Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కంపెనీలకు ధనరాసులు-రైతులకు కన్నీరు

 అధిక ధిగుబడులు వస్తాయనీ, గులాబీరంగు పురుగు బెడద తప్పుతుందనీ 2002లో బీటీ పత్తిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రైతులకు తాత్కాలికంగా ఉపయోగపడిరది. మోన్సాంటో లాంటి కంపెనీలకు లాభాల పంట పండిరది. కాలం గడిచేకొద్దీ, బీటీ పత్తి వలన రైతులకు ప్రయోజనం లేకపోగా పురుగు బెడద విషమించింది. పురుగు మందుల ఖర్చు ఎక్కువైంది. 2002లో హెక్టారుకు 100 కేజీల పురుగుమందుల వాడకం 2013 నాటికి 220 కేజీలకు పెరిగింది. అయినా పురుగులు అదుపులోకిరాక పంట సగటు దిగుబడి హెక్టారుకు 554 కిలోలనుండి 445 కిలోలకు తగ్గి, పత్తికి ధరలేక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బీటీ పత్తి విత్తనాలలో లాభాలను రుచిమరిగిన మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు మానవులందరూ తినే కూరగాయలు, ఆహారధాన్యాలలో బీటీ ప్రవేశపెట్టి అధిక లాభాలనార్జించాలని కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నిబంధనలను పక్కనపెట్టి బీటీ వంకాయ, బీటీ బెండపై గుంటూరు జిల్లా నారాకోడూరులో 2005లో ప్రయోగాలను చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజాసంఘలు, మీడియా చేసిన ఆందోళన ఫలించి ఆ ప్రయోగాలను ప్రభుత్వం ఆపక తప్పలేదు. బీటీ వంకాయపై మారటోరియం విధించారు.

మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహార పంట-ధారా మస్టర్డ్‌ హైబ్రిడ్‌-11(ఆవాలు): ఇప్పుడు జన్యుమార్పిడి ఆవాలను ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ(ఎంఓఇఎఫ్‌సీ) కింద పనిచేసే జనిటెక్‌ ఇంజనీరింగ్‌ మదింపు కమిటీ జన్యుపరంగా మార్పుచేసిన బీటీ ఆవాలకు 2022 అక్టోబర్‌ 25న అనుమతించింది. భారత శాస్త్రవేత్త దీపక్‌ పెంటెల్‌, ప్రభుత్వ నిధుల సహాయంతో ‘‘ధారా మస్టర్డ్‌ హైబ్రిడ్‌-ణవీన-11’’ విత్తనాలను అభివృద్ధి చేశారు. ఆవ మొక్క ఒక్క పువ్వులోనే మగ స్టేమెన్‌-ఆడ పిస్టిల్‌ ఉండటంవలన ప్రకృతిలో సహజసిద్ధంగా సంపర్కం తేలికగా జరుగు తున్నది. కొత్త జన్యువులను పువ్వులో చొప్పించటానికి ‘‘బార్‌-బార్నేస్‌-బార్‌ స్టార్‌’’ సాంకేతికతను ఉపయోగించారు. బార్నేస్‌ పద్ధతివలన మొగ స్టేమెన్‌ను నిర్వీర్యంచేసి, బార్‌స్టార్‌ పద్ధతితో భూమి నుండి సేకరించిన బాక్టీరియా బేసిల్లస్‌ ఆక్వాఫిసియన్స్‌ జన్యువును చొప్పించి ఆడ పిస్టిల్‌ను ఉత్తేజపరచి, సాంప్రదాయ ఆవాలమొక్క అయిన వరుణ జన్యువుతో సంకరం చేశారు. హెర్బిసైడ్‌ రెసిస్టెంట్‌ కలుపుమందును తట్టుకునేటట్లుగా బార్‌ జన్యువును ప్రవేశపెట్టారు. జన్యుమార్పిడి విత్తనాలే కాకుండా స్ధానిక ‘‘వరుణ’’తో సంకరం వలన అధిక దిగుబడులు లభిస్తాయం టున్నారు. హెర్బిసైడ్‌ టాలరెంట్‌గా జన్యుమార్పిడి చేసినందున పొలంలో కలుపుతీసే పనిలేదంటున్నారు.
హెర్బిసైడ్‌ టాలరెంట్‌ అంటే కలుపు మందును తట్టుకునేవిధంగా జన్యువు లను మార్చటం. కలుపుమందు చల్లితే ఈ జన్యుమార్పిడి ఆవాలపంట మాత్రమే బతుకుతుంది. కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి. ధారా మస్టర్డ్‌ హైబ్రిడ్‌ డిఎంహెచ్‌-11 కు బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగుచేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు. రాజస్ధాన్‌, పంజాబ్‌, హర్యానా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో 100చోట్ల ప్రయోగాలను ఐ.సీ.ఏ.ఆర్‌ నిర్వహించాలన్నారు. జీఎమ్‌ ఆవాల అనుమతి, దేశంలో తీవ్రమైన చర్చనీయాంశమయింది. జన్యుపరంగా మార్పుచెందిన ఆవాలపంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంటలో వచ్చిన తేనెను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్‌ హెర్బిసైడ్‌ కలుపుమందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున తమ బతుకు బజారున పడుతుందని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది మనకు రూ.75,000 కోట్లు ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది.
జీఎమ్‌ ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజపంట ఆవాలు. సుప్రీంకోర్టు స్టే అరుణా రోడ్రిగ్జ్‌, కవితా కురుగంటిలాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ(2013) జన్యుమార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీల ఏకగ్రీవ నివేదికలు జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి. భారతదేశంలో హెర్బిసైడ్‌ టాలరెంట్‌ అంటే కలుపుమందులను చేలో చల్లితే తట్టుకునే పంటలు పనికిరావని కమిటీ చెప్పిందన్నారు. హెర్బిసైడ్లు అంటే కలుపు నివారణ మందులు కాన్సర్‌కు కారణమవుతాయని కూడా కమిటీ అభిప్రాయపడిరది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవవైవిధ్యంపై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్‌ అంటే కలుపు మందులువాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్ధిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంత భూషణ్‌ నివేదించారు.
ప్రజారోగ్యం, పర్యావరణంపై రహస్య నివేదికలకు బదులుగా స్వతంత్ర నిపుణుల సంస్ధలు నిర్వహించే సమగ్రమైన, పారదర్శకమైన, నిజాయితీతో వాస్తవ అంశాలతో కూడిన బయోసేఫ్టీ రిపోర్టును జీఈఏసీ బహిరంగ పరచాలన్నారు. జన్యు మార్పిడి ఆవాల విత్తనాలపై యధాస్ధితిని కొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారంలో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టేముందు అందరికీ తెలిసేట్లుగా క్షేత్రప్రయోగాలు భారీఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. రహస్య నివేదికలే తప్ప బహిరంగ రిపోర్టులు లేవు. కనీసం ఇంటర్నెట్‌లో కూడా పెట్టలేదు. తేనెటీగలు, తేనెపై బతికే వారి సమస్యలే కాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవనూనె వాడినందువలన మనుషులపై, తాగేనీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై ప్రభావం ఏమిటో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలు జరగాలి. శాస్త్రీయ పరిశోధనలతో నిర్ణయించవలసిన ఆహారభద్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్రరాజ్యాల వత్తిడికి లొంగి నిర్ణయం చేయటం మన దేశ స్వతంత్య్రాన్ని అమ్ముకోవటమే. జీఎమ్‌ విత్తనాలు కంపెనీలకు అపార లాభాలను, రైతులకు కన్నీటిని మిగిలిస్తాయి.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతుసంఘం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img