Friday, April 19, 2024
Friday, April 19, 2024

చిట్టూరికి శత వసంతాల అరుణాంజలి

బుడ్డిగ జమిందార్‌

కామ్రేడ్‌ చిట్టూరి ప్రభాకర చౌదరి మనమధ్యనుంటే సెప్టెంబరు 7, 2021న ఆయన శతజయంతిని జరుపుకొనేవాళ్లం. వారితో నా అనుభవాలు, నా జీవిత ప్రక్రియలో ప్రధాన ఘట్టం గానే చెప్పాలి. ప్రజలంతా వారిని ప్రేమాప్యాయలతో చౌదరిగారు అనేవారు. ఇది వారి కులానికి సంబంధించిన విషయం కానేకాదు. వారు ఈ సమాజంలో నాటుకు పోయిన కుల వ్యవస్థను సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వర్ణాంతర, ఆదర్శ వివాహం చేసుకుని అనేకమంది యువతీ యువకులకు స్ఫూర్తి దాయకమై పార్టీ పెళ్ళిళ్ళు దండల పెళ్ళిళ్ళలకు చిహ్నంగా నిలిచారు. మేము నిక్కర్లు వేసుకుని ఎలిమెంటరీ స్కూలుకు వెళ్ళే సమయంలో సువేగా మోపెడ్‌ (అప్పట్లో తిరుపతి బండి అనేవారు) వేసుకుని కనబడేవారు. వారిని చూసిన వెంటనే నమస్కారం సార్‌ అనేవాళ్ళం. చాలా పెద్ద మనసుతో ప్రతి నమస్కారం చేసేవారు. ఆ నమస్కారాలు నాలాంటి వారి ఎందరో జీవితాలపై అనుకూల ప్రభావం చూపాయంటే అతిశయోక్తి కాదు. వారి ప్రతి నమస్కారం మా భవిష్యత్తుకు ఆశీర్వచనాలుగా మా మదిలో మిగిలాయి.
1940వ దశకం చివరిలో / 1950 ప్రారంభంలో భారత కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు రాజమండ్రి సమీపంలోని చింతల నామవరంలోని ప్రజలు, మా చిన్నాన్నలు వారికి వసతి ఏర్పాటు చేసి ఇంట్లోని అటకపై దాచి ఉంచేవారని మా నాన్న మాచరరావు చెప్పారు. ఆదర్శ భావాలు కలిగి ఈ దేశంలో పీడిత ప్రజల వైపు నిలిచి, ఆస్తులుఅంతస్తులు అన్ని వదులుకుని వచ్చిన ప్రభాకర చౌదరి అప్పట్లో పార్టీ సభ్యత్వం అడిగితే, ముందు నీవు ఒక కార్మిక సంఘాన్ని నెలకొల్పితే అప్పుడు సభ్యత్వం వస్తుందని పార్టీ చెప్పినట్లు ఆయన నాతో చెప్పారు. కార్మిక సంఘాలు నెలకొల్పటానికి పారిశుద్ధ్య కార్మికులను సమీకరించడం అనువుగా భావించి మురికివాడలలోనే నివసించి, నెలల తరబడి వారితో పాటు తింటూ, పాచిపోయిన అన్నాన్ని సయితం లెక్కచేయక ఆకలి తీర్చుకుని వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమైనారు. సంఘాన్ని నెలకొల్పారు, విజయాలు సాధించారు. రాజమండ్రి పట్టణంలో ఎక్కడ కార్మికుడుంటే అక్కడకు వెళ్ళి పార్టీ సిద్ధాంతాలను బోధిస్తూ అనేక పదుల సంఖ్యలో ట్రేడ్‌ యూనియన్‌ సంఘాలను స్థాపించారు. ఉద్యమాన్ని బలోపేతం చేసారు. జట్లు లేబర్‌ యూనియన్‌ చరిత్ర ఇప్పటికే సువర్ణాక్షరాలతో లిఖితమైనది. తెలుగు నాట అనేక సంఘాలు వెలిసాయి. సమాంతరంగా విజయవాడ, గుడివాడ వంటి చోట్ల ఆదర్శంగా తీసుకుని కార్మిక సంఘాలకు పునాదులు ఏర్పడ్డాయి. మా ఇల్లు రాజమండ్రి పేపరుమిల్లు ఎదుట మెయిన్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న శ్రీరామ్‌నగర్‌లో. మా యింటికి 300 గజాల దూరంలో పేపరుమిల్లు వర్కర్స్‌ యూనియన్‌ ఉండేది. ఊహ తెలిసినప్పటి నుంచి నా అడ్రస్‌ అంటే నా స్కూలు లేదా పేపర్‌మిల్‌ యూనియనే. సరదాగా యూనియన్‌లో చిన్నచిన్న రాత పనులు చేసేవాణ్ణి. అప్పటికి నాకు ఇంకా 10వ తరగతి కూడా పూర్తికాలేదు. లీవు లెటర్లు రాయడం, సభ్యత్వం నమోదులు, గోడలపై రాతలు వంటివి హుషారుగా చేసేవాణ్ణి, అందరూ నన్ను ఇష్టపడేవారు. కొమ్మన సత్యం, నీలం సత్యనారాయణ, చిన్నారావు, తుమ్మలావ ఆంజనేయులు మరెంతోమంది మధ్యలో నేనుచిన్నపిల్లవాడిగా మసిలేవాణ్ణి. చౌదరి గారికి సమయం దొరికి నప్పుడల్లా నన్ను తన ప్రక్కన కూర్చోపెట్టుకుని చదువుకు సంబంధించిన విషయాలు అడిగేవారు. సైన్సు విషయాలు, ప్రకృతి గతితర్కం, ట్రేడ్‌ యూనియన్‌ఉద్యమం, మహా ప్రస్థానం, ఇంకా మరెన్నో విషయాలు నాకు చెప్పేవారు. కొన్ని అర్థమయ్యేవి కావు కానీ ఆసక్తిదాయకంగా వినేవాణ్ణి. ప్రశ్నించేవాణ్ణి, తర్కించేవాణ్ణి, ఇదే నా ఎదుగుదలకు దోహద పడిరది. 70వ దశకంలో కంచుకోటలాంటి పేపరుమిల్లు యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో రెండవసారి పోటీ చేసినపుడు ఓడిపోయింది. చౌదరిగారు పట్టు వీడలేదు. ఆ సమయంలోనే కార్మికుల చందాలతో యూనియన్‌ భవన నిర్మాణానికి నిధులు సమకూర్పించారు. అలుపెరుగని ఈ పోరాటం చేసి డిపార్ట్‌మెంట్స్‌లో యూనియన్‌ను పటిష్టం చేసి, నిరంతరం కమిటీ మీటింగులు, జనరల్‌ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసి నూతన జవసత్వాలను కార్మికులకు తీసుకువచ్చి 3వ సారి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఎన్నికల గుర్తు ‘ఇల్లు’ గనుక నేను అట్టలతో ఇంటిని తయారు చేసి ఇచ్చాను. గెలుపు, ఓటములను సమానంగా తీసుకునే మనస్తత్వం చౌదరిగారిది. ఎప్పుడూ నిరాశగా కనబడేవారు కాదు. తాను సమయానికి తిండి తినకపోయినా ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఆకలితో అలాగే ఉండేవారు. అప్పడప్పుడు నేను మా అమ్మను అడిగి మేము తినే దాంట్లో ఒక స్టీలు కంచంలో అన్నంపెట్టి, కొంచెం కూరగాని, పప్పుగాని తీసుకుని చౌదరి గారికి పెట్టేవాణ్ణి. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు స్ఫురణకు వస్తే నా కళ్ళు చెమరిస్తాయి. వారు భోజనం అయిన తరువాత ప్లేటు కడగాల్సిన అవసరం లేదన్నంత శుభ్రంగా తినేవారు. కరివేపాకు గానీ, పచ్చిమిర్చిగానీ, ఒక్క అన్నం మెతుకుగాని మిగేల్చేవారు కాదు. ఒకవేళ అన్నం తినేటప్పుడు పొరపాటున కింద ఒక మెతుకు పడితే వేలితో తీసుకుని నోటిలో పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ప్రభావం నా పై వుంది. నేను ఒక మెతుకును కూడా వదలటానికి ఇష్టపడను. అవసరమైనంత వరకే వడ్డించు కుంటాను. మనకి అన్నాన్ని రైతులు, రైతు కూలీలు అందిస్తున్న గొప్పవరం. ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను జర్మనీ (జి.డి.ఆర్‌) లో వ్యవసాయ ఇంజనీరింగు (ఎమ్‌.టెక్‌.) పట్టభద్రుణ్ణి కనుక, 12 సం॥లు జిడిఆర్‌లో ఉన్నాను. ఇంటర్మీడియట్‌ తరవాత జిడిఆర్‌కు వెళ్ళి చదువుకున్నాను. 1975 ప్రాంతంలో చౌదరి గారు సోవియట్‌ యూనియన్‌ సందర్శించి వచ్చారు. నేను 10వ తరగతి చదువుతున్నాను. సన్మాన సభ ఆర్యాపురం టింబర్‌ మర్చంట్‌ హాల్‌లో జరిగింది, నేను సోవియట్‌ యూనియన్‌ గురించి రాసిన కవిత చదివి ఆయనకు బహుకరించాను. అనేక దేశాల యువకులు మాస్కోలో చదువుతున్నా రని, నీకు చదువులో మంచి ఫలితాలు వస్తే నిన్ను మాస్కో పంపి స్తాను జమీందార్‌ అని ఒకప్పుడు అన్నారు, ఆ తర్వాత నేనది మర్చిపోయాను. ఇంటర్‌ తరువాత డిగ్రీలో చేరాను. చౌదరి గారు గమనించి జిల్లా, రాష్ట్ర పార్టీలతో సంప్రదించి నన్ను ఉన్నత చదువులకు పంపారు. నా జీవిత, జీవనరేఖను సంపూర్ణంగా మార్చేసారు. నా ప్రస్తుత జీవన శైలిలో అడుగడుగునా ఆయనే కనబడతారు. నన్నే గాని విదేశాలకు పంపించ కుండా ఉంటే నేను ఎక్కడ ఉండేవాణ్ణో! చౌదరిగారు అక్కడ విషయాలు అధ్యయనం చేయమని పదేపదేచెప్పేవారు. నేను నా వృత్తితో పాటుగా వారంవారం తెలుగుదినపత్రికలైన విశాలాంధ్ర, ప్రజాశక్తి, సాక్షి, ఆంధ్రజ్యోతి, మాసపత్రిక కమ్యూనిజంలో అంతర్జాతీయ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మిలటరీ రంగాలతో కూడిన వ్యాసాలు ఇప్పటి వరకూ 500కు పైగా రాసాను. ఈ వ్యాసాలన్నింటినీ పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇటీవల ముళ్ళపూడి సూర్యనారాయణగారి సంస్మరణ సభలో వారికి అంకితం చేసి నా అభిమానాన్ని చాటుకున్నాను. నా కలం నుండి జారుతున్న ప్రతీ అక్షరం, మెదడు నుండి వస్తున్న ప్రతి రాజకీయ ఆలోచన చౌదరిగారి మార్గదర్శకమే! చౌదరిగారి శత జయంతోత్సవం ఘనంగా జరుపుదా మనుకొన్నాం. కాని 4 నెలలు ముందు గానే చౌదరి గారు కాలం చేసారు. వారు భౌతి కంగా లేనప్పటికీ ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. పీడిత, తాడిత జనావళి మధ్య ఉంటారు. మానవ హక్కుల కోసం న్యాయ పోరాటాలు చేశారు. వారి స్పూర్తి భావితరాలకు దిక్సూచిగా నిలుస్తుంది. వారు పోరాడి సాధించిన విజయాలు అనేకం. కార్మిక రంగ జీవన ప్రమాణాలు పెరగడానికి కృషి సల్పడమే గాక, విద్యావేత్తగా హితకారిణి సమాజ అభివృద్ధికి పాటుబడ్డారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల స్థాపనలో వారే కీలకం, అలాగే ఆంధ్రకేసరి కళాశాలకు కూడా. రాజమండ్రి రోడ్‌కంరైలు బ్రిడ్జ్‌ రావడానికి కృషి చేసారు. ‘విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు’ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. సమైక్య ఆంధ్ర కోసం ప్రాణాలకు భయపడక కార్యకర్తలను సమీకరించి ఉద్యమాన్ని నడిపారు. వారు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే ముగిసే వరకూ వదలరు. అదే వారి బలం, బలహీనత కూడా. పైకి ఒకలాగ లోపల ఒకలాగ ఉండేవారు కాదు. మీటింగులో తాను చెప్పాలనుకొనే అంశాన్ని చివరికి పదిమంది మిగిలి ఉన్నా చెప్పేవారు. లేబరు ఆఫీసర్లుగానీ, మేనేజ్‌మెంటుగాని చట్టాల గురించి వారిని అడిగి తెలుసుకునేవారు. ప్రపంచ స్థాయిలో ఆలోచించి స్థానికంగా పనిచేయాలని అనేవారు. అందుకే వారికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ నాయకత్వహోదాలు లభించినా స్థానికంగా ఉండటానికే ఇష్టపడేవారు. రెండుసార్లు శాసనసభ్యునిగా ఉన్నా సొంత ఇల్లుకాని, వాహనాన్ని కాని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే, చివరి వరకూ నిబద్ధత కలిగిన పార్టీ సభ్యునిగా/నాయకునిగా, రాష్ట్ర పార్టీకి తనకు వచ్చే పెన్షను నుండే లెవీ చెల్లించేవారు. వారు ఆస్తులు సంపాదించుకోలేదు, పైగా ఉన్న పొలాన్ని, ఇంటిని అమ్మేశారు. కాని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. శామికవర్గం వారిని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకునే వారు. వారు నమ్మిన సమసమాజ స్థాపనకు మనమంతా కృషి చేయడమే మనం వారికి ఇచ్చే సంపూర్ణ నివాళి, ప్రజలే చౌదరిగారి ఆస్తి! ప్రజా జీవన ప్రమాణాల ఎదుగుదలే ఆయన లక్ష్యం. వారు ఎల్లవేళలా అంతర్జాతీయ శాంతిని కాంక్షించేవారు. భారతదేశంలో లాల్‌`నీల్‌ ఐక్యత కావాలని గట్టిగా కోరు కున్నారు. ట్రేడ్‌యూనియన్‌ పితామహా మీ ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తామని శపథం చేద్దాం. అందుకోండి ప్రియతమ క్రామేడ్‌ చౌదరిగారు మా నుండి విప్లవ అరుణాంజలి.
వ్యాస రచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
కార్యవర్గ సభ్యులు, 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img