Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కుక్కలు బాబోయ్‌… కుక్కలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. జంట నగరాలలోని అనేక ప్రాంతాలలో ఉదయం నుండి రాత్రి వరకు కుక్కలు గుంపులు గుంపులుగాచేరి వాకింగ్‌కు వెళ్ళే వారిపైన, పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్ళే వారిపైన, వాహనాల మీద వెళ్ళే వారిపైన దాడులుచేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది జంటనగరాలలోని అనేక ప్రాంతాలలో తిరిగి కుక్కలను పట్టుకొని వెళ్లి గర్భనిరోధక ఆపరేషన్లు చేసేవారు. గత కొన్ని నెలల నుండి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది జంట నగరాలలోని ప్రాంతాలలో తిరిగి కుక్కలను పట్టుకొని వెళ్ళడం లేకపోవడం వల్ల కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. జంట నగరాలలోని ప్రజలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందికి కుక్కలను పట్టుకొని వెళ్ళాలని ఫిర్యాదుచేస్తే మీ ప్రాంతం మాకిందికి రాదంటే మాకిందికి రాదని తిప్పుతున్నారు తప్ప ఫిర్యాదులను తీసుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబర్‌పేటలో ఇటీవల ఒక అబ్బాయిపై కుక్కలు దాడిచేసి చంపివేసిన సంఘటనలు మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కలిచివేసింది. జంట నగరాలలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో కుక్కలు స్థానికులపై దాడులుచేసి గాయపరుస్తున్నాయి. కొంతమంది కుక్కలను పెంచడం ఆ పెంచిన కుక్కలు వీధి కుక్కలతో జతకూడి స్థానిక ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్నాయి. కుక్కలను పెంచేవారు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. ప్రతినెల ప్రభుత్వ పశువైద్యశాలకు వెళ్లి వాక్సినేషన్‌ టీకాలను ఇప్పించాలనే నిబంధనలు ఉన్నాయి. అనేకమంది ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించడంలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగానీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులుగానీ తక్షణమే చర్యలు తీసుకొని కుక్కలబారినుండి తమను రక్షించాలని కోరుతున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్ళే దారిలో కుక్కలబెడద లేకుండాచేయాలని ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్‌ ఎస్‌.విజయభాస్కర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img