Friday, April 19, 2024
Friday, April 19, 2024

గోదావరి`కావేరి అనుసంధానం మిగులు జలాలకు ఎసరు?

వి. శంకరయ్య

బిడ్డ చనిపోయినా పురిటి వాసన పోలేదనేది సామెత. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు కేరళలో పాగా వేసే మరులు ఇంకా పోయినట్లు లేదు. లేకుంటే ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానం తెర మీదకు ఎందుకు తెచ్చినట్లు? పైగా ప్రత్యామ్నాయ మైన ప్రతి పాదనల్లో పోలవరం కాలువ ఉపయోగించుకోమని ఈ నెల 6 వతేదీ జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్‌ చెప్పడం గోదావరి మిగులు జలాలను నీళ్లు వదులు కోవడమే . ఏ నదీ లోయలో గాని ఆ ప్రాంత ప్రజల అవసరాలు పూర్తిగా తీరిన తరువాత మిగులు నీరు వుంటే ఇతర నదీ లోయ ప్రాంతాలకు తరలించాలనేది సహజ న్యాయ సూత్రం. గతంలో నెహ్రూ హయాంలో డాక్టర్‌ కె.ఎల్‌. రావు, నరసింహారావు గంగా కావేరి అనుసంధానం ప్రతి పాదించిన సమయంలో తీవ్ర చర్చ జరిగింది. ఆయా నదీ లోయ ప్రాంత ప్రజల అవసరాల అంచనాలు తేల్చ లేక తుదకు ఎక్కడికక్కడ నదీలోయల్లో ప్రాజెక్టులు నిర్మించాలనే నిర్ణయాని కొచ్చారు. ఇప్పుడు గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం జలసంఘం అధికారికంగా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీకి తేల్చి చెప్పింది. అయినా పట్టువదలని విక్రమార్కునిలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటే పైగా జాతీయంగానూ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న సహజ న్యాయ సూత్రం ఉల్లంఘిస్తున్నదంటే దాని దుర్భుద్ధి తప్ప మరొకటి కాదు. గోదావరిలో దిగువ రాష్ట్రమైన ఎపికు మాత్రం చెందవలసిన మిగులు జలాలకు ఎసరు పెట్టడమే. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరిస్తే భవిష్యత్తు తరాల గొంతు నిలువునా కోయడమే.
అయితే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ వెదిరె శ్రీరాం ఛత్తీస్‌ఘడ్‌ ఉపయోగించుకొనని 140 టీఎంసీల నికర జలాలను తరించుతా మంటున్నారు. కాని ఛత్తీస్‌ఘడ్‌ ఈ పాటికే అంగీకరించలేదు. తత్ఫలితంగా ఈ సమావేశానికి ఛత్తీస్‌ఘడ్‌్‌ను ఆహ్వనించ లేదు. వాస్తవంలో ఇందులో ఆసక్తికర మతలబు వుంది. గతంలో ఛత్తీస్‌ఘఢ్‌లో బిజెపి ప్రభుత్వం వున్న సమయంలో ఇందుకు అంగీకరించింది. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అడ్డం తిరిగారు. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతి పాదించిన తొమ్మిది అనుసంధానాల్లో తొలిదైన మహానది గోదావరి అనుసంధానం చేపడితే తప్ప గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక మెట్టు దిగినట్లువుంది. ఇందుకు కారణం తెలంగాణకు చెందిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కారణం! ఈ ఎపి సోడ్‌ మరల చర్చించుకొదాం.
ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వముంది. ఆ ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంటోంది. అందుకే ప్రధాన మంత్రి డీల్‌ చేస్తున్నట్లు వెదిరె శ్రీ రాం చెప్పు కొచ్చారు. దీన్ని బట్టి పరిశీలిస్తే గోదావరి కావేరి అను సంధానం యెడల ప్రధానమంత్రి ఎంత ఆసక్తి చూపుతున్నారో అవగతమౌతుంది.
1989లో జాతీయ జల అభివృద్ధి సంస్థ తొమ్మిది అనుసంధానాలను ప్రతి పాదన చేసింది. మహానది (మణిభద్ర) గోదావరి (ధవళేశ్వరం). మహానది నుండి 823 కిలోమీటర్ల కాలవ తవ్వితే ధవళేశ్వరం వద్ద అంతమౌతుంది. 400 టియంసిలు తరలించగా మార్గం మధ్యలో 200 టియంసిలు వినియోగించగా 230 టియంసిలు ధవళేశ్వరం చేరుతాయని గోదావరి నుండి మిగిలిన ఎనిమిది అనుసంధానాలను ప్రతిపాదించారు. ఆదిలోనే దీనికి సంధి కొట్టింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా ఒడిషా అంగీరించలేదు. గమనార్హమైన అంశమేమంటే ఇటీవల జరిగిన సమావేశాల్లో ధవళేశ్వరం వద్ద 230 టియంసిలు చేరి ప్రయోజన మేమని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. కాగా నిన్న మొన్నటి వరకు మహానది గోదావరి అనుసంధానం జరిగితే తప్ప తాము గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించేది లేదని చెప్తూవచ్చిన కెసిఆర్‌ సర్కార్‌ ఈ నెల 6 వతేదీ జరిగిన సమావేశంలో మెత్త బడిరది. గోదావరిలో మిగులు జలాలు వుంటే (వాటిపై తెలంగాణకు హక్కు లేదు. ఎపికి మాత్రమే వుంది) అనుసంధానం చేయవచ్చని పైకి చెబుతూ మరో షరతు విధించింది. గోదావరి నదిపై తాము సమర్పించిన ప్రాజెక్టుల డిపిఆర్‌ ఆమోదించాలని కోరింది. డిపిఆర్‌ లు ఆమోదించుతామని చెప్పినట్లు వెదిరె శ్రీ రాం ప్రకటించడం కొసమెరుపు. ఎందుకంటే గోదావరి నదిపై నిర్మాణానికి తెలంగాణ తలపెట్టిన ప్రాజెక్టుల డిపిఆర్‌ ఆమోదించ వద్దని ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం పెట్టి వుంది. ఇవి ఆమోదం పొందితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే.
ఒక పక్క గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం చెబుతోంది. మరో వేపు గోదావరి నదిలో ఎవరి వాటా ఎంతో తేలలేదు. గోదావరి ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1480 టియంసిలు కేటాయించింది. ఇందులో తమ వాటా 967 టియంసిలని ఎపి వాటా 510 టియంసిలు మాత్రమే నని తెలంగాణ వాదిస్తోంది. ఆ మేరకు ప్రాజెక్టులను రూపొంది డిపిఆర్‌ లు సిద్ధం చేసింది. కాని ఆంధ్రప్రదేశ్‌ తమ వాటా 775 టియంసిలని తెలంగాణ వాటా 650 టియంసిలని వాదిస్తోంది. ఈ అంశం తేల్చేందుకు ట్రిబ్యునల్‌ వేయాలనే ప్రతి పాదన వున్న దశలో తెలంగాణకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైైర్మన్‌ చొరవతో ఏదో రూపంలో గోదావరి కావేరి అనుసంధానం పూర్తి చేసి ప్రధాన మంత్రి మోదీ ఆశయం నెరవేర్చేందుకు గోదావరిపై తెలంగాణ ప్రతిపాదన చేసిన ప్రాజెక్టుల డిపిఆర్‌ ఆమోదం పొందే అవకాశం వుంది. ఇదే జరిగితే గోడ దెబ్బ చెంప దెబ్బ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు తప్పదు. తెలంగాణ కోరినట్లు తన వాటా నీళ్లు దక్కించుకొంటుంది. మరో వేపు నీటి ఎద్దడి రోజుల్లో దిగువ రాష్ట్రమైన ఎపికి మాత్రమే చెంద వలసిన మిగులు వరదజలాలు తమిళనాడు, కేరళ దక్కించుకొంటాయి. టిడిపి హయాంలో ప్రతిపాదన చేసిన నదుల అంతర్గత నదుల అనుసంధానం మేరకు గోదావరి మిగులు వరద జలాలు 300 టియంసిల ఎపికి హుష్‌ కాకి అవుతాయి. అటు ఇటు దాదాపు 80 టియంసిలతో ఆంధ్రప్రదేశ్‌ సంతృప్తి చెందవలసి వస్తుంది. మున్ముందు రానున్న ఈ పెను ప్రమాదం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సాగునీటి రంగ నిపుణులు జాగ్రత్తపడకపోతే అందరూ కలసి భవిష్యత్తు తరాలకు తీవ్ర అన్యాయం చేసిన వారౌతారు.
ఇంతకీ ఈ నదుల అనుసంధానానికున్న పూర్వ చరిత్ర చూస్తే 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ తొమ్మిది అనుసంధానాలను ప్రతి పాదించింది. 1901-02 నుండి 1981-02 సంవత్సరాల మధ్య ప్రవాహ గణాంకాలు గోదావరిలో 75 శాతం నీటి లభ్యత మేరకు శ్రీ రాం సాగర్‌ ఇచ్చంపల్లి మధ్య 2337.59 టియంసిలు వున్నాయని ఇచ్చంపల్లి వద్ద 717 టియంసిలు మిగులు వుంటాయని లెక్కగట్టి తొమ్మిది అనుసంధానాలను 1989 లో ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒడిషా అంగీకరించక పోవడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. తెలంగాణ ఏర్పడిన తదుపరి మరో సర్వే జరిగింది. 2001-02 నుండి 2010-11 మధ్య గోదావరిలో 75 శాతం నీటి లభ్యత మేరకు 2108-5 టియంసిలుగా తేలింది. పైగా ఇచ్చంపల్లి నుండి 140 టియంసిలు కిందకు వదిలితేనే రెండు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని తేలింది. వాస్తవంలో ఈ లోపు తెలంగాణ చాలా పథకాలను ప్రతిపాదించింది. ఈ అంశంలో తెలంగాణతో పోల్చుకొంటే తెలంగాణ కన్నా అటు గోదావరి ఇటు కృష్ణ నదుల అంశంలో ఆంధ్రప్రదేశ్‌ నక్కకు నాగలోకానికొ ఉన్న తేడా చందంగా వుంటుంది. మొన్న 6 వతేదీ జరిగిన సమావేశంలో 75 శాతం నీటి లభ్యత కన్నా 50 శాతం నీటి లభ్యత లెక్కగట్టాలని తమిళనాడు అధికారి కోరారు. అదీ నీటియావ అంటే. ఇందు వలన నష్టపోయేది ఆంధప్రదేశ్‌ మాత్రమే. అయినా పోలవరం కాలువ ఉపయోగించుకోమని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు కోరారంటే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల క్షేమం కన్నా ప్రధాన మంత్రి మోదీ వద్ద మార్కులు వేసుకోవచ్చని తప్ప వేరు కాదు. మరో అంశం లేక పోలేదు. దేశంలో నదుల అనుసంధానానికి అంగీకరించే రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు రాయితీల అప్పులు ఇవ్వమని కేంద్ర జలశక్తి శాఖ స్థాయీసంఘం ఇటీవల సిఫార్సు చేసివుంది.
విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img