Friday, April 19, 2024
Friday, April 19, 2024

కార్యకర్తలే కుటుంబం…పార్టీనే శ్వాస

కార్యకర్తలే కుటుంబంగా…పార్టీనే ఊపిరిగా తుదిశ్వాస వరకు పాటుపడిన ఆదర్శమూర్తి అమరజీవి మోదుమూడి లలితాదేవి. ఒకపక్క గంపెడుసంతానాన్ని సాకుతూ మరో పక్క చదువుకునేందుకు, వైద్యం కోసం మచిలీపట్నం వచ్చిన పార్టీ శ్రేణులకు సేవలను అందిస్తూ పట్టణంలో కమ్యూనిస్టుపార్టీ, మహిళా సమాఖ్య పటిష్ఠతకు ఆమె చేసిన కృషి ఎనలేనిది. వారు నివాసం ఉన్న తాడేపల్లి వారి సత్రంలాగే ఆమె ఇల్లుకూడా ఎప్పుడూ వచ్చి పోయే వారితో ఒక సత్రంలాగానే ఉండేది. కమ్యూనిస్టు పార్టీ అగ్రగణ్యులు అమరజీవి చండ్ర రాజేశ్వరరావు నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆమె సేవ పొందని వారులేరంటే అతిశయోక్తికాదు. ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు తాను తిన్నా తినకపోయినా తృప్తిగా భోజనం పెట్టే మహాసాధ్వి ఆమె. పార్టీ కోసం పూర్తి కాలం పనిచేసే నలుగురికి ఇంట్లోనే భోజనం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనం, వసతి కల్పించి ఎంతోమంది ఉన్నత విద్యకు తోడ్పాటు నందించి వారు ప్రతిభావంతులయ్యేందుకు సహకరించిన మాతృమూర్తి లలితా దేవి. కార్యకర్తలను లలితాదేవి అన్నిరకాలుగా ప్రోత్సహించారు. తమ పిల్లలను సైతం పార్టీలో పనిచేసే కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. ఆస్తిని అమ్మి ఉద్యమానికి ఖర్చుచేసి చివరకు మందులు కొనలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్నా వెరవక తమ పిల్లలలోనూ ఉద్యమస్ఫూర్తి నింపిన ఉద్యమనేత లలితాదేవి.
కృష్ణాజిల్లా దివి తాలూకా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ధనిక బ్రాహ్మణ కుటుంబంలో వడ్లమూడి నరసింహారావు, రత్తమ్మలకు లలితాదేవి జన్మించారు. మోదుమూడి శివారు రామచంద్రపురం గ్రామానికి చెందిన మేనత్త కొడుకు శ్రీహరిరావుతో వివాహం అయినది మొదలు ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొన్న ధీరోదాత్తురాలు లలితాదేవి. శ్రీహరిరావు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడై జిల్లాలో ప్రజా ఉద్యమాలను నిర్మించారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. పార్టీపై నిషేధం అమలులో వున్న సమయంలో శ్రీహరిరావు నాలుగు సంవత్సరాలకు పైగా రహస్యజీవితం గడిపారు. ఆ సమయంలో లలితాదేవి అనేకకష్టాలను ఎదుర్కొని కూడా పార్టీకి విధేయురాలిగా నిలిచారు. అనంతరం పార్టీ ఆదేశం ప్రకారం నివాసాన్ని మచిలీపట్నానికి మార్చారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులకు ఓర్చి ధైర్యంగా నిలబడి జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పార్టీ, మహిళ, ప్రజా సంఘాలనిర్మాణానికి భర్తతోకలిసి కృషిచేశారు. మచిలీపట్నంలోనేగాక చుట్టు పక్కలగల పోలవరం, రాయవరం, మల్లవోలు, చిన్నాపురం, గుండు పాలెం, కమ్మవారిచెరువు,పెడన,కప్పలదొడ్డి వంటి ప్రాంతాలలో పార్టీ, మహిళాసంఘాల నిర్మాణానికి విశేష కృషి చేశారు.
వివిధ సందర్భాల్లో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దళంగా ఏర్పడి ఏరియాలో ఇంటింటికితిరిగి విరాళాలను వసూలుచేసేవారు. వారికి లలితాదేవి నాయకత్వం వహించే వారు. ఎన్నికలసమయంలో విజయవాడ, మైలవరం, జగ్గయ్యపేట తదితర ప్రాంతాలకు బందరు తాలుకా నుంచి మహిళాదళాలను తీసుకువెళ్లి సీపీఐ అభ్యర్థుల తరపున ప్రచారంచేసేవారు. లలితాదేవి పార్టీ నిర్మాణం లోనే గాక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. 1977 నవంబరు 19న దివిసీమలో భారీ ఉప్పెన సంభవించడంతో పార్టీ రెండు నెలలు పాటు నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొని అందరి మన్ననలను పొందారు. ఈ సందర్భంగా బందరు, పెడన, గుండు పాలెం, చిన్నాపురం, కమ్మవారి చెరువు తదితర ప్రాంతాలలో బుట్టయ్యపేట మహిళా సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు, పాడిగాదెలకు రుణాలు ఇప్పించారు. పట్టణంలోను, చుట్టుపక్కల గ్రామాలలో 15వయోజన పాఠశాల లను ఏర్పాటు చేశారు.మచిలీపట్టణంలో పార్టీ నిర్మాణం కోసం తమ ఆస్తులను కూడా త్యాగం చేశారు. 1962లో పార్టీ ఆధీనంలో వున్న రవీంద్ర చేనేత సహకార సంఘం దివాళా తీయటంతో స్థానిక శివగంగలో వున్న రెండు ఎకరాల భూమిని విక్రయించి వచ్చిన పైకాన్ని సొసైటీ నిర్వహణకు ఇచ్చారు. ఆమెకు ఉన్న బంగారు, వెండి ఆభరణాలు పార్టీ సమావేశాలకు, నిర్మాణం కోసం అనేక సందర్భాలలో విరాళాల రూపంలో ఇచ్చారు. తన ఆభరణాలను తాకట్టు పెట్టి అనేక అవసరాలను తీర్చారు. చివరకు బందరులో పార్టీ కార్యాలయానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు తన మంగళసూత్రం సైతం యిచ్చి వేశారు. 1998 ఫిబ్రవరి 5వ తేదీన తుదిశ్వాస విడిచే వరకు పార్టీ అభివృద్ధికి, భర్త ఆశయాల సాధన కోసం శ్రమించారు. ఆమె 25వ వర్ధంతి ఆదివారం. ఆమెని ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో నేడు యువతరం ముందుకువెళ్లాలి. ఆమె ఏ ఆశయంకోసం శ్రమించారో దానికోసం కృషి చేయడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి.
(ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం లలితాదేవి 25వ వర్ధంతి సందర్భంగా…)
కాళీపట్నపు నటరాజ్‌ కుమార్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img