Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘కేరళ కథ’ చిత్రం అబద్ధాల పుట్ట

వినయ్‌ విశ్వం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. నేతృత్వంలోని సంఫ్‌ు పరివార్‌ ఫాసిస్ట్‌ ప్రచారంలో అనునిత్యం తన అసమానమైన నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ముస్సోలినీ, హిట్లర్‌ నుండి నేర్చుకున్న పాఠాలను సంఫ్‌ు పరివార్‌ మారుతున్న పరిస్థితులకు అనువుగా మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ విషయంలో సంఫ్‌ు పరివార్‌ వారు కొన్నిసార్లు తమ గురువులను కూడా మించిపోతారు. 1937లో ఒక చలన చిత్ర నిర్మాణ యూనిట్ను ప్రారంభిస్తూ బెనిటో ముస్సోలినీ ‘‘సినిమా అత్యంత శక్తిమంతమైన ఆయుధం’’ అనే నినాదాన్ని ఇచ్చాడు. అతని అడుగుజాడల్లో నడిచిన అడాల్ఫ్‌ హిట్లర్‌, అతని ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ కూడా చలనచిత్ర నిర్మాతలను వారి అభిరుచికి తగినట్టుగా సినిమాను రూపొందించడానికి ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ పాలన ప్రారంభ రోజుల నుండి సంఫ్‌ు పరివార్‌ తమ రాజకీయ లక్ష్యాలను సాధించడానికి కళలు, సాహిత్యాన్ని తమకు అనువుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
పుణెలోని ఎఫ్టిఐఐలో జరిగిన సంఘటనలు సంస్కృతిని కలుషితం చేయడానికి సంఫ్‌ుపరివార్‌ ఎంతమొండిగా వ్యవహరిస్తుందో తేలిపోయింది. కళలు, సంస్కృతిని కలుషితంచేసే క్రమంలోనే నాథూరామ్‌ గాడ్సే బోల్తోయ్‌ నాటకం వచ్చింది. వీటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం కళలు లేదా సౌందర్యాన్ని ప్రోత్సహించడం కాదు. కలహాలు, విద్వేషం విత్తనాలు నాటడమే. ది కాశ్మీర్‌ స్టోరీ లోని విషపూరిత కథనం సినిమా మాధ్యమం ద్వారా ప్రజల మనస్సులను కలుషితం చేయడం ఈ యుద్ధంలో భాగం. అలాంటి దుస్సాహసాలలో ఆరితేరి పోయాక ఇప్పుడు అదే వరసలో అత్యంత విషపూరితమైన కేరళ స్టోరీతో బయటకు వచ్చారు.
వారి కేరళ కథ కేరళ అసలు కథ కాదు. నిజమైన కేరళ కథ ప్రేమానురాగాలు, గౌరవంతో ముడివడిరది. కేరళ ప్రజలు, వివిధ మత విశ్వాసాలకు చెందినవారు తరతరాలుగా ఈ విధానాన్నే ఆదరించారు. అసలు కేరళ కథే రాష్ట్రాన్ని అన్ని మానవాభివృద్ధి సూచికలలో అగ్ర స్థానంలో నిలబెట్టింది. నిజమైన కేరళ కథను రూపొందించిన కేరళ ప్రజలు, మతం, కులాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సామరస్యపూర్వకమైన పరస్పర సంబంధాలను కొనసాగించారు. వారు హిందూ, ముస్లిం లేదా క్రైస్తవ మతపరమైన తీవ్రవాద శక్తులను వారి రోజువారీ జీవితాలకు దూరంగా ఉంచారు. ఆ వ్యక్తులు ఈ అంశాలకు తమ రాజకీయ పార్టీలలో కనీస స్థానం కూడా ఇవ్వలేదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ ప్రజల పట్ల ప్రతీకారంతో అవాస్తవ కేరళను చిత్రీకరించేందుకు కేరళ కథను రూపొందించాయి.
కేరళ స్టోరీ చిత్రం పూర్తిగా నిరాధారమైన వాదనలు, బూటకపు సమాచారం, ఇస్లాం వ్యతిరేక ప్రచారం ఆధారంగా రూపొందింది. నిజమైన కేరళ గౌరవాన్ని కించపరిచే ఉద్దేశంతో, మతోన్మాద కారణాలపై ప్రజలను విభజించే ఉద్దేశంతో రూపొందించారు. చిత్ర నిర్మాతలు మొదట కేరళలో తప్పిపోయిన 32,000 మంది ముస్లిం మహిళల కథను వెలికితీసినట్లు పేర్కొన్నారు. ప్రలోభాలకు లోనై బలవంతంగా మతం మార్చుకున్న ఈ మహిళలు తర్వాత ఐ.ఎస్‌.ఐ.ఎస్‌. లో చేరారని దుష్ప్రచారం చేశారు. ప్రజలు, సత్యాన్ని అభిమానించే వారు హాస్యాస్పదమైన, అతిశయోక్తితో కూడిన ఈ సంఖ్యను ప్రశ్నించినప్పుడు ఆ సంఖ్యను 32,000 నుండి కేవలం మూడువేలకు తగ్గించడానికి సంకోచించ లేదు. కేరళ స్టోరీ చిత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మార్కు సినిమా అనడానికి ఈ ఒక్క ఉదంతం చాలు.
ఈ సినిమా ట్రైలర్‌లో ఉద్దేశపూర్వకంగా కేరళకు చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల ప్రకటనలను వక్రీకరించి ఉటంకించారు. విఎస్‌ అచ్యుతానందన్‌ చేసిన ప్రకటనను మలయాళం నుండి తప్పుగా అనువదించి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉపయోగించారు. అలాగే, ఊమెన్‌ చాందీ ఎప్పుడూ వార్షిక మతమార్పిడుల గణాంకాలను ప్రస్తావించలేదు. లేదా ఐ.ఎస్‌.ఐ.ఎస్‌. లో చేరిన మహిళల గురించి లేదా బలవంతపు మతమార్పిడుల గురించి ప్రస్తావించలేదు. ఏంతో కొంత విశ్వాసపాత్రత సంపాదించేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇద్దరు సీఎంల ప్రకటనలను తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ మోచేతి నీళ్లు తాగె అనేక మీడియా సంస్థలు,యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా కేరళపై ఇదే విధమైన దుష్ప్రచారం ప్రారంభించాయి. రాజకీయ దురుద్దేశంతో కూడిన ఈ ప్రయత్నాన్ని కేరళ ప్రజలు ఐక్య స్వరంతో వ్యతిరేకించారు.
ఈ సినిమాలో మహిళలను ఇస్లాం మతంలోకి మార్పిస్తున్నట్టు చూపడానికీ ‘లవ్‌ జిహాద్‌’ ను వినియోగించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, ‘లవ్‌ జిహాద్‌’ నిజానికి ప్రజలను మతాల వారిగా చీల్చి సమీకరించే లక్ష్యంగా చేసుకున్న కుట్ర. ఇందులో తీవ్రమైన ముస్లిం వ్యతిరేకత ఇమిడి ఉంది. ఈ అసత్యాలను ప్రచారంలో పెట్టేవారు చిన్నపాటి సాక్ష్యంతో కూడా దానిని రుజువు చేయలేరు. అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 ఫిబ్రవరి 5న సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ద్వారా ‘లవ్‌ జిహాద్‌’ కేసులేమీ లేవని పార్లమెంటుకు తెలిపింది. ఈ సిద్ధాంతాన్ని బీజేపీి ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో తిరస్కరించినప్పటికీ, సంఫ్‌ు పరివార్‌ అబద్ధాల ఫ్యాక్టరీ ఈ అపఖ్యాతి పాలైన సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసించేలా నిరంతరం పనిచేస్తోంది. అదేవిధంగా ఐసిస్‌లో యోధులుగా చేరుతున్న భారతీయుల సంఖ్య 200కు మించదని ప్రభుత్వ, రక్షణశాఖ వర్గాల సమాచారం. ‘ది కేరళ స్టోరీ’ ద్వారా అందిస్తున్న కథనం పూర్తిగా అబద్ధాల మయం. వాస్తవాలను వక్రీకరిస్తూ ద్వేషాన్ని పెంచే లక్ష్యంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ముఖ్యంగా కేరళలో, దేశంలో మత సామరస్యానికి ప్రమాదకరం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం. కల్పితాన్ని వాస్తవంగా చూపితే ఎవరు బాధ్యత వహించాలి? అపోహలు, సత్యం ముసుగువేసుకోవడం, అసమ్మతి, అల్లర్లకు దారితీస్తే ఎవరు బాధ్యత వహించాలి? ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి మన రాజ్యాంగంపై, అందులో పొందుపరిచిన విలువలపై ఏమాత్రం శ్రద్ధ లేదన్నది నిజం. పైగా, వారికి సత్యం పట్ల నైతిక నిష్ఠలేదు. అయినప్పటికీ, మన రాజ్యాంగంలోని లౌకిక నైతికతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రచారాలను వాస్తవం అని నమ్మకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఈ బాధ్యత నుండి తప్పుకుంటున్నట్లయితే, దాని విధేయత భారత రాజ్యాంగంపై కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంపైనే ఉందని స్పష్టమవుతోంది. మన దేశ సంక్షోభం ఏమిటంటే, ప్రభుత్వం పూర్తిగా బీజేపీ ఎన్నికల యంత్రాంగంగా మారిపోయింది. దీని కోసం కర్నాటక ఎన్నికలకు ముందు ప్రజలను సమీకరించడానికి కేరళ కథ సినిమాను వాటంగా వినియోగించుకుంటున్నారు. ఇది దేశానికి ప్రమాదకర పరిస్థితి. కెప్టెన్‌ ఓడను ముంచడంపై కనికరం లేకుండా ఉన్నాడు.
రాజ్య వ్యవస్థ తన రాజ్యాంగ ఆదేశం నుండి తప్పించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వాస్తవాలు, శాస్త్రీయ స్ఫూర్తి ద్వారా ఈ విషయాలపై ప్రజలను తప్పనిసరిగా చైతన్యవంతం చేయాలి. చాలా మంది ప్రజలు ఈ చిత్రం ప్రాతినిధ్యంవహిస్తున్న చెడునే పరిగణనలోకి తీసుకుని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఈ తరుణంలో ఈ విషయంలో నిషేధం సరైన చర్య కాదని వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. పరివార్‌ శక్తులు వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ గురించి గొంతెత్తడానికి, కేకలు వేయడానికి దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలి. రాజకీయ ప్రచారానికి, సత్యానికి మధ్య తేడాను గుర్తించగలిగే అవగాహన కల్పించాలి. ప్రజల మధ్య బంధాలు బలపడాలి. తద్వారా ప్రచారం, దుర్మార్గపు కల్పనలు వారి మధ్య చీలికను సృష్టించలేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్ధాల కర్మాగారానికి వ్యతిరేకంగా విద్య, సంఫీుభావం అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలు. సత్యం గెలుపొందాలంటే ప్రజలు ఐక్యంగా ఎదగాలి.
సీపీఐ జాతీయ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img