Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్పోరేట్‌ సంస్థల భస్మాసుర హస్తం!

భారతదేశం నేటికీ వ్యవసాయక దేశమే. 69శాతం దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మూడిరట రెండువంతుల జనాభా జీవనాధారం వ్యవసాయం. దేశ ప్రజల ఆహార పంటలైన వరి, గోధుమ, నూనె గింజలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు పండిరచి ప్రజల ఆహార అవసరాలు తీరుస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వేలాదిమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కారకులు ఎవరు. వలస పాలన అంతమయ్యాక బడా బూర్జువా భూస్వామ్య వర్గ ప్రతినిధులైన భారత పాలకులు స్వతంత్ర వ్యవసాయ విధానాలు అమలు జరపకుండా సామ్రాజ్యవాదుల, భూస్వాములఅనుకూలమైన విధానాలు అమలు జరుపుతూ వచ్చారు. ఫలితంగా ఆహార ధాన్యాలకు తీవ్రకొరత ఏర్పడి అవమాన కరమైన పియల్‌ 480 ఒప్పందం చేసుకుని అమెరికా నుండి ముక్కిపోయిన గోధుమలు దిగుమతి చేసుకున్నారు తప్ప వ్యవసాయ విధానాన్ని మాత్రం మార్చుకోలేదు. ఫలితంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రతరమైంది.
ఇలాంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల దోపిడీ ప్రయోజనాలకోసం దేశంలో హరిత విప్లవం ప్రారంభించాలని ప్రపంచ బ్యాంకు ఇచ్చిన సూచన మేరకు 1966-70 మధ్య భారత ప్రభుత్వం హరిత విప్లవం ద్వారా అధిక ఉత్పత్తిని సాధిస్తానని ప్రకటించింది. హరిత విప్లవం వలన అధికఉత్పత్తి జరిగినా సేద్యవిధానంలో తీవ్రమార్పులు చోటు చేసుకున్నాయి. సాంప్రదాయ ఎరువుల వినియోగంస్థానే రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమైంది. విదేశాల నుంచి ఎరువుల దిగుమతి ప్రారంభమైంది. విదేశీ విత్తనాలద్వారా కొత్త తెగుళ్లు దేశంలోకి దిగుమతి అయ్యాయి. వాటి నివారణకు పురుగు మందుల వాడకం వాటి దిగుమతి ఏర్పడిరది. రసాయనిక ఎరువుల వాడకానికి రైతాంగాన్ని మళ్లించేందుకు ఎరువులపై రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు భారత ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గ్రాంట్‌ రూపంలో ఆర్థికాన్ని సహాయాన్ని అందచేసింది.
హరిత విప్లవ పర్యావసానం రసాయనిక ఎరువులవాడకం, విదేశీ విత్తనాలు, కొత్త తెగుళ్ల దిగుమతి, ప్రమాదకర పురుగు మందుల వాడకం. రసాయనిక ఎరువులకు వినియోగం రైతాంగానికి తప్పనిసరిచేసిన తర్వాత ప్రపంచబ్యాంకు ఎరువులపై సబ్సిడీని విరమించింది. భారత పాలకులు ప్రపంచబ్యాంకు వత్తిడి మేరకు స్వదేశీ ఎరువుల ఉత్పత్తి సరళీకరణ, రుణాలు, విద్యుత్‌, నీటి పారుదల రంగాల్లో సబ్సిడీలు ఎత్తివేశారు. దీని పర్యావసానంగా దేశీయ మార్కెట్లను బహుళజాతి సంస్థలు కైవసం చేసుకున్నాయి ఆచరణలో హరిత విప్లవం సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల ఎరువుల, విత్తనాల, పురుగు మందుల వ్యాపారానికి దోహద పడిరది. ప్రపంచబ్యాంకు, అమెరికా కోరుతున్నది అదే. దాన్ని భారత ప్రభుత్వం నెరవేర్చింది. భారత పాలకుల సామ్రాజ్యవాద అనుకూల విధానాలు, వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థల ప్రవేశం వలన ఎరువులు, విత్తనాల, పురుగు మందుల ధరలు పెరిగాయి. దళారుల దోపిడీ, పంటలకు న్యాయమైన ధరలు లభించక పోవటం, చిన్న, సన్నకారు రైతులకు రుణాలు అందక పోవటం వలన రైతాంగ సేద్యం సంక్షోభ దిశకు మళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో 1990లో ఉదారవాద, సరళీకరణ ఆర్థికవిధానం దేశంలో అమలు ప్రారంభమైంది. సామాజిక, ఆర్థికవిషయాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గుతూ రావటం, దాని స్థానంలో మార్కెట్‌ ప్రాధాన్యత పెరిగిన ఫలితంగా వ్యవసాయరంగానికి ప్రభుత్వ ప్రోత్సాహకత తగ్గింది. బహుళజాతిసంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగంపై ఆధిపత్యం పొందాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్లపరం చేయటం మినహా మరోమార్గం లేదనే స్థితికి సేద్యాన్ని నెట్టారు. స్వేచ్ఛా వాణిజ్యమనే నినాదంతో బహుళజాతి సంస్థలు, వెనుకబడిన దేశాల వనరులను కొల్లగొట్టడం జరుగుతుంది. వ్యవసాయ కార్పొరేటీకరణ అందులో భాగమే. కార్పొరేట్‌వ్యవసాయం రైతుల ప్రయోజనాలకన్నా, బడా వ్యాపారస్తుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ప్రజల అవసరాల కంటే లాభాలకు ప్రాధాన్యత నిస్తూ పేదల, సన్నకారు రైతులను బలిగొంటుంది.
దేశ పాలకులు, ముఖ్యంగా మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అన్న అభిప్రాయాన్ని రైతాంగంలో కలుగచేసి చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్లకు అమ్ముకోవటమో లేదా కార్పొరేట్‌ వ్యవసాయానికి ఇచ్చి, వారివద్ద కూలీలుగా మారాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతులకు బోధిస్తున్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అందులో భాగమే. రైతాంగ ఉద్యమ ఫలితంగా వాటిని రద్దుచేసినా పరోక్ష పద్ధతుల్లో వాటిని అమలు జరిపే ప్రయత్నాలు విడనాడలేదు. చిన్న కమతాల్లో వ్యవసాయం నష్టదాయక మని, సేద్యంలో ఉత్పత్తి పెరగటానికి భూమి విస్తీర్ణత ఎక్కువగా ఉండాలని, అందుకు కార్పొరేట్‌ వ్యవసాయం శరణ్యమని పాలకులు కార్పొరేట్‌ సంస్థలకు మద్దతు ప్రకటిస్తున్నారు. వాస్తవంలో చిన్న కమతాలద్వారానే ఎక్కువ దిగుబడి వచ్చిందని అనేక సర్వేలు వెల్లడిరచాయి. ఈ వాస్తవాన్ని మభ్యపెట్టి మోదీ ప్రభుత్వం పేద రైతుల భూములను వారికి అప్పజెప్పచూస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు కార్పొరేట్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. మోన్‌శాంటో, ఐటీసీలాంటి బహుళజాతి సంస్థలు భారత వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి ఆధిపత్య చలాయిస్తున్నాయి. 1997లో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు పాలనలో 200 ఎకరాల్లో కాంట్రాక్ట్‌ సేద్యం జరిగి విఫలంకావటం, రైతాంగం నష్ట పోవటం, వారి భూముల సరిహద్దులు చెరిగిపోయి ఎవరి భూములు ఎక్కడ ఉన్నది సమస్యగా మారిన విషయం మరిచిపోలేము.
పంటలకు న్యాయమైన ధరలు లభించక అప్పుల పాలైన లక్షలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, మరోపక్క వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతూ, ఆహార ధాన్యాల ధరలుమాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఇది అధిక ఉత్పత్తి, ఆహార ధాన్యాల కొరతవలన జరగటంలేదు. భారతదేశం ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయటం, ప్రపంచ వ్యవసాయ ఒప్పందాన్ని ఆమోదించి, ఆర్థిక సంస్కరణల ముసుగులో ధరల నియంత్రణ తొలగించిన ఫలితమే ఈ పరిస్థితికి కారణమైంది.
భారతదేశంలో 40కోట్ల ఎకరాల సాగుభూమి ఉంటే, అందులో 60శాతం చిన్నకమతాల్లో వ్యవసాయం సాగుతోంది. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. 15కోట్ల మంది గ్రామీణ పేదలు ప్రత్యక్షంగా మరో 15 కోట్లమంది పరోక్షంగా వ్యవసాయంమీదే ఆధారపడి ఉన్నారు. కార్పొరేట్‌వ్యవసాయం మూలంగా రైతులు, వ్యవసాయకూలీలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. చిన్న, సన్న కారు రైతుల భూములను ప్రభుత్వ మద్దతుతో కార్పొరేట్‌ సంస్థలు ఆక్రమించుకుంటాయి. 30కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడిరది. ప్రస్తుతం 40నుంచి 50రోజులలోపు ఉన్న వ్యవసాయ పనులు 10లేక 15 రోజులకు కుదించుకు పోతాయి. కార్పొరేట్‌ వ్యవసాయం రైతాంగం పాలిట భస్మాసురహస్తం లాంటిది. దాని వల్ల దేశ వ్యవసాయరంగం మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. ఇంత ప్రమాదకరమైన కార్పొరేట్‌ వ్యవ సాయాన్ని దేశంలోకి పాలకులు ఆహ్వానించటం రైతాంగ వ్యతిరేకమైనదే గాక క్షమించరానిది. ఈ ప్రమాదాన్ని గ్రహించి యావన్మంది భారత రైతాంగం ప్రభుత్వ విధానాలకు, కార్పొరేట్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img