Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చిక్కడు దొరకడు

చింతపట్ల సుదర్శన్‌

రాత్రిపూట ఇంటికివచ్చిన చుట్టంలా ఈ వాన వెళ్లిపోను ఇష్టపడ్డంలేదు అన్నాడు పాత ఇంటి గోడకు వీపు ఆనించి కూచున్న అబ్బాయి. కాలాలన్నీ తిరగబడ్డట్టున్నాయి. టైం టేబిల్‌ మొత్తం దొబ్బింది. ఎప్పుడు వాన ముంచేస్తుందో ఎండ ఎప్పుడు ఏడిపిస్తుందో వాతావరణ శాఖకు కూడా అంతుతెలిసేట్టులేదు అంది గాడిద. వర్షం తగ్గేదాకా ఏదన్నా కథ చెప్పరాదు మనుషులు కథలు కల్పించడంలోనూ, చెప్పడంలోనూ ఎక్స్‌పర్ట్‌లు కదా అంది కుక్క తడిసిన ఒళ్లు దులిపేసుకుంటూ. అబ్బాయి కథ మొదలుపెట్టాడు.
అనగనగా ఓ రాజ్యం ఉంది. రాజ్యం అన్నాక ఓ రాజధాని, ఓ రాజు ఉండాలికదా అన్నది కుక్క చెవులు రిక్కించి. రాజ్యం రాజధాని, రాజా ఉన్నారు. వినండి కథ అంటూ కంటిన్యూ చేశాడు అబ్బాయి. ఆ రాజ్యంలో ఓ మారుమూల గ్రామం ఉంది. చాలా చిన్న గ్రామం జనాభా నూటిపైన కొంచెం కంటే మించదు. గ్రామానికి ఆనుకుని ఓ అడవి కూడా ఉంది. అడవిలో పెద్ద మర్రి చెట్టు దాని ఊడలు పట్టుకు ఉయ్యాలలూగే దయ్యాలు కూడా ఉన్నాయి. అంతే కదా అని పళ్లు బైట పెట్టింది గాడిద. ఏన్నో కథలు, కాగితాలు నమిలి ఉంటావు కదా బాగా ఊహిస్తావు అయితే మర్రి మీద ఉన్నది వెర్రి దయ్యం కాదు ఓ జడభూతం. అది పొరుగూరుకు పనిమీద వెళ్లి రాత్రివేళ గ్రామంలోకి వచ్చే వాళ్లను గప్‌చుప్‌గా మింగేస్తుండేది. గాడిద ‘బ్రో’ లా నమిలా లేక నాలా నమలకుండానా అంది కుక్క నాలుకను నోటినుంచి ఓ పక్కకు వేలాడేస్తూ.
భూతం ఇలా చేతికి చిక్కిన మనుషుల్ని మింగేస్తుండటంతో గ్రామంలో జనం తగ్గి పోసాగారు. ఊరువల్లకాడో, వైకంఠధామమో అవుతుందని గ్రామస్తులంతా కలిసి ఓ ఏడుగురు పెద్ద మనుషుల్ని ఎన్నుకున్నారు. ఎందుకూ వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టేందుకా అంది గాడిద. ఓ కథలోంచి మరో కథలోకి లాక్కుపోకు అంటూ కోప్పడ్డాడు అబ్బాయి. నువ్వు కానీ అంది కుక్క. ఈ ఏడుగురూ సుదూరంలో ఉన్న రాజధానికి వెళ్లి రాజు గార్ని కలిసి తమ గోడు వినిపించి భూతాన్ని చంపడానికి సైన్యాన్ని పంపమని వేడుకోవడానికి బయలుదేరారు. రాజధాని అంత దూరంలో ఉందా పాపం ఎలా వెళ్లారు. ఆ కాలంలో ‘ఊబర్‌’ కాని ‘ఓలా’ కానీ ఉండేవి కాదు గదా అంది కుక్క. ఎంత దూరమైనా సరేనని ‘లిఫ్టు’ దొరికతే బండ్లమీద దొరక్కపోతే కాలినడకన ‘జర్నీ’ చేస్తూ ఏడురోజులకి రాజధాని చేరుకున్నారు. ఇంకేం వాళ్లు రాజును కలిస్తే వాళ్ల ఊళ్లో అర్థాంతరపు చావులు ఆగినట్ట్టే అన్నవి కుక్కా గాడిద జంటగా.
కలవడానికి రాజక్కడ ఉంటేగదా. రాజు రాజధానిలో లేడని ఆయన అక్కడికి ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న మరో రాజధానిలో ఉన్నాడని అన్నారక్కడి వాళ్లు. ఇక్కడున్న ఈ రాజధానికాక మరో రాజధాని ఉందని తెల్సుకుని ఆ రాజధానికి బయల్దేరారు ఏడుగురు పెద్దమనుషులు. కొండలూ, గుట్టలూ, లోయలూ, అరణ్యాలు పట్టిపోతున్నవాళ్లల్లో ఇద్దరు ఆకలికి తట్టుకోలేక ఊళ్లో భూతం మింగాల్సిన వాళ్లు, ఓ నట్టడివిలో భూమ్మీద పడి మరిలేవలేదు అరెరే ఎంత పని జరిగింది. ఇప్పుడు ఇంక ఐదుగురే మిగిలారన్నమాట అంది లెక్కలు నేర్చిన కుక్క. పోయిన వాళ్లకోసం ఏడ్చి, మొత్తుకుంటూ మరో ఏడు రోజులకు ఐదుగురు పెద్దమనుసులు మరో రాజధాని చేరుకున్నారు. ఇంకేం వాళ్లు రాజును కలిస్తే వాళ్ల ఊళ్లో అర్థాంతరపు చావులు ఆగిపోయినట్టే అన్నవి గాడిదా కుక్కా జమిలిగా.
కలవడానికి రాజు అక్కడ ఉంటేగదా. రాజు ఆ రాజధానిలో కూడా లేడని ఆయన అక్కడికి మరెన్నో మైళ్లదూరంలో ఉన్న ఇంకో రాజధానిలో బిజీబిజీగా ఉన్నారని అన్నారక్కడివాళ్లు. ఒకటోదీ, రెండోదీకాక మూడో రాజధాని కూడా ఉందని తెలీదుకదా పాపం కాళ్లీడ్చుకుంటూ మళ్లీ అక్కడికి బయల్దేరి ఉంటారు మనోళ్లు అంది కుక్క. అవును ఆ అయిదుగురు మరో రాజధానివైపు నడక సాగించారు.. అలా నడుస్తున్న వాళ్లలో ఆకలి మళ్లీ ఇద్దరిని మింగేసింది. మిగిని ముగ్గురూ చివరకు ఆ రాజధానికి చేరుకున్నారు. ఇంకేం వాళ్లు రాజుని కలిస్తే వాళ్ల ఊళ్లో అర్థాంతరపు చావులు ఆగినట్టే అన్నవి గాడిదా కుక్కా ఒక్కటిగా.
కలవడానికి రాజు అక్కడ కూడా లేడు. ఆయన అంతకుముందు రోజే మందీ మార్బలంతో గుర్రమెక్కి ముగ్గురైన వాళ్లు ఏడుగురుగా ఉన్పప్పుడు వెళ్లిన మొట్టమొదటి రాజధానికి వెళ్లిపోయారని అన్నారు అక్కడివాళ్లు. ఒక్క ఉదుట్న లేచి నిలబడి తోక పైకెత్తి మొరగడం మొదలు పెట్టింది కుక్క. అదిరిపడ్డాడు అబ్బాయి. ఎండాకాలపు వానకు పిచ్చిగానీ ఎక్కలేదు కదా అని భయపడ్డాడు. భయపడకు అన్నా! పెద్దన్నా! ఒక్క రాజ్యానికి మూడు రాజధానులేమిటన్నా! చావు ముంచుకువస్తుంటే రాజు ఏ రాజధానిలో ఉన్నాడని చచ్చే జనం వెతుక్కు చస్తారన్నా. అందుకే మెదడు వేడెక్కి పిచ్చిగా అరవాలనిపిచింది అంది కుక్క.
మూడు రాజధానులూ తిరగడంలో వచ్చిన ఏడుగురు పెద్దమనుషులు ఐదుగురై చివరకు ముగ్గురే మిగిలారు. ఇక ఏ రాజధానిలో రాజుగారి దర్శన భాగ్యం లభిస్తుందో వారికి అస్సలు అర్థం కాలేదు. ఏ రాజధానికి వెళ్లాలో అర్థంకాని ఆ ముగ్గురూ ఏ ఊరుకాని ఊర్లోనో తమదికాని అడవిలోనో దిక్కులేని చావు చావడంకంటే సొంతూరికి వెళ్లి, ఊపిరి వదిలేయడం మంచిదనుకుని కాళ్లీడ్చుకుంటూ తమ ఊరికి తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు. అలా వెళ్లిన ముగ్గురూ తమ ఊరు చేరుకోలేదు. వారిలో ఇద్దరు దారికి ఖర్చుయిపోవడంతో ఒకే ఒక్కడు ఊరి పొలిమేరకు చేరుకోగలిగాడు.
మర్రిచెట్టు దిగివచ్చిన భూతం ఊరు చేరుకోబోతున్న పెద్దమనిషితో ఏరా ఏడుగురువెళ్తే ఒక్కడివే వచ్చావేం. మూడు రాజధానుల్లో రాజు ఎక్కడున్నాడో తెలీక చచ్చారా) వాళ్లు నా ఖాతాలోకి రాకుండా తప్పించుకున్నారు. ఒక ఈ ఊళ్లోఎవరూ మిగల్లేదని మరో ఊరిమీద పడదామను కుంటుంటే నువ్వు దొరికావు. ఇవాల్టికీ ఫుడ్డు ప్రాబ్లం లేనట్టే. రాజధాన్లు మూడూ, రాజు ‘చిక్కడు దొరకడు’ అయితే అన్నా ఊళ్లూ నావేరా అంది. ఊరువల్ల కాడైంది.
పెద్ద మనుషులు ఏడు, రాజధాన్లు మూడు మిగిలిందెవరన్నా అంతా సున్నా! సున్నా! అంది కుక్క తోకను గుండ్రంగా చుట్టి వాన తగ్గింది అంటూ అరుగు దిగి ఊళ్లోకి నడిచాడు అబ్బాయి. వాన వల్ల ఊర్లో కాగితాలన్నీ తడిసి ముద్దయి ఉంటాయి. రేపు ‘లంచ్‌’ ఎలాగో అంది గాడిద.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img