినట్లు గుర్తించారు. లిస్టెడ్‌ కంపెనీలు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాయి. అయితే రుణాలిచ్చే బ్యాంకులు, లేదా ఆర్థికసంస్థలు స్టాక్‌మార్కెట్లలో షేర్లు, ఆస్తులు నిజ విలువను తెలుసుకోవలసి ఉంటుంది. కంపెనీలకు భారీ మొత్తాలను రుణాలుగా ఇచ్చేసమయంలో బ్యాంకు నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఆస్తులు, షేర్ల ధరల అంచనాలను తప్పుగా వేసినట్లయితే అవి చివరికి ఆర్థిక నష్టాలకు గురిచేస్తాయి. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారా లేదా అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇలాంటి అంశాలను అలక్ష్యంచేసి రుణాలు పొందేవారితో కుమ్మక్కయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
షేర్ల ధరలు కొనుగోలుకు, సంపాదనకు మధ్య నమ్మలేనంత ఎక్కువగా తేడా ఉంటుంది. పెంచిన ధరమీదే రుణాలు ఇస్తున్నారు. ఇలాంటి రుణాలే అత్యధిక సమస్యగా మారుతుంది. రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులు అమాంతం పెంచిన షేర్ల ధరలను పట్టించుకోకుండా తాకట్టుపెట్టుకుని రుణాలు ఇస్తున్నందునే అవి అర్థికమోసాలకు గురవుతున్నాయి. షేర్ల ధరలను సక్రమంగా అంచనా వేయకపోవడం అనేది చాలా ప్రాధాన్యతగల అంశం. ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడానికి తగినంత విలువైన ఆస్తిని తాకట్టుపెట్టుకోవడం అవసరం. మన స్టాక్‌మార్కెట్‌లలో దాదాపు 18 లిస్టెడ్‌ కంపెనీలు అధికవిలువకు షేర్లను తాకట్టుపెట్టుకుని రుణాలను మంజూరుచేసే లాంటి కంపెనీలలో అదానీ కంపెనీ ఒక్కొక్క షేరు ధరను అమాంతం 254రూపాయల విలువగా పెంచినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కసారి 100నుంచి 200వరకు అధిక విలువను వేసినట్టు సమాచారం. అయితే అదానీ కంపెనీల షేర్లు అత్యధికంగా దిగువస్థాయికి పడిపోయాయన్న సమాచారం ఉంది.
గత ఏడాది పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయమంత్రి బ్యాంకులు 11.17లక్షలకోట్ల రుణాలను గత ఆరేళ్లకాలంలో అంటే 2021`22 ఆర్ధిక సంవత్సరంనాటికి రద్దు చేసినట్లు వెల్లడిరచారు. అంతక్రితం 5ఏళ్ల కాలంలోనే షెడ్యూల్డ్‌ వాణిజ్యబ్యాంకులు 10.09లక్షల కోట్లు రద్దు చేసినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. ప్రజల కష్టార్జితం బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు. వీటిపై ఇచ్చే అతి తక్కువ వడ్డీని ఆసరా చేసుకుని జీవనం సాగిస్తారు. అలాంటి నిధులను బ్యాంకులు, దోపిడీదారులు కలిసి ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారు. ఎగవేత దారుల పేర్లనుకూడా చెప్పకుండా దాచేస్తున్నారు. ఇంతవరకు ఎంతమంది బకాయిలు చెల్లించకుండా ఉన్నారనేది ప్రజలకు తెలియదు. పార్లమెంటులో ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌కిషన్‌ రావ్‌ కరాడ్‌ లోక్‌సభలో మాట్లాడుతూ ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులకు రుణాలు చెల్లించ కుండా ఎగవేసినవారి పేర్లను వెల్లడిరచడంలేదని, వారి ఆస్తులను మాత్రమే వేలం వేస్తామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారమే బ్యాంకులను దోపిడీ చేస్తున్నప్పటికీ బ్యాంకులను నియంత్రించే వారులేదా ప్రభుత్వం కనీసం ఈ అంశంపై మాట్లాడే దాఖలాలులేవు. ప్రతి సంవత్సరం వేలు, లక్షలకోట్లు బ్యాంకులను మోసగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నష్టాలను ప్రజలే అనుభవిస్తున్నారు. కావాలని బ్యాంకులను మోసగిస్తున్నారా లేక నిజంగానే నష్టాలు వస్తున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించడంలేదు. పైగా ప్రభుత్వం అలాంటివాళ్లనే ప్రోత్సహించడం మనం చూస్తున్నాం.
అత్యధికంగా మోసాలు జరిగింది ప్రభుత్వరంగ బ్యాంకులలోనే. ప్రభుత్వరంగ బ్యాంకులలో ఉన్నతస్థాయి యాజమాన్యం మోసకారులపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా కనిపించదు. ప్రైవేటురంగ బ్యాంకులతో పోల్చుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం చాలా అలక్ష్యంగా కనిపిస్తుంది. ఎస్‌ బ్యాంకు సహ వ్యవస్థాపకులు రాణాకపూర్‌ 466.51కోట్లు మోసానికి పాల్పడ్డారని సీబీఐ చార్జిషీటు దాఖలుచేసి ఆయనను అరెస్టు చేసింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు మానేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌ ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను, వీడియోకాన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ థూత్‌ను ఆర్థిక అక్రమాలపై ఛార్జిషీటు పెట్టి సీబీఐ అరెస్టు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులను కోట్లాదిరూపాయలు నష్టపరచిన వారిని, వారికి సహకరించిన వారిని గుర్తించి సీబీఐ, ఈడీ అధికారులు కేసులు నమోదుచేసి విచారణ జరిపి ఉండవలసింది. అయితే బ్యాంకులను మోసగించి ఈ దేశం నుంచే పారిపోయిన తర్వాత ఈ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. 30మందికిపైగా దోపిడీదారులు విదేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, నిషాల్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సి, నితిన్‌ ధే సందేసర, దీప్తి చేతన్‌కుమార్‌ లాంటి వారు దేశం నుంచిపారిపోయిన వారిలో ఉన్నారు. బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడంలో వీరు ఎలాంటి నియమ, నిబంధనలను పాటించలేదు. బ్యాంకులు కూడా ఆ నియమాలను పాటించకుండానే రుణాలు ఇవ్వడమే నేటి దుస్థితికి కారణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img