Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికోద్యమ వెలుగుదివ్వె

టి. లక్ష్మీనారాయణ

కార్మికోద్యమానికి అంకితమైన జీవితం కామ్రేడ్‌ వి.వి.రామారావుది. ఆల్‌ ఇండియా పోర్ట్‌ అండ్‌ డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా, విశాఖపట్నం హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అగ్ర నాయకుడుగా ఉద్యమ నిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషించారు. పోర్ట్‌ యూనియన్‌ను తిరుగులేని శక్తిమంతమైన సంస్థగా నిర్మించడంలో వి.వి. పోషించిన పాత్ర అనితరసాధ్యమైనది. అందువల్లనే ఆయనంటే సీపీఐ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి, ఎఐటియుసికి అపారగౌరవం. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.వి.రామారావు, అమరజీవి కా.పొట్లూరి నాగేశ్వరరావు మధ్య సత్సంబంధాలు, మంచి అవగాహన, సమన్వయం, సహకారం పుష్కలంగా ఉండేవి. వారి పని విధానం చూడ ముచ్చటగా ఉండేది.
ఎఐటియుసి రాష్ట్ర కేంద్రం బాధ్యతల్లో పాలుపంచు కోవడం ద్వారా మా మధ్య సత్సంబంధాలు చిగురించాయి. ఉద్యమాభివృద్ధికి అమితమైన ఆసక్తి కనబరిచే వారు. ఎఐటియుసి రాష్ట్ర కేంద్రానికి ఆర్థిక వనరులను సమకూర్చి పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర పార్టీకి సేకరించిన విరాళాల నుండి ఇతోధికంగా నిధులను ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచేవారు. దిల్లీలో ఎఐటియుసి కేంద్ర కార్యాలయం భవన నిర్మాణానికి, హైదరాబాదులో రాష్ట్ర ఎఐటియుసి భవన నిర్మాణానికి, చల్లపల్లిలో చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం నిర్మాణానికి విరాళాలు సేకరించి భారీ స్థాయిలో నిధులు అందచేశారు. ఉద్యమ సహచరులకు సహాయపడాలనే మనస్తత్వం ఆయనకున్న ఒక ఉత్తమ లక్షణం.
కృష్ణా జిల్లా, కైకలూరు తాలూకా, భైరవపట్నం గ్రామంలో 1947 అక్టోబరు 7న వేమూరి వెంకట కృష్ణయ్య, సంపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. పి.యు.సి. చదివే రోజుల్లోనే కా. కొండపల్లి మాధవరావు సహచర్యంలో కమ్యూనిస్టు భావాల వైపు, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌) ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. నంద్యాలలో చదువుతున్నప్పుడు స్థానిక ఎఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడుగా, కార్యదర్శిగా పనిచేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లోను చురుకుగా పాల్గొనేవారు. పాత కర్నూలు జిల్లా సీపీిఐ నాయకులు వై.స్వామిరెడ్డి, పూల సుబ్బయ్య, రావుల చెంచయ్య, చదువుల రామయ్య ప్రభృతులతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు. నాటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నీలం రాజశేఖరరెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి.
విద్యార్థి దశ పూర్తికాగానే పార్టీ కోసం పూర్తి కాలం పని చేయాలని భావించిన వి.వి… నీలం రాజశేఖరరెడ్డి సూచన మేరకు విశాఖపట్నం పోర్ట్‌ యూనియన్‌లో పూర్తికాలం ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహించే నిమిత్తం 1971 జనవరిలో విశాఖపట్నం చేరుకుని పోర్ట్‌ యూనియన్‌లో ఆఫీసు కార్యదర్శిగా చేరారు. 1975లో యూనియన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1980లో యూనియన్‌ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆది (1936) నుండీ విశాఖ రేవు కార్మికుల అగ్రగామి సంస్థగా వున్న యూనియన్‌ను విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టి యూనియన్‌ను పరిరక్షించుకోవడంలో, పటిష్ఠం చేయడంలో వి.వి. క్రియాశీలమైన పాత్ర పోషించారు.
పోర్ట్‌ ట్రస్ట్‌ బోర్డులో 1984 నుండి 25 సంవత్సరాలకు పైబడి కార్మిక ప్రతినిధిగా ప్రాతినిథ్యం వహించారు. విశాఖ రేవు చరిత్రలో ఇంతకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన అరుదైన గౌరవం వి.వి.కే దక్కింది. దానితోపాటు విశాఖ రేవులో ఎగుమతులు, దిగుమతులు చేసే కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేసిన విశాఖ డాక్‌ లేబర్‌ బోర్డు (త్రైపాక్షిక సంఘం`1969) లో వి.వి. ముప్పై ఏళ్ళకు పైగా సభ్యులుగా కొనసాగారు. మనదేశంలోని మిగతా డాక్‌ వర్కర్స్‌తో పోల్చుకుంటే విశాఖపట్నం కార్మికులు గణనీయమైన సౌకర్యాలను, సదుపాయాలను సాధించుకున్నారు. వీరితోపాటు ప్రైవేటుగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు 90 శాతం మంది పోర్టు యూనియన్‌లో ఉన్నారు. ప్రధానంగా ఈ కార్మికులిచ్చిన విరాళంతోనే విశాఖపట్నంలో (1996లో) జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని వి.వి. నాయకత్వం లోనే నిర్మించారు. 1969లో పోర్టు డాక్‌ వాటర్‌ ఫ్రంట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడిరది. దీనికి 1995లో విశాఖపట్నంలో జరిగిన ఫెడరేషన్‌ మహాసభలో ఇంద్రజిత్‌ గుప్తా అధ్యక్షునిగా, వి.వి. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఎఐటియుసిలో సాధారణ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 2005 దిల్లీ మహాసభలో జరిగిన జాతీయ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికైనారు. తుది శ్వాస విడిచేవరకూ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీిఐ) సాధారణ సభ్యుడిగా జీవితం ప్రారంభించి, అనతికాలంలోనే విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడుగా, పిదప రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమాలకు నాయకత్వం వహించి 10 రోజులపాటు విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. విశాఖపట్నం తొలి కార్పొరేషన్‌ ఎన్నికలలో కార్పొరేటర్‌ (1981-86) గా ఎన్నికయ్యారు. విశాఖ స్టీల్‌ యూనియన్‌కు గత 10 సంవత్సరాలుగా గౌరవాధ్యక్షునిగా వున్నారు. చిట్టివలస జూట్‌ కార్మికుల యూనియన్‌కు గౌరవాధ్యక్షులుగా పది సంవత్సరాలపాటు పనిచేశారు. ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) దిల్లీ మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యారు. 1987లో చెకొస్లోవేకియా సందర్శించి సమైక్య ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధి వర్గానికి (ఎఐటియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టియుసి, ఎఐబిఇఎ) వి.వి. నాయకత్వం వహించారు. 2003లో క్యూబా రాజధాని హవానాలో జరిగిన జాతీయ క్యూబన్‌ కార్మిక మహాసభకు ఎఐటియుసి ప్రతినిధిగా హాజరయ్యారు. కార్మికవర్గం ప్రతినిధిగా వియత్నాంలో పర్యటించారు.
వి.వి.రామారావు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, జోకులు వేస్తూ అప్పుడప్పుడు తనమీద తనే జోకులు వేసుకుంటూ తనచుట్టూ వున్న వాతావరణాన్ని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటట్లు చేసేవారు. అలాగే సీరియస్‌గా వుండేటప్పుడు వాతావరణాన్ని వేడెక్కించనూ గలరు. తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. కార్మికోద్యమంలో తలమునకలై ఉన్నప్పటికీ సాంస్కృతికోద్యమంపై ఎంతో మక్కువతో చేదోడువాదోడుగా ఉండేవారు.
విశాఖ పోర్ట్‌ అండ్‌ డాక్‌ వర్కర్స్‌ యూనియన్‌ అగ్రనాయకుడుగా ఓడరేవు కార్మికులకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, నేటి ఆంధ్రప్రదేశ్‌లోను, జాతీయ స్థాయిలో ఓడరేవు కార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ధన్యజీవి వి.వి.రామారావు. ఆయన మరణం కార్మిక వర్గానికి పూడ్చలేని లోటు. కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని కొరత. కామ్రేడ్‌ వి.వి.రామారావుకి విప్లవ జోహార్లు!
వ్యాస రచయిత రాజకీయ విశ్లేషకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img