Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గత నెలలో 15 లక్షల ఉద్యోగాలు హరీ!

కరోనా కారణంగా పూర్తిగా మూలన పడిన ఆర్థిక వ్యవస్థ ఎలాగోలా పట్టాలైతే ఎక్కింది గానీ పోయిన ఉద్యోగ, ఉపాధి మార్గాలు మాత్రం ఇంకా గాడిన పడలేదు. పోయిన ఉద్యోగాలు రాకపోగా మరిన్ని ఖాళీ అవుతున్నాయి. దీంతో నిరుద్యోగితా రేటు పెచ్చుమీరుతూనే ఉంది. గత నెలలోనూ (ఆగస్టులో) 15 లక్షల మంది తమ పనులు పోగొట్టుకున్నారు. ఇందులో సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిరటికీ చెందినవారు ఉన్నారు. జులైలో కొంత మెరుగ్గా కనిపించిన ఈ పరిస్థితి మళ్ళీ తలకిందులైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అని తేడా లేకుండా అన్ని చోట్లా నిరుద్యోగితా రేటు మరోమారు పెరిగిందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం (సీఎంఐఇ) నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం జులైలో 399.38 మిలియన్లుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఆగస్టులో 397.78 మిలియన్లకు తగ్గింది. ఒక్క గ్రామీణ భారతంలోనే దాదాపుగా 13 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయారు. జులైలో 6.95 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగితా రేటు గత నెలలో 8.32 శాతానికి పెరిగింది. ఆగస్టులో పట్టణ నిరుద్యోగితా రేటు 1.5 శాతం మేర పెరిగి 9.78 శాతానికి చేరింది. ఈ నిరుద్యోగితా రేటు ఏప్రిల్‌లో 9.78 శాతం, మే నెలలో 14.73 శాతం, జూన్‌లో 10.07 శాతం, జులైలో 8.3 శాతం ఉంది. కొవిడ్‌ రెండో దశ ప్రబలడానికి ముందు మార్చిలో పట్టణ నిరుద్యోగితా రేటు 7.27 శాతం ఉంది. జులైలో 6.34 శాతంగా ఉన్న గ్రామీణ నిరుద్యోగితా రేటు ఆగస్టులో 1.3 శాతం పెరిగి 7.64 శాతానికి చేరింది. ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాలు నాటే పనులు సరిగ్గా సాగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు ఉద్యోగితా రేటు పడిపోయింది కానీ మరోవైపు శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది.
పని కోసం పడిగాపులు పడి ఎదురుచూస్తున్న వారి సంఖ్య 36 మిలియన్లు ఉండగా జులైలో ఈ సంఖ్య 30 మిలియన్లుగా ఉంది. మొత్తం శ్రమ శక్తి పరిమాణం కూడా 433.86 మిలియన్లకు పెరిగింది. అంటే దాదాపుగా 4 మిలియన్లు. ఇది జులైలో ఉన్నదాని కంటే ఎక్కువగానే ఉండడం మూసుకుపోయిన ఉద్యోగ, ఉపాధి మార్గాల ధోరణి మరింత క్షీణించిన విషయాన్ని స్పష్టీకరిస్తోంది. వాస్తవానికి శ్రామిక శక్తి పరిమాణం ఆగస్టులో దాదాపుగా 2020 మార్చిలో ఉన్న విధంగానే ఉంది. అంటే కొవిడ్‌ రాకముందు, లాక్‌డౌన్‌ విధించడానికి ముందు ఆర్థిక కార్యకలాపాలు మందగించడానికి ముందు, సంస్థలు మూతపడక ముందు, ఏప్రిల్‌లో ఉపాధి మార్కెట్‌ కుదించుకుపోవడానికి ముందు ఉన్నట్టుగానే ఉంది. భారత్‌లో గత కొన్నేళ్ళుగా ఉద్యోగ, ఉపాధి కల్పన బాగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ అనంతర కాలంలో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ ఉపాధి మార్కెట్‌ మాత్రం ఒడిదొడుకుల్లోనే ఉంది. భారతదేశ వ్యాప్తంగా కనీసం ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పటికీ రెండంకెల నిరుద్యోగితా రేటు నమోదవుతోంది. నిరుద్యోగితా రేటు జులైలో కంటే ఆగస్టులో పెరిగింది. ఇందుకు కారణం జులైలో వానాకాలం నాట్లు వేసే ముమ్మర సీజన్‌లో ఈ వ్యవసాయ పనుల్లోకి దాదాపుగా 15 మిలియన్ల మంది వెళ్ళారు. దీంతోపాటు జులైలో ఎక్కువగా అసంఘటిత రంగ పనులు అందిపుచ్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ చాలామంది ప్రత్యామ్నాయ పనులు కంటే ఎక్కువగా వ్యవసాయ పనుల్లోనే చేరారని సీఎంఐఇ గత నెల నివేదిక పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img