Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుల మతాలు అవసరమా

రా బావ ఏంటి తెగ నవ్వుతూ వస్తున్నావు. ఏంటి ఈ రోజు ఏం మోసు కొస్తున్నావు. అంతగా నవ్వు వచ్చే విషయం ఏమిటి. చెబుతా చెబుతా నువు చాలాసార్లు ఒక మాట అన్నావు నీకు గుర్తుందో లేదో గాని అసలు ఈ కుల మతాలు మనిషికి అవసరమా అని. అవును మానవ మనుగడకు అవి అవసరంలేదు. అయినా ఇప్పుడెందుకు ఆ విషయం గుర్తుకొచ్చింది. ఎందుకంటావేమిటి మా వార్డులో ముస్లింలు ఎక్కువగానే ఉన్నారు. ఒకరు తర్వాత ఒకరు అన్ని పార్టీల వాళ్లు వచ్చి రంజాన్‌ ఇఫ్తార్‌ విందు ఘనంగా చేసుకోండి మమ్మల్ని పిలవండి ఖర్చు సంగతి మాకొదిలేయండి అంటున్నారట. మాయింటి పక్కనున్న బాషా అంటున్నాడు. ప్రతి పండుగకు ఒక లక్ష నువ్విస్తే బడా పసందుగా ఉంటుంది భాయ్‌ అని. అదా సంగతి ఇదొక కొత్త విషయం కాదు గదా ముందు ముందు అన్ని పండుగలు రాజకీయ నాయకులే జరిపిస్తారు. అయినా నేనన్నట్లు ఈ కుల మతాలు, పండుగలు మన జీవితాలకు అవసరంలేదు. మనిషిని దేముడు సృష్టించాడా లేక పరిణామ క్రమంలో కోతి నుంచి మానవాకారం వచ్చిందా అనే విషయం పక్కన పెడితే మనిషి పుట్టిన నాడు ఈ కులమతాలులేవు. తరువాత మానవుడే దేవుడిని సృష్టించి ఆయన చట్రం నుండి బయట పడలేక సతమతమవుతున్నాడు. అన్ని కులమతాలవారు అన్న దమ్ముల్లాగ ఒకరు తయారుచేసినవి మరొకరికి ఇచ్చి హాయిగా బతికారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఓట్లకోసం, సీట్లకోసం మరచిపోయిన కులమతాల చిచ్చురగుల్చు తున్నారు. నిజమే బావ అటవిక మానవునికి లేనివి ఇప్పుడు కావల్సి వచ్చినవా. అసెంబ్లీ మెట్లు ఎక్కాలంటే కులాలు అవసరమయ్యాయి. అందుకు కులగణన కోసం పోరాడుతున్నారు. నిజమే ఈ కులంలో ఇంత మంది ఉన్నారు కనుక ఇన్ని సీట్లు ఇవ్వాలని పార్టీ అధినేతలతో పోరాడడానికి తప్ప ఇప్పుడు కుల గణనదేనికి చెప్పు. నిజమే అసలు కావలసింది కులగణన కాదు. వృత్తులవారి గణన అవసరం. చేతి వృత్తులవారి జీవనం దుర్బరంగా తయారైంది. ఏ వృత్తి మీద ఎన్ని లక్షల మంది జీవనం సాగిస్తున్నారనేది అవసరం. వారి ఉత్పత్తులన్నీ బ్రోకర్లకు అమ్మి జీవించడం కష్టంగామారింది. వారికి సంవత్సరానికో పదివేలు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోంది కాని ఆ ఉపశమనం కంటె వారి ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొని వాటిని అమ్మి వారికి గిట్టింపుధర చెల్లిస్తే శాశ్వతపరిష్కారంగా ఉంటంది. తయారుచేసినవన్నీ దళారులకు అమ్మి గిట్టుబాటుధర లభించక జీవితాలు దుర్బరంగా మారాయి.
గతంలో వస్తు మార్పిడి యుగంలో హాయిగా బతికిన చేతి వృత్తిదారులు ప్రస్తుతం బతకలేక పోతున్నారు. వారు తయారుచేసిన ప్రతి వస్తువు ఎక్కడో ఒకచోట అమ్మబట్టే దళారులు కొంటున్నారు. కనుక ప్రభుత్వం ఒక కమిటీని నియమించి వారికి గిట్టుబాటు ధర నిర్ణయించి వాటినికొని ప్రభుత్వమే అమ్మితే వారి బతుకులు బాగుపడతాయి. ఈ విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను గుర్తు చేసుకోవాలి. ఆమె షెడ్లు నిర్మించి నేత పనివారికి వారానికొకసారి వేతనం చెల్లించి వంద శాతం పెంచి ఇతర దేశాల్లో అమ్మింది. అందులో దుప్పట్లు, లుంగీలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తరఫున చేనేత పనివారికి గిట్టింపు ధర చెల్లించి జీవన భృతి కల్పించింది. ఈ విధంగా చేతివృత్తుల వారు తయారుచేసిన ఉత్పత్తులన్నీ ప్రభుత్వమేకొని అవి ఏ రాష్ట్రంలో అవసరమో తెలుసుకొని అక్కడ అమ్మవచ్చు. దళారులు కొని లాభాలకు ఎక్కడో ఒకచోట అమ్ముతున్నారు కాని ఏ వస్తువు మిగిలిపోయి పార వేయడంలేదు. అంతేకాక చాలావరకు సూపర్‌ మార్కెట్ల ద్వారా మహిళాసంఘాలు ఏర్పాటుచేసిన స్టాళ్ల ద్వారా విక్రయించవచ్చు. చేతి వృత్తులకు సంబంధించిన కుటుంబాలలో 85శాతం ఇతరవృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడ్డారు. 15శాతంలో ఎక్కువ 60ఏళ్లు పైబడినవారే. మరో 10 సంవత్సరాలు వారిని ప్రభుత్వం పోషించగలిగితే తరువాత కుల వృత్తులలో బతికే వారుండకపోవచ్చు. నిజమే బావ అసలు ఈ కులవృత్తులే సమాజానికి కావల్సిన వస్తువులు తయారుచేసి నాగరిక మానవునిగ తీర్చిదిద్దాయి. ఆకులు కట్టుకు తిరిగే ఆటవిక మనిషికి నార వస్త్రం ధరింపచేసింది కులవృత్తే. అలాగే వ్యవసాయానికి కావలసిన నాగలి, గొడ్డలి, రంపం అన్నీ తయారుచేసింది ఈ కులవృత్తులే. అందుకే మహాకవి శ్రీశ్రీ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, గొడ్డలి, కొడవలి, నాగలి, రంపం, సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు అన్ని సమాజానికి అవసరమే అన్నాడు. ఆ రకంగా చేతివృత్తుల వారు సమాజ అవసరాలు గుర్తించి వాటితో నాగరిక సమాజ నిర్మాతలయ్యారు. అందుకే ఆ చేతి వృత్తులవారిని ప్రభుత్వం కాపాడితే ప్రస్తుతం ఇస్తున్న ఉచితాలతో పని ఉండదు కాని ఆ వృత్తులను మరచి కల మతాలను నెత్తికెత్తుకొని మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నది రాజకీయాలే. మనిషి మనుగడకు కులమతాలతో పనిలేని గత సమాజాన్ని విస్మరించరాదు.
సెల్‌ : 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img