Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో సేవ్‌ ఇండియా ఉద్యమం

చలసాని వెంకట రామారావు

‘‘మానవుడు జన్మతః స్వేచ్ఛాజీవి. కానీ ఎక్కడ చూసినా సంకెళ్ళలోనే కనబడు తున్నాడు’’ అని ఫ్రెంచి విప్లవ తాత్విక సిద్ధాంత కర్తలలో ఒకరైన రూసో తాను రచించిన ‘సోషల్‌ కాంట్రాక్టు’ గ్రంథం మొదటి వాక్యంలో చెప్పారు. మోదీ పాలన లోని నేటి భారత ప్రజాస్వామ్యానికి ఇది నూటికి నూరుశాతం వర్తిస్తుంది. ఏడేళ్ళ పాలనా కాలంలో సామాన్యులు, రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి, బడుగు జీవులు, అణగారిన వర్గాల ప్రజల స్థితిగతులను పరిశీలిస్తే దేశం ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉందో అర్థం అవుతుంది. ఇలాంటి స్థితిలో మోదీ ప్రభుత్వం నిరంకుశంగా మూడు రైతువ్యతిరేకచట్టాలను తీసుకొచ్చింది. దేశవ్యాపితంగా రైతులు ఆందోళన చేస్తూ రాజధాని దిల్లీ నగరాన్ని నెలల తరబడి దిగ్బంధించినా ప్రభుత్వం తన వైఖరిని విడనాడడంలేదు. రైతు వ్యతిరేక చట్టాలతో పాటు భారత కార్మిక వర్గం అశేష త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు లేబరు కోడ్లను ప్రవేశపెట్టారు. ఈ విధానాలకు నిరసనగా కార్మికులు, రైతులు సంఘటితంగా 2020 నవంబరు 26న దేశవ్యాపితంగా నిరసన దినం పాటించినప్పటికీ కేంద్ర పాలకులకు కనువిప్పు కలగలేదు. దీనికి తోడు స్వాతంత్య్రానంతరం ప్రణాళికబద్ధ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ప్రజల సంపదతో నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రైవేటు రంగానికి బదలాయిస్తున్నది. ఈ విధానాలకు నిరసనగా దేశవ్యాపితంగా నిరసన తెలియజేయాలని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు కలిసి ఉమ్మడిగా ఈ (2021) ఆగస్టు 9న ‘‘క్విట్‌ ఇండియా’’ స్ఫూర్తితో ‘‘సేవ్‌ ఇండియా’’ ఉద్యమానికి పిలుపునిచ్చాయి.
క్విట్‌ ఇండియా పూర్వాపరాలను పరిశీలిస్తే… 1942 ఆగస్టు 9న ‘క్విట్‌ ఇండియా’ నినాదంతో స్వచ్ఛందంగా దేశవ్యాపితంగా ఉద్యమం ప్రారంభ మైంది. 1942 ఆగస్టు 8వ తేదీ రాత్రి బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఇంకా ఉద్యమానికి తేదీ నిర్ణయించలేదు. గాంధీజీ గవర్నర్‌ జనరల్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలియజేస్తూ లేఖ రాస్తుండగానే బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టులు ప్రారంభించింది. ఆగస్టు 9 తెల్లవారకముందే కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు గాంధీ, నెహ్రూ, అజాద్‌, పటేల్‌, కృపలానీ, రాజేంద్ర ప్రసాద్‌లతో సహా 148 మందిని బొంబాయిలో అరెస్ట్‌ చేశారు. కాంగ్రెసు సంస్థను నిషేధించారు. ప్రజలకు నాయకత్వం లేకుండా చేసి ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం కుట్ర పన్నింది. నాయకత్వం లేకపోయినా, గాంధీజీ పిలుపు ఇవ్వకపోయినా జాతీయ నాయకుల అరెస్టులకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పలు పట్టణాలలో బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి ఆందోళనలు చేపట్టారు. హర్తాళ్ళు, నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులతో తమ క్రోధావేశాలను వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో దిల్లీలో ఆగస్టు 11, 12 తేదీలలో బ్రిటిష్‌ సైనికులు 47 సార్లు కాల్పులు జరపగా 76 మంది చనిపోయారు. అనేకమంది క్షతగాత్రులయ్యారు. దేశంలో పలు ప్రాంతాలలో ప్రజలు ఆగ్రహంతో పోలీసు స్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లు తగలబెట్టారు. టెలిఫోన్‌ తీగలను తెంచేశారు. రైలు పట్టాలను పీకేశారు. ప్రభుత్వ భవనాలను, సైనిక వాహనాలను సైతం భశ్మీపటలం చేశారు. కొన్ని రాష్ట్రాలలో అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. నాయకులు లేని ఉద్యమం అదుపు తప్పి తీవ్రమైన చర్యలకు దారితీసింది. దీంతో బెంబేలు ఎత్తిన బ్రిటిష్‌ ప్రభుత్వం అదనపు సైనిక బలగాలను దింపి అల్లకల్లోల్లాన్ని అణచి వేయటానికి ఏనాడూ లేని విధంగా నిర్బంధాన్ని అవలంబించింది. కొన్ని నగరాలలో విమానాల నుండి మిషన్‌గన్‌లతో ప్రజలపై కాల్పులు జరిపారు. ఉప్పు నీటిలో ముంచిన కొరడాలు, బెల్టులతో నగ్న శరీరాలపై బాదారు. విమానాల నుండి బాంబులు ప్రయోగించారు. మొత్తం దేశం దేశమే పోలీసు రాజ్యంగా మారిపోయింది. స్త్రీల నగలు, ధనం దోచుకున్నారు. పురుషులను నానా చిత్రహింసలు పెట్టారు. మొత్తంకాల్పులలో 940మంది హతులైనారు. 18 వేల మందిని డిటెయిన్‌ చేశారు. 60 వేల మందికి పైగా అరెస్టు చేశారు. ఈ ఉద్యమం జాతీయోద్యమానికి ఎంతో స్ఫూర్తిని కలిగించింది. స్వాతంత్య్ర క్రమాన్ని వేగిరపర్చింది. భారత ప్రజాస్వామ్యం నరేంద్ర మోదీ పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా మసకబారిపోయింది. యోగి వలే వేషం వేసుకున్నా త్యాగి వలె జీవించటం లేదు. మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నాడు. తనకో నీతి అన్యులకో నీతి అన్నట్లుగా వ్యవహ రిస్తున్నాడు. అందరికి సమన్యాయం వర్తించే రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు ఇచ్చారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను బ్రష్టుపట్టించి నియంతృత్వ పోకడలకు పునాదులు నిర్మిస్తున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కొరవడిరది. సామ్రాజ్యవాదుల, నిరంకుశ ప్రభువర్గీయుల ఏజంటుగా మోదీ పరిపాలన సాగిస్తున్నాడు. భారతరాజ్యాంగం కన్నా మనువాద సిద్ధాంతాలను ఆచరణీయంగా ప్రకటిస్తున్నారు.
దేశ భవిష్యత్తును సామ్రాజ్యవాదుల చేతుల్లోనుండి లాక్కోవాలి…. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారతీయ ఐక్యతను చాటాలి….భారత రాజ్యాంగమే రక్షణ కవచం కావాలి….అందుకే మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమానికి ముందు చెప్పినట్లు ‘‘విజయమో వీర మరణమో’’. మోదీ పాలన నుండి విముక్తి సాధించాలి. ‘‘ఎవరైతే భయపడతాడో వాడు చస్తాడు, ఎవరైతే ఎదిరించి నిలబడతాడో వాడు గెలుస్తాడు’’ అందుకు ఆగస్టు 9 క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఉద్యమించాలి.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 9490952093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img