Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొవిడ్‌ గోరుచుట్టపై యుద్ధం రోకటి పోటు!

బి.ఎం.ఆర్‌
శరీరానికి ఏదో ఒక భాగంలో ముల్లు గుచ్చుకున్నపుడు దేహమంతా బాధ ఉంటుంది. అలాగే ప్రపంచంలో నేడు ఏ మూలన యుద్ధం జరిగినా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడంతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడం వెంటనే కనిపిస్తున్నది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ విధ్వంసం నాలుగు మాసాలుగా కొనసాగుతోంది. కోవిడ్‌ దెబ్బ నుండి తేరుకుంటున్న వేళ ‘గోరు చుట్టుపై రోకలి పోటులా’ ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలకు ప్రత్యక్ష కారణం అవుతున్నది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30 ఏండ్లు వెనక్కి వెళ్ళిం దని అంచనా. ఉక్రెయిన్‌ జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరి శ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తు న్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు భస్మీపటలం అవుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 న ప్రారంభమైన యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల మీదా తిరోగమన ప్రభావాన్ని చూపిస్తున్నది.
గోధుమల ధర 14 ఏళ్ళ తార స్థాయికి
యుద్ధంతో ప్రపంచ దేశాల అభివృద్ధి మందగమనం, పెరుగుతున్న ద్రవ్యో ల్బణం, మార్కెట్‌ సరఫరాలు విచ్ఛిన్నం కావడం, చమురు ధరలు చుక్కల్ని తాకడం, నిత్యవసరాల ధరలు సామాన్యడికి చెమటలు పట్టించడం లాంటి ప్రతి కూల ప్రభావాలు అనుభవంలోకి వస్తున్నాయి. ప్రపంచ దేశాల అభివృద్ధి 4.5 శాతం నుంచి 3 శాతానికి పడిపోవడం, పలు దేశాల ద్రవ్యోల్బణం దాదాపు రెట్టింపు కావడంతో అసమానతల అగాధం పెరుగుతూ ప్రమాదకరంగా మారు తోంది. 2008 తరవాత గోధుమల ధరలు నేడు అత్యధిక స్థాయికి పెరిగాయి. ప్రపంచ దేశాల్లో మొక్కజొన్న, గోధుమలు, బార్లీ ఎగుమతుల్లో ఉక్రెయిన్‌ 4వ అతి పెద్ద దేశంగా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉండేది. ఉక్రె యిన్‌, రష్యాలు కలిసి ప్రపంచ గోధుమల అవసరాలను 27 శాతం తీరుస్తు న్నాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌/నూనె గింజల సరఫరాలో 53 శాతం ఉన్నాయి. యుద్ధం కారణంగా ఈ పరిస్థితి తారుమారవుతోంది.
ఆకలి చావుల అంచున
నేడు కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ మానవాళి చూడని ఆహార సంక్షోభం అంచున నిలిచింది. యుద్ధ నేపథ్యంలో గోధుమల ఎగుమతులు ఆగిపోవడంతో యెమెన్‌, అఫ్గానిస్థాన్‌, తూర్పు ఆఫ్రికా దేశాలు ఆకలి చావుల దుస్థితిని అనుభవిస్తున్నాయి. యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌ ఈ ఏడాది వ్యవసాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో ఆ దేశంతో పాటు పలు దేశాలు ఆహార కొరతలోకి జారనున్నాయి. ఆఫ్రికాకు చెందిన ఈజిప్ట్‌ లాంటి 25కు పైగా దేశాలు దాదాపు 50 శాతం వరకు గోధుమలకు ఉక్రెయిన్‌, రష్యాల మీదనే ఆధారపడడం అనాదిగా ఉంది. ఐరాస నివేదిక ప్రకారం 24 ఏళ్ళ తరవాత ఈ ఫిబ్రవరిలో ‘ప్రపంచ ఆహార ధరల సూచీ’ అతిగా పెరిగింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించే క్రమంలో రష్యా బలగాలు ఓడ రేవులను కూడా ఆక్రమించుకోవడంతో ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం జరిగింది. యుద్ధం కారణంగా రెండు దేశాల్లో వ్యవసాయ, ఆహార ఆధార ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, రవాణా, పంపిణీ శృంఖలాలు తెగిపోవడంతో సాగుబడి కుంటుపడిరది.
ప్రపంచ జనాభాలో 30 శాతం పేదరికం ఉచ్చులో
ఈ జనవరిలో రోజుకు 11.3 బ్యారెల్స్‌ ముడి చమురును ఉత్పత్తి చేసిన రష్యా చమురు ఉత్పత్తుల్లో అమెరికా, సౌదీల తర్వాత 3వ స్థానంలో, సహజ వాయువు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉండేది. క్రూడ్‌ ఆయిల్‌ ఎగుమతుల్లో రష్యా 2వ స్థానంలో ఉండడం గత చరిత్రగా మిగిలింది. నేటి యుద్ధంతో ప్రపంచ జనాభాలో 30 శాతం పేదరిక ఉచ్చులో పడడమే కాకుండా రోజుకు 40 మిలియన్ల బడుగులు దారిద్య్రరేఖకు దిగువన చేరుతున్నారు. యుద్ధ పరిణామాల్లో 8.3 మిలియన్ల వరకు ఉక్రెయిన్‌ శరణార్థుల సమస్య, ఆంక్షల అగాధాలు, నిత్యావసరాల ధరలతో విశ్వ మానవాళి తీవ్ర సంక్షోభంలో పడిరది. ఆహార కొరత, గృహ సమస్య, రవాణా, విద్య, నగదు అందుబాటు లాంటి చాలా సమస్యలు ఉక్రెయిన్‌ను వెన్నాడుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాతాళానికి దిగజారుతున్నది. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల్లో రష్యా ముందు వరుసలో ఉండేది. శ్రీలంకలో యుద్ధ ప్రభావం అత్యధికంగా పడిరది. గోధుమ ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉండగా నేడు యుద్ధ సమయంలో ఎగుమతులు కుంటుపడడం చూస్తున్నాం.
వాతావరణ ప్రతికూల మార్పులు
యుద్ధ ప్రభావం వాతావరణ మార్పులపై తీవ్రంగా పడడం విచారకరం. అమెరికా, యూరోప్‌, నాటో దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా ఇండియా మాత్రం రష్యాపై ఆంక్షలు విధించకుండా రష్యా నుంచి చమురు, ఆయుధాలు లాంటివి దిగుమతి చేసుకుంటున్నది. రష్యా దాడిని భారత్‌ వ్యతిరే కించకపోయినా సామాన్యుల మరణాలను వ్యతిరేకిస్తున్నది. ప్రపంచంలోనే అత్య ధిక అణు ఆయుధాలను కలిగిన తొలి దేశంగా రష్యా నిలుస్తున్నది. యుద్ధంలో అతిగా దెబ్బ తింటున్న ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా అపార నష్టాలను చవి చూస్తున్నది. రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నంలో భాగంగా తీవ్ర ఆంక్షలు విధిం చిన వేళ రష్యా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నది. యుద్ధ సమయంలో మిలిటరీ అత్యధిక శిలాజ ఇంధనాలను వినియోగించడంతో భూతాపంపై అధిక ప్రభావం పడనున్నది. ఈ యుద్ధంతో కనీసం 25 దేశాలు ప్రతికూల వాతావరణ మార్పులకు లోనుకానున్నాయి.
వ్యాస రచయిత సెల్‌ 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img