Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కారల్‌ మార్క్స్‌కు నివాళి!

గుంటూరు జేకేసీ కాలేజీలో 1970-71-72 సంవత్సరాలలో డిగ్రీ చదివే రోజుల్లో ఏఐఎస్‌ఎఫ్‌ లో పనిచేసే అవకాశం కలిగింది. ఇప్పటి సీపీఐ నారాయణ ఆరోజుల్లో మా నాయకుడు. చాలా నిబద్దతతో, స్పష్టత, మానసిక నిజాయతీతో పనిచేసేవాళ్ళం. అందుకు ఇప్పుడూ గర్విస్తూ ఉంటాను. తరువాత 1980 ప్రాంతంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా ఏలూరు వెళ్లిన తరువాత, సీపీఐతో రీకనెక్ట్‌ అయ్యాను. అక్కడ డీవీవీఎస్‌ వర్మ గారి శిష్యరికం లభించింది. అవే విలువలతో బతకడానికి ఆయన సాహచర్యం దోహదం చేసింది. అలా, హృదయాంత రాళాల్లో కమ్యూనిస్ట్టు పక్షపాతం అలా ఓపక్కన సజీవంగా ఉండిపోయింది. అదలా ఉంచుదాం! ఈమధ్య ఓనెలరోజులు లండన్‌లో గడపడానికి రమ్మని మాఅబ్బాయి పిలిస్తే మే 3న లండన్‌ వచ్చాను. ఈ విషయాన్ని వర్మ గారికి చెప్పాను. లండన్‌లో కారల్‌ మార్క్స్‌ సమాధి ఉంది, వీలైతేచూడు అన్నారు. అసలు అంతకు మించిన సంతోషం ఏముంటుంది. ఒక్కసారిగా గతస్మృతులతో మనసంతా నిండిపోయింది. కానీ, మార్క్స్‌ సమాధి ఉన్న ‘‘హై గేట్‌’’ సిమెట్రీ మేము ఉండే ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం. రెండు మెట్రోరైళ్లు మారి, చివరికి క్యాబ్‌లో వెళ్ళాము. ఆ సిమెట్రిలో దాదాపు 50 వేలకు పైగా సమాధులు ఉన్నాయి కానీ, మార్క్స్‌ సమాధి సందర్శనకు మాత్రమే ప్రవేశ రుసుము ఉన్నది. హైగేట్‌ శ్మశానవాటిక నిర్వహణ కోసం రెండు ట్రస్టులు ఉన్నాయి. మొత్తం శ్మశాన వాటిక నిర్వహణ బాధ్యతను ఒక ట్రస్టు నిర్వహిస్తున్నది. వారు ప్రవేశరుసుము వసూలు చేయరు. కారల్‌ మార్క్స్‌ సమాధి నిర్వహణ బాధ్యతను బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ఒకట్రస్టు చూస్తుంది. మార్క్స్‌ సమాధిని సందర్శించే వారి నుండి వసూలుచేసే సొమ్ము ట్రస్టు ఖాతాకు జమ అవుతుంది. ట్రస్టు చేపట్టే కార్యకలాపాలకోసం ఆ సొమ్మును వినియోగిస్తారు. నిఔూRఖజుRూ ూఖీ Aూూ ూAచీణూ ఖచీIుజు అన్న కారల్‌ మార్క్స్‌ సుప్రసిద్ధ నినాదం బంగారు రంగు అక్షరాలతో ఆయన నిండైన విగ్రహం కింద చెక్కారు. కారల్‌ మార్క్స్‌ విగ్రహాన్ని దగ్గరినుంచి చూడగానే, చిన్నపాటి ఉద్వేగానికి లోనయ్యాను. విగ్రహంముందు నిలుచుని రెడ్‌శాల్యూట్‌ చెప్పాను. అయితే అక్కడ ఓ అయిదునిమిషాలు కూర్చోవ డానికి ఏర్పాటు లేదు. సమాధి చుట్టూ గడ్డి గాదం, ఎండుటాకులు పడి ఉన్నాయి. సమాధి పరిసరాలను శుభ్రం చేసిన దాఖలా కనిపించలేదు. సమాధి నిర్వహణ బాధ్యత చూస్తున్న ట్రస్టు వారికి ఈవిషయాన్ని మెయిల్‌ ద్వారా తెలియచేయాలని అనుకున్నాను. నా జీవితానికి అద్భుతమైన క్లైమాక్స్‌ -మార్క్స్‌ స్మృతిచిహ్నం సందర్శన. వర్మగారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ మార్క్స్‌ స్మృతిచిహ్నం వద్ద పదినిముషాలు గడిపాను.
భోగాది వెంకటరాయుడు, సీనియర్‌ పాత్రికేయుడు, లండన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img