Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏ.పీ సాహిత్య అకాడమీ జాడ ఎక్కడ?

తెలుగునాట ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగ శ్రవణాలు, కవుల పురస్కారాలు, కవి సమ్మేళనాలు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. కవులు, రచయితలకిచ్చే పురస్కారాల స్థానంలో రాష్ట్రప్రభుత్వం తనదైన పంధాను సృష్టించుకునేందుకు వలెంటీర్లకు ఇవ్వడం మొదలుపెట్టింది. తత్ఫలితంగా రాష్ట్రంలోని కవులలో, రచయిత లలో ఒకవిధమైన నిస్పృహ నెలకొన్నది. రెండేళ్ళక్రితం ఆర్భాటంగా ఏ.పీి సాహిత్య అకాడమీని నెలకొల్పి దానికి సాహిత్యేతర వ్యక్తి అయిన పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మీని చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. కనీసం ఈ రకంగానైనా తెలుగునాట సాహిత్యం వెల్లివిరుస్తుందన్ని అందరూ ఆశించారు. కాని ఆశించినస్థాయిలో కాదుకదా, కనీసం ఏపీ సాహిత్యఅకాడమీ ఒక్క కార్య క్రమం కూడా నిర్వహించకుండా పేరుకే పదవి భర్తీ అయితే జరిగింది తప్పించి వనగూడే ప్రయోజనం మాత్రం సున్నా. అసలు అకాడమీ చైర్మన్‌ ప్రస్తుతం కొన్ని నెలలుగా ఏ కార్యక్రమంలో కనబడకపోవడంతో అసలు ఏ.పీ సాహిత్య అకాడమీ ఉన్నదా, లేదా అన్నది అర్థం కాకుండా ఉన్నది. ప్రస్తుతం పనిచేస్తున్న కనిపిస్తున్న ‘తెలుగు అకాడమీ’ అయినా పురస్కారాల బాధ్యత తీసుకుంటున్నట్లు కనబడినా అదీ మొక్కుబడిగానే ఉగాది ముందురోజు, ఏమాత్రం పారదర్శకత లేకుండా తూతూ మంత్రంగా జరుపుతున్నది తప్పించి, గత ప్రభుత్వహయాంలో జరిగినట్లు హుందాగా, గౌరవప్రదంగా అందరి సమక్షంలో జరగట్లేదన్నది పచ్చినిజం. అదీకాక గతంలో ఉగాది పురస్కారాలుపొందిన వారికే మళ్ళీ, తమకు నచ్చినవారిని ఎన్నికచేసి సత్కరించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. భాషా సాంస్కృతిక సంస్థ ఉన్నప్పటికీ అదీ ఏమీ చేపట్టేరీతిలో పని చేయడంలేదు. జిల్లాస్థాయిలో ఉగాది వేడుకలు గతంలో కలెక్టర్ల నిర్వహణలో జరిగేవి. కనీసం జిల్లాస్థాయిలో అయినా కవి సమ్మేళనాలు, కవుల సత్కారాలు జరిగేవి. అవీ అక్కడక్కడే తప్పించి సంపూర్ణంగా జరుగటం లేదు. మన సంస్కృతీ, సాంప్రదాయాలను ఏదో వెలగబెడుతున్నామని ప్రకటనలు ఇప్పించుకోవడం తప్పించి నిజమైన ఉత్సవాలను ప్రభుత్వంపరంగా నిర్వహించడంలేదన్నది అక్షర సత్యం. ఇప్పటికైనా ప్రభుత్వంమేల్కొని ఆయాశాఖల ద్వారా తెలుగు పండుగైన ఉగాది నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కవులను, రచయితలను సత్కరించుకొనే సత్‌ సాంప్రదాయాన్ని నిలబెట్టవలసిందిగా ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ద్వారా రచయితలు, కవులు కోరుతున్నారు.
చలపాక ప్రకాష్‌,
ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం, ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img