Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గర్భస్థ శిశువుకి విలువలు నేర్పడం అశాస్త్రీయం

హిరణ్యాక్షుని కొడుకు ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉండగానే కొడుకుని తండ్రి భావాలకు వ్యతిరేకంగా హరిభక్తునిగా తయారు చెయ్యాలన్న ఆలోచనతో నారదుడు లీలావతి పొట్టలోఉన్న శిశువుకి హరిభక్తి నూరిపోసినట్లుగా చెప్తారు. ఇప్పుడుకూడా గర్భంలోఉన్న శిశువులకు సంస్కృతి, విలువలగురించి నూరిపొయ్యాలన్న ఆలోచన కొన్ని మత సంస్థలకు రావటం అనేది మనలను వెనక్కి తీసుకపోవటమే అవుతుంది. అవన్నీ పుక్కిటి పురాణాలు. రుజువులులేవు. మనలను ఆటవికానికి, పాతకాలంలోకి తీసుకెళ్ళటానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మనం ఏకాలంలో ఉన్నాం? గర్భంలో ఉన్న శిశువుకి బయటచెప్పే మాటలు అర్ధం చేసుకునే శక్తి ఉంటుందా? ఈ రోజుకొన్ని మతసంస్థలు ముందుకొచ్చి సమాజాన్ని వేదకాలంలోకి తీసుకెళ్లాలని అంటున్నాయి. అందులో భాగంగానే ఆవుని కౌగిలించు కోవాలి అంటూ కౌ హాగ్‌ డే లు, ఆవు మూత్రంలో బంగారాన్ని చూడటము, ఆవు మూత్రంలో రోగనిరోధక శక్తి ఉందని ప్రచారం చెయ్యటం, ఇవన్నీ అందులో భాగమే! యోగాలో రోగనిరోధక శక్తిఉంటే, యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకి జబ్బుచేస్తే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఎందుకు వెళ్ళాడు? పిరమిడాకారంలో ఉన్న ఇళ్లలో కాపురముంటే రోగాలు రావని ప్రచారంచేసే పిరమిడ్‌ ధ్యాన కేంద్ర స్థాపకుడు పత్రీజీ కిడ్నీ రోగంతో ఎందుకు చనిపోయాడు? ఆయనతోపాటు తిరుపతిలో పనిచేసిన అయన మిత్రులు కూడా కిడ్నీ జబ్బుతోనే చనిపోయారు. యోగ ప్రచారం చేసిన శంకరాచార్యుడు 32 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు? వివేకానందుడు 37 సంవత్సరాలకే ఎందుకు చనిపోయాడు? పొట్టలో ఉన్న శిశువుకి బయట చెప్పే సోది వినిపించి మంచి సంస్కృతి, మంచి జీవితం, మంచి విలువలు నేర్పటం అనేది అబద్దం. ప్రహ్లాదుని విషయంలో ఆరోజుల్లో శైవులకి, వైష్ణవులకు జరిగిన ఆధిపత్య పోరాటంలో కల్పించిన కట్టుకథలు మాత్రమే ! వాటిని నిజమని నమ్మేవారు ఉన్నంతకాలం వీరి ఆటలు సాగుతాయి.
నార్నె వెంకటసుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img