Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్పొరేట్ల దోపిడీ వేగం

బుడ్డిగ జమిందార్‌

2020 సంవత్సరం నుండి ఒక వైపు కఠిక దారిద్య్రంలోకి జారి పోతున్న ప్రజానీకం మిలియన్ల కొద్దీ పెరుగుతుంటే, శత కోటీశ్వరుల సంఖ్య, వారి ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ ఆర్థిక అసమానతల నివేదిక తెలియ జేసింది. ఏటా దావోస్‌లో ప్రపంచ శత కోటీశ్వరుల, కార్పోరేట్ల, ప్రభుత్వ అధికారుల, పాలకుల సమావేశం ‘ఎకనమిక్‌ ఫోరం’ పేరిట జరుగుతూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల తర్వాత ఈ నెల 22న ప్రారంభమైన ఆర్థిక సదస్సు 26 వరకూ జరుగుతుంది.
ప్రపంచంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుకొంటున్న కారణం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, తద్వారా ప్రపంచంలో 26 కోట్ల ప్రజానీకం తీవ్ర దారిద్య్రానికి లోనవుతున్నారని, ఇదే సమయంలో ప్రపంచ శత కోటీశ్వరుల సంపద 30 శాతం పెరగటమేగాక నూతనంగా శతకోటీశ్వరులు పెరుగుతున్నారని గ్లోబల్‌ ఛారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్‌ రాసింది. ఆహారోత్పత్తుల ధరలు, ఇంధనం విపరీతంగా పెరగటం, దీనికి తోడు మహమ్మారి శత కోటీశ్వర్లుకు వరంగా మారి భారీగా సంపదను సృష్టించుకొన్న సందర్భంలో వేడుకలు చేసుకోటానికి దావోస్‌ పర్వతశ్రేణుల దగ్గరకు వచ్చారని ఆక్స్‌ఫామ్‌ అంటోంది. ఇదివరలో కటిక దారిద్య్ర నిర్మూలనకు చేసిన ప్రయత్నాలన్నీ వెనుకడుగు వేస్తున్నాయని, పెరిగిన ధరలకు పేదరికం విలయ తాండవం చేస్తోందని ఆక్స్‌ఫామ్‌ తెలియజేసింది. ప్రపంచంలో కొన్ని దేశాల ప్రజల ఆదాయంలో 50 శాతం పైగా ఆహారానికి ఖర్చు చేస్తుంటారు. ఇటువంటి కుటుంబాల వారు పెరిగిన ధరలతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి గెంటివేతకు గురవుతున్నారు. ఆహారోత్పత్తుల ధరలు ఈ సంవత్సరంలో 23 శాతం పెరుగు తాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. కానీ, 2021 ఏప్రిల్‌ నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌ నెల ధరలు 34 శాతం పెరిగాయని ఎఫ్‌.ఎ.ఒ (ప్రపంచ ఆహార సంస్థ) ఆహార ధరల సూచీ తెలియ జేసింది. అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకొనే అమెరికాలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు 9 శాతం, మాంసం 20 శాతం హెచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల ఆదాయంలో 10 శాతం వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు ఖర్చు చేస్తుం టారు గనుక ధరల పెరుగుదల ప్రభావం అంత తీవ్రంగా ఉండక పోవచ్చునుగాక. అంతర్జాతీయ గోధుమ ధరలు 40 శాతం పైగా పెరగటంతో ఆకలి బాధితుల సంఖ్య కూడా తదనుగుణంగా పెరుగుతున్నది. ఐ.రా.స. ప్రపంచ ఆహార ప్రణాళిక నివేదికలో ప్రస్తుతం ప్రపంచంలో 81.1 కోట్ల జనాభా (ప్రతీ 7గురులో ఒకరు) ఆకలితో నిద్రపోవల్సి వస్తోందని ప్రస్తావించింది. వీరిలో సగం మంది మృత్యువుతో పోరాడవల్సి వస్తోందని తెలిపింది. దీనికి గల ప్రధాన కారణాలుగా యుద్ధాలువలసలు, వాతావరణ మార్పుతో సంభవిస్తున్న భూతాపం వలన పంటలు సక్రమంగా పండకపోవటం, విఫలం చెందుతున్న పాలకుల ఆర్థిక విధా నాలతో పాటు కోవిడ్‌ మహమ్మారి అని చెప్పవచ్చును. రైతన్నకు గిట్టుబాటు కాని వ్యవసాయం, ఆర్థిక అసమాన తలు, వర్షాలకు కారణమైన మానవ ఊపిరితిత్తులుగా పేరొం దిన అమెజాన్‌ అడవుల నరికివేత కూడా వ్యవసాయ రంగానికి శాపంగా తయారై ప్రపంచ ఆహార భద్రతకే ముప్పు వాటిల్లు తున్నది.
ఆక్స్‌ఫామ్‌ తన సూచనలలో ఆర్థిక సంక్షోభం తగ్గటానికి, ఆహార భద్రతకు కార్పొరేట్లపై అదనపు టాక్సులు వేయాలని పేర్కొంది. ఈ పన్నుల ద్వారా అసమానతలు కొంతవరకైనా తగ్గి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశాలుంటాయని సూచించింది. తద్వారా పౌష్టిక ఆహారం అందచేయొచ్చని, ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రభుత్వాలు చర్యలు గైకొనాలని వివరించింది. అయితే ప్రభుత్వాలు అందుకు భిన్నంగా చర్యలు గైకొంటున్నాయి.
2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్దీపన చర్యల్లో బ్యాంకులకు లక్షలాది కోట్ల డాలర్లను ఇచ్చింది. కార్పోరేట్ల పన్నులు తగ్గించి ప్రజల నెత్తిన నూతన పన్నుల భారాన్ని మోపింది. అవసరమైనప్పుడల్లా కరెన్సీ నోట్లను అధి కంగా ముద్రించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి ఇదే కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోవిడ్‌ కాలంలో అమెరికా ప్రకటించిన రాయితీల ద్వారా కార్పోరేట్‌ ఆదాయాలు 65 శాతం పెరిగాయి. కానీ, సామాన్య ప్రజలకు పెరిగిన వేతనాలు ఒక అంకెకు మించలేదు, సరికదా ఉన్న ఉద్యోగాలు ఊడటం, పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకోవటమో జరుగుతుంది. మన దేశంలో కూడా ఇదే పరిస్థితుల్లో కార్పొరేట్‌ శక్తులు లబ్ధి పొందాయి. కోవిడ్‌ కాలంలో మనదేశ శత కోటీశ్వరుల ఆదా యాలు, ఆస్తులు 39 శాతం పెరిగాయి. కానీ అదే సమయంలో మన జీడీపీ 8 శాతం ప్రతికూల స్థాయికి పడిపోయింది. దేశంలో అధికారికంగా ద్రవ్యోల్బణం 8 శాతానికి, నిరుద్యోగం 9 శాతానికి పడిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ వాస్త వానికి కనీసం అంతకు రెండంతలు పెరిగి ఉంటాయని నిపు ణులు అంచనా వేస్తున్నారు.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
నాయకులు, 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img